పల్లెకు చేరిన సర్వే.. | Telangana braces for massive household survey on Tuesday | Sakshi
Sakshi News home page

పల్లెకు చేరిన సర్వే..

Published Tue, Aug 19 2014 3:26 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

పల్లెకు చేరిన సర్వే.. - Sakshi

పల్లెకు చేరిన సర్వే..

 పాలమూరు : రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించనున్న సమగ్రసర్వేకు జిల్లాలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సర్వేకు సంబంధించిన ఫారాలన్నింటినీ ఎన్యుమరేటర్లకు పంపిణీ చేశారు. సర్వే వివరాలు సేకరించేందుకు నియమించిన 39,498 మంది ఎన్యుమరేటర్లు గ్రామాలు, పట్టణాలకు బయల్దేరి వెళ్లారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్ల వారీగా సిబ్బందిని సమాయత్తం చేసి సర్వే కోసం పంపారు. సర్వేకోసం జిల్లాను 501 రూట్‌లు, 314 జోన్‌లుగా విభజించారు. సమగ్ర సర్వే కోసం జిల్లా వ్యాప్తంగా 1665 వాహనాలను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. అదేవిధంగా జిల్లానుంచి వివిధ ప్రాంతాలకు వలసవెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు కూడా వాహనాలను ఏర్పాటు చేశారు.
 
 నేడు అంతటా బంద్ వాతావరణమే
 రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు ముందుస్తుగా సెలవు ప్రకటించాయి. అన్ని ఆలయాల్లోనూ ఉదయం 8 గంటల లోపు పూజా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. బ్యాంకులు, సినిమా థియేటర్లు, వస్త్ర దుకాణాలు, పెట్రోలు బంక్‌లతోపాటు పట్టణ ప్రాంతాలు, పల్లెల్లో సైతం వ్యాపార సంస్థలు మూసివేయాలని నిర్ణయించారు. దీంతో జిల్లా సమస్తం సెలవు రోజుగా కనబడనుంది. ఇందుకుగాను జిల్లా కేంద్రంలోని పెట్రోలు బంకుల్లో సోమవారం రాత్రి వాహనాల రద్దీ కనబడింది. ప్రభుత్వం ముందస్తుగా సెలవు ప్రకటించడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వారంతా జిల్లాకు చేరుకున్నారు.
 
 పల్లెల్లో పండగ సందడి
 సంకురాత్రి పండ్గకు కూడా రాని .. పిల్లగాండ్లు... ఏ పండ్గా.. లేని దినాన ఇంటి కొచ్చిండ్రని.. తాతా అవ్వలు శానా ఖుషీ అవుతుండ్రు.. ఏండ్ల కొద్దీ ఊరు మొఖం చూడని ఉద్యోగస్తులు కూడా ఊర్లను వెతుక్కుంటూ వెళ్లి అమ్మ, నాన్నల దగ్గరకు చేరుకోవడం జిల్లా వ్యాప్తంగా అన్ని పల్లెల్లోనూ సందడి నెలకొంది. ఎక్కడెక్కడో ఉన్న వలస జీవులంతా ఊళ్లకు చేరుకుంటుండంతో ప్రతి ఇల్లూ.. పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. సమగ్ర కుటుంబ సర్వేను దృష్టిలో ఉంచుకొని ఎక్కడెక్కడో ఉంటున్న కుటుంబాల వారంతా మళ్లీ ఒకసారి తమ సొంతింటికి కట్టగట్టుకుని చేరుకుంటున్నారు. పండగలకు పబ్బాలకు వీలు కాక రాలేనివారు సైతం ఈ సర్వేకోసం రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. జిల్లాకు చెందిన 12 లక్షల మంది హైదరాబాద్, బెంగుళూరు, పూణె, ముంబై. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వలసకూలీలుగా, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగులుగా కొనసాగుతున్న దాదాపు 3లక్షల మంది ఇళ్లకు చేరుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement