సాక్షి, హైదరాబాద్ : తొమ్మిదో విడత అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు సభ మొదలవుతుంది. బడ్జెట్ సమావేశాలు కావటంతో తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. శాసనసభ, శాసనమండలి సభ్యులు అసెంబ్లీలోనే సమావేశమవుతారు. గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించేందుకు రాష్ట్ర కేబినెట్ ఒకటీ రెండు రోజుల ముందు సమావేశమవటం ఆనవాయితీ. కానీ గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఫైలు æసర్క్యులేషన్ విధానంలోనే గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. దీంతో ఈ ఏడాదీ అదే తరహాలో ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.
కౌన్సిల్ భవనం అప్పగించిన ఏపీ
రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం తమ అధీనంలో ఉన్న శాసనమండలి భవనాన్ని తెలంగాణకు అప్పగించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల అసెంబ్లీ కార్యదర్శులు జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు సరిపడే భవనాలు లేకపోవటంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న భవనాలను రెండు రాష్ట్రాలు పంపిణీ చేసుకున్నాయి.
సమైక్య రాష్ట్రంలో కౌన్సిల్ సమావేశాలు జరిగిన భవనాన్ని ఏపీ కౌన్సిల్‌కు అప్పగించగా, అక్కడి సమావేశ మందిరమైన జూబ్లీహాల్‌ను తెలంగాణ కౌన్సిల్‌గా మార్చారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. తాజాగా ఏపీ తమ కౌన్సిల్ భవనాన్ని అప్పగించటంతో.. తెలంగాణ కౌన్సిల్‌ను అందులోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిరోజున ఉభయ సభల సంయుక్త సమావేశం అనంతరం మంగళవారం నుంచి కౌన్సిల్ సమావేశాలను అందులోనే నిర్వహిం చాలని నిర్ణయం తీసుకుంది.
15న ఐదో బడ్జెట్!
తొలి రోజు గవర్నర్ ప్రసంగం అనంతరం 12 గంటలకు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ఇందులో నిర్ణయిస్తారు. ఇప్పటికే ఖరారు చేసిన దాని ప్రకారం 15వ తేదీన 2018–19 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న ఐదో బడ్జెట్ కావటం, సాధారణ ఎన్నికలకు ముందు ఇదే ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్ కావటంతో అసెంబ్లీ సమావేశాలు ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ప్రభుత్వం ఐదోసారి కూడా మరో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ కసరత్తుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ఆర్థిక శాఖ అధికారులతో ఇప్పటికే సమీక్షలు జరిపారు. మరోవైపు టీఆర్‌ఎస్ అధినేతగా అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించనున్నారు. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం, ఇటీవల ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర రాజకీయాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావటంతో సహజంగానే అన్ని పార్టీలు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment