
తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. విపక్షాలు నిరసనలతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షాలు రైతుల ఆత్మహత్యలపై చర్చకు పట్టుబట్టాయి. అయితే ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం చర్చిద్దామని స్పీకర్ సూచించినా విపక్ష సభ్యులు పట్టువీడలేదు.
తెలంగాణ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా వారు తమ పట్టువీడలేదు. దాంతో సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినా విపక్షాలు నిరసన కొనసాగించారు. దాంతో స్పీకర్ సభను మరోసారి పదినిముషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
తిరిగి సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగారు. దాంతో సభకు ఆటంకం కలిగిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. పది మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఒక్క రోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ తీర్మానాన్ని శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి హరీష్ రావు ప్రతిపాదించగా స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం ప్రారంభమైన సభలో బడ్జెట్పై చర్చ జరిగింది. బడ్జెట్పై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి మాట్లాడిన తర్వాత స్పీకర్ మధుసుదనా చారి సమావేశాలను సోమవారానికి వాయిదా వేశారు.