
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ, చట్ట వ్యతిరేక విధానాలపై కోర్టుకు వెళ్లకతప్పడం లేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ ఏర్పాటు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజానుకూలంగా, రాజ్యాంగానికి లోబడి పాలన ఉంటే కోర్టులో పోరాడాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకుంటుందన్నారు. అన్ని శాఖల్లోనూ జేఏసీలు ఏర్పాటు కావాల్సిన అవసరముందన్నారు. న్యాయ, చట్ట, రాజ్యాంగపరమైన అంశాలపై అడ్వొకేట్లకు ఉన్న అవగాహన మరెవరికీ ఉండదన్నారు.
తెలంగాణలో హైకోర్టును ఏర్పాటు చేయాలి
తెలంగాణలో హైకోర్టును ఏర్పాటు చేయాలని అడ్వొకేట్స్ జేఏసీ తీర్మానించింది. దీంతోపాటు సీఆర్‌పీసీ 41ని రద్దు చేయాలని, న్యాయశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరింది. న్యాయవాదులకు హెల్త్ కార్డులు, ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగానే అడ్వొకేట్స్ జేఏసీ కన్వీనర్లుగా గోపాలశర్మ, కొండారెడ్డి, మల్లేశ్ ఎన్నికయ్యారు. కో కన్వీనర్లుగా మహమూద్, హస్మ రహీమా, బాబురావు, అంబటి శ్రీనివాస్, ధర్మార్జున్, ప్రసాద్ బాబు, ఉదయగిరి, వెంకటేశ్ యాదవ్, భాగ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment