ఏజెన్సీకి ఫీవర్‌... | Telangana Agency Villages In Grip Of Viral Fevers | Sakshi
Sakshi News home page

ఏజెన్సీకి ఫీవర్‌...

Published Mon, Jul 16 2018 2:10 AM | Last Updated on Mon, Jul 16 2018 2:10 AM

Telangana Agency Villages In Grip Of Viral Fevers - Sakshi

భూపాలపల్లి జిల్లా సూరివీడు గ్రామంలో జ్వరంతో మంచం పట్టిన ఓ గిరిజన కుటుంబం

సాక్షి, హైదరాబాద్‌: వారం పది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు విజృంభించాయి. అనేక తండాల్లో వేల మంది మంచం పట్టారు. ప్రధానంగా భూపాలపల్లి, భద్రాచలం జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాల్లో పెద్దసంఖ్యలో గిరిజనులు జ్వరాల బారిన పడ్డారు. మైదాన ప్రాంతాల్లోనూ జ్వరాల తీవ్రత పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 501 డెంగీ కేసులు నమోదు కాగా, 528 మలేరియా కేసులు రికార్డు అయ్యాయి. అలాగే 42 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. ఈ నెల 13న ఒకేరోజు 14 డెంగీ కేసులు నమోదైనట్లు ఆ శాఖ తన నివేదికలో వెల్లడించింది. జ్వరాల తీవ్రత పెరుగుతున్నా అధికార యంత్రాంగం ఇంకా సన్నద్ధం కాలేదు. ఇటీవలే అనేక మంది వైద్య సిబ్బందిని బదిలీ చేశారు. ఇంకొందరు బదిలీపై అసంతృప్తితో విధుల్లో చేరకుండా హైదరాబాద్‌ చుట్టూ తిరుగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

లక్షల మందికి విష జ్వరాలు సోకే ప్రమాదం 
రాష్ట్రంలో లక్షల మందికి విషజ్వరాలు సోకే ప్రమా దం ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రాథమికంగా అంచ నా వేసినట్లు తెలిసింది. కొన్నేళ్ల జ్వరపీడితుల గణాంకాలను పరిశీలిస్తే 70 శాతం కేసులు గిరిజన ప్రాంతాల్లోనే నమోదు కావడం గమనార్హం. మలేరియా పీడి త గ్రామాలు 2,067 కాగా.. డెంగీ ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలు సుమారు 1,414 ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 36 మున్సిపాలిటీలు కూడా విష జ్వరాల బారిన పడే ప్రమాదమున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మనదేశంలో ఇటీవలే జికా వ్యాధిగ్రస్థులను గుర్తించారు. ఈ వ్యాధి కారక దోమ, డెంగీ కారక దోమ ఒక్కటే కావడం, రాష్ట్రంలో డెంగీ జ్వరాలు భారీగా నమోదవుతుండడంతో వైద్య ఆరోగ్య శాఖ వర్గాల్లో ఆందోళన నెలకొంది. డెంగీ బారిన పడితే రక్తంలో ప్లేట్‌లెట్ల కౌంట్‌ తగ్గుతుంది. దీన్ని సొమ్ము చేసుకుంటూ అనేక ప్రైవేటు ఆసుపత్రులు వేలకు వేలు గుంజుతాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ పేరుతో ప్లేట్‌లెట్లను ఎక్కిస్తున్నారు. 



 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement