Cattle competitions
-
పక్కాగా.. మూగజీవాల లెక్క
జనగామ: జిల్లాలో మూగజీవాల లెక్కను పశుసంవర్దక అధికారులు పక్కాగా తేల్చారు. 212 రోజుల పాటు గణన చేసిన అధికారులు జిల్లాలో 8,58,317 పశువులు ఉన్నట్లు గుర్తించారు. 2012 లెక్కలతో పోలిస్తే 3,65,361 పశువులు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా గొర్రెలు భారీగా పెరగగా... మేకలు తగ్గాయి. జాతీయ పశుగణన దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లాలో 2018 అక్టోబర్ ఒకటో తేదీన ప్రారంభించారు. 2019 ఏప్రిల్ 30 వరకు మూగ జీవాల లెక్క పక్కాగా లెక్కించారు. జిల్లాలో పశుసంవర్దక శాఖ అధికారులు ఇంటింటికీ తిరుగుతూ 212 రోజుల్లో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు. ప్రతి ఐదేళ్లకోసారి దేశవ్యాప్తంగా పశుగణన నిర్వహిస్తారు. జనాభా లెక్కల మాదిరిగానే గొర్లు, బర్లు, ఆవులు, కుక్కలు ఇలా అన్నింటి లెక్క పక్కాగా తేలుస్తారు. 2017లో పశుగణన నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో ఏడాది ఆలస్యంగా శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 52 మంది ఎన్యుమరేటర్లు,15 సూపర్ వైజర్లు మినీ ట్యాబుల ద్వారా పశుగణన పూర్తిచేశారు. ఎలా లెక్కించారంటే.. జిల్లాలోని 12 మండలాలతో పాటు ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో విలీనమైన గుండాలలో కుటుంబాల లెక్కను గుర్తించారు. ఎన్యుమరేటర్లు ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటినీ సందర్శించారు. గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు, వాటి జాతులు, కోళ్లు, వాటి రకాలు, పందులు, కుక్కలు, తదితర పశుజాతులకు సంబంధించిన పూర్తివివరాలను ఇంటి యజమాని ద్వారా తెలుసుకున్నారు. ప్రతి ఎన్యుమరేటర్‌కు పట్టణంతో పాటు ఆయా మండలాల వారీగా బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో సుమారు 1,46,706 లక్షల పశువులు ఉన్న కుటుంబాల వద్దకు వెళ్లారు. కోళ్లలో టర్కీ, నాటు, ఫారం రకాలు, గేదెల్లో ముర్రా, దేశవాలీ ఉంటాయి. మేకలు, పందులు, కుక్కలు, పెరటి కోళ్లు, సేద్యపు దుక్కిటెద్దుల వివరాలను వేర్వేరుగా సేకరించారు. పశుసంపదతో పాటు ఆ గ్రామంలో పశువైద్యశాల, పాల సేకరణ కేంద్రం, పశుగ్రాస క్షేత్రాలు, పశుగ్రాసాన్ని కొనుగోలు చేస్తున్నారా, లేక సొంతంగా సాగు చేసుకుంటున్నారా అనే విషయాలను ఎన్యుమరేటర్ల వద్ద ఉన్న మినీ ట్యాబుల్లో నిక్షిప్తంగా అప్లోడ్ చేశారు. యజమాని అక్షరాస్యుడా, నిరక్షరాస్యుడా, పశుసంపద ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, పశువులకు షెడ్డు ఉందా, లేక ఆరు బయటనే కడుతున్నారా, గోపాలమిత్ర కేంద్రం ద్వారా సేవలు ఎలా అందుతున్నాయి.. గొర్రెల సొసైటీలు ఎన్ని, పశువధశాలలు ఉన్నాయా.. చికెన్, మటన్ స్టాల్స్ లెక్క పక్కాగా తేల్చారు. లెక్కల ఆధారంగానే బడ్జెట్ కేటాయింపులు పశుసంపదను కాపాడుకోవడమే కాకుండా పెంచుకునే దిశగా పాలక ప్రభుత్వాలు ఏటా బడ్జెట్ కేటాయిస్తుంటాయి. గణనలో తేలిన లెక్కల ప్రకారం వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులను వెటర్నరీ వైద్యశాలలకు కేటాయిస్తారు. బడ్జెట్ కేటాయింపులో హెచ్చుతగ్గుల్లో ఎలాంటి తేడా లేకుండా ప్రతి రైతు ద్వారా ఖచ్చిత వివరాలను తీసుకున్నారు. గణనలో తేలిన లెక్క ఎంత.. జనగామ జిల్లాలోని 12 మండలాలతో పాటు గుండాలలో 2019 పశుగణన లెక్కలో నల్ల, తెల్ల పశువులు, గొర్రెలు, మేకలు, పందులు, కుక్కలు, ఫౌల్ట్రీ, పెరటికోళ్లు కలుపుకుని 19,62,155 లక్షలు ఉన్నట్లు పశుసంవర్దక శాఖ అధికారులు గుర్తించారు. 2012 లెక్కల ప్రకారం 15,96,744 మూగజీవాలు ఉండగా.. 2019 లెక్కల్లో 3,65,361 లక్షలు పెరిగాయి. ఇందులో గొర్రెలు గత ఐదు సంవత్సరాల కంటే 2,47,940 లక్షలు వృద్ధి చెందాయి. మేకలు 45 వేల 470 తగ్గుముఖం పట్టాయి. కుక్కల సంఖ్య మాత్రం 256కు పెరిగింది. మూగ జీవాల వృద్ధి 2019 పశుగణన లెక్కల్లో వృద్ధి కనిపించింది. మూగజీవాలు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేటర్లు మినీ ట్యాబుల్లో పూర్తి వివరాలను నమోదు చేశారు. పశువులు, వాటి రకాలు, కోళ్లు, రకాలు, గొర్రెలు, మేకలు, పందులు, కుక్కలు, కోళ్ల పెంపకం, ఫౌల్ట్రీ ఇలా ప్రతిదీ లెక్కలోకి తీసుకున్నాం. దీని ఆధారంగానే ఏటా ప్రభుత్వం వీటి సంరక్షణ కోసం బడ్జెట్ కేటాయిస్తుంది. గణనలో తేలిన లెక్కలకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదికల రూపంలో అందించాం. నర్సయ్య, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు, జనగామ -
పశువృద్ధి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని పశువుల గణన ఎట్టకేలకు లెక్కతెలింది. పశుసంవర్థశాఖ అధికారులు రైతుల ఇంటింటికి వెళ్లి జిల్లాలో ని పశువుల వివరాలను వివరాలను సేకరించారు. జనాభా లెక్కల మాదిరిగానే ప్రతీ ఐదేళ్లకోసారి గణన చేపడతారు. కిందటిసారి 2012లో గణన చేపట్టారు. అనంతరం 2017లో ని ర్వహించాల్సి ఉండగా.. కేంద్రం ఒక సంవత్సరం ఆలస్యంగా ఈ ప్రక్రియను చేపట్టింది. జిల్లాలో గతేడాది అక్టోబర్‌లో పశుగణనను ప్రారంభించారు. 48 మంది సిబ్బందికి ఎన్యుమరేటర్లుగా విధులు కేటాయించారు. వీరు ఈనెలలో గణను పూర్తి చేశారు. ఈ పశుగణన వివరాలను అధికారులు ఆన్లైన్లో పొందుపర్చుతున్నారు. అయితే జిల్లాలో గతం కంటే ఈసారి పశు సంపద పెరగడం గమనార్హం. ఐదేళ్లకోసారీ.. దేశంలో తొలిసారి 1919 సంవత్సరంలో పశుగణన చేపట్టారు. అప్పటి నుంచి ఈ ప్రక్రియ ఐదేళ్ల కోసారి ప్ర క్రియ కొనసాగుతూ వస్తుంది. ప్ర స్తుతం చేపట్టింది ఇరవయ్యోది. గతంలో మాన్యువల్ గణన చేపట్టేవారు. అయితే నూతన సాంకేతికి పరిజ్ఞానంతో ఈసారి ట్యాబ్ ద్వారా పశువులను గణించారు. ఇందు కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించి ఎన్యుమరేటర్లు రోజువారీగా సేకరించిన పశువుల వివరాలను ఎప్పటికప్పుడుఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఓ రైతుకు ఎన్ని పశువులున్నాయి. రైతు ఆధార్ నంబర్‌తోపాటు పశువులను ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ చేశారు. అలాగే రైతులకు సంబంధించిన సాంకేతిక వ్యవసాయ పరికరాలు, మత్స్యకారుల వలలు, తెప్పలు ఇతర పరికలను అడిగి తెలుసుకుని ప్రొఫార్మాలో నమోదు చేశారు. ఆ తర్వాత పశుగణన వివరాలతోపాటు వ్యవసాయ సాంకేతిక పరికారాలను అన్‌లైన్‌లోకి ఎక్కిస్తున్నారు. త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశుగణనవివరాలను అధికారికంగా ప్రకటించనున్నాయి. పెరిగిన పశు సంపద.. 2012లో చేపట్టిన పశుగణనలో కంటే ప్రస్తుతం నిర్వహించిన సర్వేలో పశుసంపద పెరిగినట్లు గణంకాలు చెబుతున్నాయి. 2012లో 84 వేల 497 కుటుంబాల సర్వే చేయగా, ఈసారి లక్షా 66వేల 987 కుటుంబాల్లో సర్వే చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం పశు పెంపకాన్ని ప్రోత్సహించడం వల్లనే జిల్లాలో పశుసంపద పెరిగిందని తెలుస్తోంది. ఇందుకు ఉదాహరణగా గతంలో 22,112 గొర్రెలుండగా, ఇప్పుడు ప్రభుత్వ ఇస్తున్న సబ్సిడీ కారణంగా వాటి సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగి 1,46,009కి చేరుకుందని భావిస్తున్నారు. కానీ, గత సర్వేలో ఒంటెలు 9 ఉండగా, ప్రస్తుతం ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం! పశుగణన సర్వే పూర్తయింది.. జిల్లాలో పశుగణన గతేడాది అక్టోబర్‌లో ప్రారంభించాం. ఈనెలలో ఆ సర్వే పూర్తయింది. పశువుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చుతున్నాం. ఈ గణనతో జిల్లాలో ఎన్ని పశువులున్నాయో తేలడంతో వాటికి అనుగుణంగా వాక్సినేషన్, మందులు అందుబాటులో ఉంచనున్నాం. – సురేష్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి -
ఎడ్ల పోటీలు ప్రారంభం
తెనాలిరూరల్ : తెనాలి, వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెనాలి మార్కెట్ యార్డులో ఆలపాటి శివరామకృష్ణయ్య స్మారక రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు మంగళవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ సారథ్యంలో ఆహ్వాన కమిటీ కన్వీనర్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పోటీలను ప్రారంభించారు. పోటీల ప్రారంభానికి సూచికగా బాలకృష్ణ కాగడాతో జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మమ్మీ, డాడీ తెలుగు పదాలని భవిష్యత్తు తరాలు పొరబడే ప్రమాదం ఉందని, దేశ భాషల్లో లెస్స అయిన తెలుగు భాషను కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు. బమ్మెర పోతన పద్యాలు, పలు సంస్కృత శ్లోకాలు, తన సినిమాలోని కులాలకు సంబంధించిన డైలాగులు చెప్పారు. పోటీల ప్రాంగణంలో గొర్రె పొట్టేళ్ల బండిపై తిరిగి, గుర్రపు స్వారీ చేసి అభిమానులను హుషారెత్తించారు. అంతకుముందు తెనాలి మారీసుపేటలోని తన బంధువు డాక్టర్ గవిని వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులను వారి స్వగృహానికి వెళ్లి పలుకరించారు. రావి అమ్మయ్య చౌక్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తదితరులు మాట్లాడారు. తొలుత రెండు పాలపళ్లలోపు విభాగం పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, మున్సిపల్ చైర్మన్ కొత్తమాసు తులసీదాసు, ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, ఆర్డీవో జి.నరసింహులు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్, మండల పార్టీ అధ్యక్షుడు కావూరు చంద్రమోహన్, కొత్త హరికుమార్, కొత్త శేషుకుమార్, వీరమాచనేని వెంకటేశ్వరరావు, సుంకర హరికృష్ణ, దాసరి జగన్ తదితరులు పాల్గొన్నారు. రెండు పళ్లలోపు విభాగంలో చేపట్టిన పోటీలు రాత్రిపొద్దుపోయే వరకు కొనసాగాయి. జీడీసీసీబీ చైర్మన్ ముమ్మనేనికి గాయాలు తెనాలిరూరల్ : ఎడ్ల పోటీల్లో గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య గాయాలపాలయ్యారు. తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలో మంగళవారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో రెండు పళ్లలోపు విభాగం పోటీల్లో పాల్గొన్న తొలి జత యజమానికి జ్ఞాపికను బహూకరించేందుకు నిర్వాహకులు ఆయన్ను కోర్టులోకి ఆహ్వానించారు. జ్ఞాపికను బహూకరించిన వెంటనే గిత్తలు కాడి నుంచి తప్పించుకుని కోర్టులో ఉన్న జనం మీదకు దూకాయి. దీంతో తోపులాట జరిగి వెంకట సుబ్బయ్య కిందపడిపోవడంతో గిత్త కాలు ఆయన ముఖానికి తగిలింది. గాయాలపాలైన సుబ్బయ్యను వెంటనే తెనాలి ప్రకాశం రోడ్డులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.