పక్కాగా.. మూగజీవాల లెక్క | Telangana Cattle Calculations Warangal | Sakshi
Sakshi News home page

పక్కాగా.. మూగజీవాల లెక్క

Published Wed, May 8 2019 10:45 AM | Last Updated on Wed, May 8 2019 10:45 AM

Telangana Cattle Calculations Warangal

జనగామ: జిల్లాలో మూగజీవాల లెక్కను పశుసంవర్దక అధికారులు పక్కాగా తేల్చారు. 212 రోజుల పాటు గణన చేసిన అధికారులు జిల్లాలో 8,58,317 పశువులు ఉన్నట్లు గుర్తించారు. 2012 లెక్కలతో పోలిస్తే 3,65,361 పశువులు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా గొర్రెలు భారీగా పెరగగా... మేకలు తగ్గాయి. జాతీయ పశుగణన దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లాలో 2018 అక్టోబర్‌ ఒకటో తేదీన ప్రారంభించారు.

2019 ఏప్రిల్‌ 30 వరకు మూగ జీవాల లెక్క పక్కాగా లెక్కించారు. జిల్లాలో పశుసంవర్దక శాఖ అధికారులు ఇంటింటికీ తిరుగుతూ 212 రోజుల్లో ఈ ప్రక్రియను విజయవంతంగా  పూర్తిచేశారు. ప్రతి ఐదేళ్లకోసారి దేశవ్యాప్తంగా పశుగణన నిర్వహిస్తారు. జనాభా లెక్కల మాదిరిగానే గొర్లు, బర్లు, ఆవులు, కుక్కలు ఇలా అన్నింటి లెక్క పక్కాగా తేలుస్తారు. 2017లో పశుగణన నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో ఏడాది ఆలస్యంగా శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 52 మంది ఎన్యుమరేటర్లు,15 సూపర్‌ వైజర్లు మినీ ట్యాబుల ద్వారా పశుగణన పూర్తిచేశారు.

ఎలా లెక్కించారంటే..
జిల్లాలోని 12 మండలాలతో పాటు ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో విలీనమైన గుండాలలో కుటుంబాల లెక్కను గుర్తించారు. ఎన్యుమరేటర్లు ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటినీ సందర్శించారు. గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు, వాటి జాతులు, కోళ్లు, వాటి రకాలు, పందులు, కుక్కలు, తదితర పశుజాతులకు సంబంధించిన పూర్తివివరాలను ఇంటి యజమాని ద్వారా తెలుసుకున్నారు. ప్రతి ఎన్యుమరేటర్‌కు పట్టణంతో పాటు ఆయా మండలాల వారీగా బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో సుమారు 1,46,706 లక్షల పశువులు ఉన్న కుటుంబాల వద్దకు వెళ్లారు.

కోళ్లలో టర్కీ, నాటు, ఫారం రకాలు, గేదెల్లో ముర్రా, దేశవాలీ ఉంటాయి. మేకలు, పందులు, కుక్కలు, పెరటి కోళ్లు, సేద్యపు దుక్కిటెద్దుల వివరాలను వేర్వేరుగా సేకరించారు. పశుసంపదతో పాటు ఆ గ్రామంలో పశువైద్యశాల, పాల సేకరణ కేంద్రం, పశుగ్రాస క్షేత్రాలు, పశుగ్రాసాన్ని కొనుగోలు చేస్తున్నారా, లేక సొంతంగా సాగు చేసుకుంటున్నారా అనే విషయాలను ఎన్యుమరేటర్ల వద్ద ఉన్న మినీ ట్యాబుల్లో నిక్షిప్తంగా అప్‌లోడ్‌ చేశారు. యజమాని అక్షరాస్యుడా, నిరక్షరాస్యుడా, పశుసంపద ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, పశువులకు షెడ్డు ఉందా, లేక ఆరు బయటనే కడుతున్నారా, గోపాలమిత్ర కేంద్రం ద్వారా సేవలు ఎలా అందుతున్నాయి.. గొర్రెల సొసైటీలు ఎన్ని, పశువధశాలలు  ఉన్నాయా.. చికెన్, మటన్‌ స్టాల్స్‌ లెక్క పక్కాగా తేల్చారు.

లెక్కల ఆధారంగానే బడ్జెట్‌ కేటాయింపులు
పశుసంపదను కాపాడుకోవడమే కాకుండా పెంచుకునే దిశగా పాలక ప్రభుత్వాలు ఏటా బడ్జెట్‌ కేటాయిస్తుంటాయి. గణనలో తేలిన లెక్కల ప్రకారం వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులను వెటర్నరీ వైద్యశాలలకు కేటాయిస్తారు. బడ్జెట్‌ కేటాయింపులో హెచ్చుతగ్గుల్లో ఎలాంటి తేడా లేకుండా ప్రతి రైతు ద్వారా ఖచ్చిత వివరాలను తీసుకున్నారు. 

గణనలో తేలిన లెక్క ఎంత..
జనగామ జిల్లాలోని 12 మండలాలతో పాటు గుండాలలో 2019 పశుగణన లెక్కలో నల్ల, తెల్ల పశువులు, గొర్రెలు, మేకలు, పందులు, కుక్కలు, ఫౌల్ట్రీ,  పెరటికోళ్లు కలుపుకుని 19,62,155 లక్షలు ఉన్నట్లు పశుసంవర్దక శాఖ అధికారులు గుర్తించారు. 2012 లెక్కల ప్రకారం 15,96,744 మూగజీవాలు ఉండగా.. 2019 లెక్కల్లో 3,65,361 లక్షలు పెరిగాయి. ఇందులో గొర్రెలు గత ఐదు సంవత్సరాల కంటే 2,47,940 లక్షలు వృద్ధి చెందాయి. మేకలు 45 వేల 470 తగ్గుముఖం పట్టాయి. కుక్కల సంఖ్య మాత్రం 256కు పెరిగింది.

మూగ జీవాల వృద్ధి
2019 పశుగణన లెక్కల్లో వృద్ధి కనిపించింది. మూగజీవాలు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేటర్లు మినీ ట్యాబుల్లో పూర్తి వివరాలను నమోదు చేశారు. పశువులు, వాటి రకాలు, కోళ్లు, రకాలు, గొర్రెలు, మేకలు, పందులు, కుక్కలు, కోళ్ల పెంపకం, ఫౌల్ట్రీ ఇలా ప్రతిదీ  లెక్కలోకి తీసుకున్నాం. దీని ఆధారంగానే ఏటా ప్రభుత్వం వీటి సంరక్షణ కోసం బడ్జెట్‌ కేటాయిస్తుంది. గణనలో తేలిన లెక్కలకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదికల రూపంలో అందించాం. నర్సయ్య, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు, జనగామ 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement