సాక్షి, కొత్తగూడెం: అసెంబ్లీ ఎన్నికలకు తెరదీసిన టీఆర్‌ఎస్ ఏకంగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారపర్వంలో దూసుకెళుతుండగా, కాంగ్రెస్ కూటమిలో సీట్ల లెక్కలు ఇప్పటికీ సశేషంగానే ఉన్నాయి. కూటమిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుని రెండు వారాలు దాటినప్పటికీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ పార్టీ ఏ సీటు తీసుకోవాలనే విషయమై ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దీంతో ప్రతిష్టంభన నెలకొంది. సీట్ల కేటాయింపునకు సంబంధించి జిల్లాలో పంపకంపైనే చిక్కుముడి వీడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కొత్తగూడెం, అశ్వారావుపేట సీట్ల విషయంలోనే కాంగ్రెస్‌కు సీపీఐ, టీడీపీలతో ముడిపడే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ఉన్న ఐదు శాసనసభ స్థానాల్లో ఏకైక జనరల్ స్థానం కొత్తగూడెం విషయంలో కాంగ్రెస్ పార్టీకి సీపీఐకి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎవరికి వారు ఈ సీటు తమకే కావాలని పట్టుబడుతున్నారు.
టీఆర్‌ఎస్‌ను ఓడించాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆ పార్టీ నుంచి టికెట్ల కోసం హోరాహోరీ ప్రయత్నాలు చేస్తున్న వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ చెపుతున్నారు. వీరిద్దరూ ఢిల్లీ స్థాయిలో టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అవకాశమిస్తే సీటును గెలిపించుకుని వస్తామని అధిష్టానం వద్ద వాదనలు వినిపిస్తున్నారు. సీపీఐకి ఆ సీటు ఇవ్వవద్దని గాంధీభవన్ వద్ద వనమా ఏకంగా ఆందోళన సైతం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొత్తగూడెం సీటు గెలవాలంటే ఏ పార్టీకి కేటాయిస్తే ఫలితమంటుందని కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది. మరోవైపు తమకు ఆది నుంచి బలమున్న కొత్తగూడెం సీటు ఇవ్వాల్సిందేనని సీపీఐ పట్టుబడుతోంది. సీపీఐ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని రేసులో ఉండడంతో ఈ సీటుపై ప్రతిష్టంభన నెలకొంది.
అశ్వారావుపేట టీడీపీకిస్తే సహకరింమంటున్న కాంగ్రెస్ శ్రేణులు..
పొత్తుల్లో భాగంగా టీడీపీ మొదటి నుంచీ ఆశిస్తున్న అశ్వారావుపేట సీటు విషయంలోనూ తకరారు నెలకొంది. గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన టీడీపీ ఈసారి ఆ సీటును పొత్తుల్లో భాగంగా కోరుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం సీట్లతో పాటు భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే ఈ సీటును కాంగ్రెస్ పార్టీకే కేటాయించాలని, టీడీపీకి కేటాయిస్తే ఏ మాత్రం సహకరించేది లేదని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గతంలో ఉన్న టీడీపీ కేడర్ మొత్తం టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిందని, ఈ నేపథ్యంలో నామమాత్రంగా బలమున్న టీడీపీకి తాము ఎందుకు సహకరించాలని కాంగ్రెస్ కార్యకర్తలు గుర్రుమంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి సున్నం నాగమణి, బాణోత్ పద్మావతి, కోలా లక్ష్మీనారాయణ, కారం శ్రీరాములు, ధన్‌జూనాయక్ టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్‌కు ఇస్తేనే టీఆర్‌ఎస్‌ను ఓడించడం సాధ్యమని పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. మొదట్లో జిల్లాలోని అశ్వారావుపేటతో పాటు ఇల్లెందు, పినపాక లేదా భద్రాచలం సీటు కావాలని టీడీపీ కోరింది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలోని సీట్లకు ప్రాధాన్యం ఇస్తోంది. కాగా, టికెట్ రేసులో ఉన్న పినపాక నియోజకవర్గానికి చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వట్టం నారాయణ పినపాక సీటును టీడీపీ కేటాయించాలని పట్టుబడుతున్నారు. పినపాక కాకుంటే భద్రాచలం సీటు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే విడతల వారీగా సర్వేలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం సీట్ల కేటాయింపు విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని అన్ని సీట్లకు కాంగ్రెస్ నుంచి ఆశావహులు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని సీట్ల విషయంలోనే కాంగ్రెస్ కూటమి పొత్తులకు చిక్కుముడి పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment