లాక్‌డౌన్‌ పొడిగించాలి | Telangana CM KCR Asks PM Modi To Extend Lockdown | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ పొడిగించాలి

Published Tue, Apr 7 2020 1:22 AM | Last Updated on Tue, Apr 7 2020 7:25 AM

Telangana CM KCR Asks PM Modi To Extend Lockdown - Sakshi

సోమవారం ప్రగతిభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదికను చూపిస్తున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘ఏప్రిల్‌ 15 తర్వాత దేశం లాక్‌డౌన్‌ పొడిగించడానికే నా మద్దతు. కోవిడ్‌–19తో జరిగే ఆర్థిక నష్టం నుంచి మనం కోలుకోగలం కానీ పోయిన ప్రాణాలను వెనక్కి తీసుకుని రాలేం. భారతదేశంలోని దుర్భర సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది కొరత ఉన్న ప్రస్తుత పరిస్థితిలో మనం ఈ వైరస్‌ను ఎదుర్కోలేం. కేవలం లాక్‌డౌన్‌ ఒక్కటే ఆయుధం. మనం యూకే, సింగపూర్‌ కన్నా ఎక్కువ కాదు. మనం ఆర్థికంగా మెరుగ్గా ఉండే. దురదృష్టవశాత్తు ఈ విపత్తు వచ్చిపడింది. ఎలాంటి సంశయం లేకుండా లాక్‌డౌన్‌ను పొడిగించాలని నేను ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న. ప్రతి రాష్ట్ర సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదింపులు జరిపి అత్యంత జాగ్రత్తతో నిర్ణయం తీసుకోవాలి.

ఈ ప్రాణాంతక వైరస్‌ను ఎదుర్కోవడానికి మన వద్ద మరో గత్యంతరం లేదు. ఆర్థికంగా పుంజుకోవడానికి ఆరేడు నెలలు పట్టవచ్చు. లాక్‌డౌన్‌ పొడిగించడం ఒక్కటే ఆయుధం అని నా అనుభవం, విజ్ఞానంతో చెబుతున్న’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. కేంద్రం లాక్‌డౌన్‌ పొడిగించకపోతే రాష్ట్రంలో పొడిగించాలని అనుకుంటున్నానని చెప్పారు. సమాజానికి ఇదే మేలు చేస్తుందని, దీనిపై తెలంగాణ సమాజాన్ని అడగాలనుకుంటున్నానని తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

ఎత్తేస్తే నియంత్రించలేం...
కరోనా ప్రపంచానికి వచ్చిన పెద్ద పీడ. ఇది వ్యక్తికో, కుటుంబానికో, ఊరికో వచ్చింది కాదు. యావత్తు మానవజాతి ఎదుర్కొంటున్న సంక్షోభం. లాక్‌డౌన్‌ వల్లే సమాజాన్ని బతికించుకున్నాం. అమెరికాకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బీసీజీ) భారత్‌లో జూన్‌ 3 వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాల్సి ఉంటుందని చెబుతోంది. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఇదే. లాక్‌డౌన్‌ ఎత్తేసి, వదిలేస్తే ఎవరిని వదలాలి. ఎవరిని వద్దు. ఒక్కసారిగా అన్ని మార్కెట్లు తెరుచుకుంటాయి. మళ్లీ బస్సులు, రైళ్లు, విమానాలు స్టార్ట్‌ చేస్తమా? ఎక్కడ ఆగుతం.

ఒకసారి గేట్‌ తీసి నువ్వు ఆగు, నువ్వు ఉండు అంటే చాలా ఇబ్బంది  అవుతది. వాళ్లు ఎక్కువనా, నేను తక్కువనా అని భేదభావాలు వస్తయి. లాక్‌డౌన్‌ పొడిగించాలని నా సూచనను దేశం ముందు పెడుతున్న. దీనిపై ప్రధాని కూడా ఆలోచిస్తున్నరు. అందరితో సంప్రదింపులు జరుపుతామన్నరు. పేదలకు రేషన్, వారి ఖర్చులు ఆలోచించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది వలస కూలీలకు మేమే తినిపిస్తున్నం. అన్ని వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, ఆలయాల భిక్షగాళ్లు, ట్రాన్స్‌జెండర్లకు ఏర్పాట్లు చేస్తున్నం. కనీసం ఒకటి రెండు వారాలు లాక్‌డౌన్‌ పొడిగించాలి. తర్వాత పరిస్థితిని సమీక్షించాలి. 22 దేశాలు మొత్తం లాక్‌డౌన్‌ చేయడం చిన్న విషయం కాదు. సింగపూర్‌ లాక్‌డౌన్‌ ఎత్తేసి పోజులు కొట్టి తర్వాత కంట్రోల్‌ చేయలేక మళ్లీ విధించింది. చైనా కూడా మళ్లీ లాక్‌డౌన్‌ చేస్తోంది.
 

లాక్‌డౌనే బండ సూత్రం
బీసీజీ చాలా పెద్ద సంస్థ. మన ఒక్క దేశం మీద కాకుండా మొత్తం ప్రపంచం అంతా కరోనా ప్రభావం ఎలా ఉంటదన్న అంశంపై గణిత శాస్త్రం ఆధారంగా పరిశోధన చేశారు. భారతదేశంలో ప్రస్తుతం వేసవి కావడంతో 40–48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పోతుంది. వీరికి తక్కువ ప్రభావం ఉండే అవకాశముందని బీసీజీ చెప్పింది. లాక్‌డౌన్‌ వంటి కఠిన నిర్ణయాలు లేకపోతే జూన్‌ 3 వరకు వ్యాధి తీవ్రత పరాకాష్టకు చేరుకుంటుందని.. ఇప్పుడు అమెరికా, ఇటలీ, స్పెయిన్‌లో ఉన్న పరిస్థితి మన దేశంలో ఉత్పన్నం అవుతుందని చెప్పింది. కష్టమో నష్టమో ఇప్పటికే 21 రోజులు లాక్‌డౌన్‌ పెట్టుకున్నం. వైరస్‌ ప్రభావం మొత్తం పోలేదు. వ్యాప్తి చెందుతూ ఉంది. ఒక్కసారిగా లాక్‌డౌన్‌ ఎత్తేస్తే 21 రోజుల తపస్సు గంగలో కలిసినట్టే. వైకుంఠపాళిలో పెద్దపాము తరహాలో ఉంటది. ఇంకో వారమో 10 రోజులో 15 రోజులో పొడిగించుకుంటే ఇబ్బంది ఉండదు. నిజాముద్దీన్‌ ఘటన లేకుంటే తెలంగాణ ఆరామ్‌గా ఉండేది. ఆడ ఒకటి ఈడ ఒకటి కేసులు వచ్చేదేమో గాని ఇంత భయం ఉండేది కాదు. మర్కజ్‌కి వెళ్లినవారితో పాటు వారి కుటుంబ సభ్యులను కలిపి 3 వేల మందిని గుర్తించినం. ఈ సంఖ్య ఇంకో వెయ్యికి పోతదా తెలియదు. మన చేతిలో ఉంది లింక్‌ కట్‌ చేయడమే. లాక్‌డౌనే బండ సూత్రం.

కంట్రోల్‌ చేసే పరిస్థితిలోనే ఉన్నాం
దేశం మొత్తం నిరవధిక లాక్‌డౌన్‌ ఫలితంగా మన రాష్ట్రం, దేశం అద్భుత ఘన విజయం సాధించిందనడంలో సందేహం లేదు. మన దేశ జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే కరోనా సోకిన వారి సంఖ్య ఈ నిమిషానికి 4,314 కాగా మరణించిన వారి సంఖ్య 122. దేశవ్యాప్తంగా చూస్తే మనం సురక్షిత విధానాలను పాటిస్తున్నామని అంతర్జాతీయ జర్నల్స్‌ చెప్తున్నాయి. లేదంటే మనం చాలా భయంకర పరిస్థితిలో ఉండేవాళ్లం. అమెరికా వంటి దేశాల్లో చాలా భయంకర పరిస్థితి. ఆర్థిక రాజధానిగా చెప్పుకునే న్యూయార్క్‌లో శవాల గుట్టలను ఐస్‌ నింపిన ట్రక్కుల్లో పంపిస్తున్నట్లు అక్కడ కథనాలు వస్తున్నాయి. శవాలను తగలబెడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. కొడుకులు, బిడ్డలు ఎవరూ చూసే పరిస్థితి లేదు. మౌలిక వసతులు, బలమైన ఆర్మీఉన్నా అమెరికాది అసహాయ పరిస్థితి. అక్కడ రెండు లక్షల మంది చనిపోతారని ఆ దేశ అధ్యక్షుడు చెప్తున్నాడు. ఆ నిష్పత్తిలో మనకు వస్తే కోట్లాది మంది చనిపోయేవాళ్లు. ఒకరకంగా కంట్రోల్‌ చేసే పరిస్థితిలోనే మనం ఉన్నాం.

మొదటి దశలో 25,937 మంది క్వారంటైన్‌కు
మొదటి దశలో రాష్ట్రానికి విదేశాల నుంచి తిరిగివచ్చిన వారి ద్వారా కొంత మందికి వైరస్‌ ట్రాన్స్‌మిట్‌ అయింది. ఇప్పటి వరకు 25,937 మందిని క్వారంటైన్‌ చేశాం. మొదటి దశలో 50 మందికి జబ్బు సోకగా, ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారు 30 మంది. వాళ్లు ఇక్కడ వాళ్ల కుటుంబ సభ్యుల్లో మరో 20 మందికి అంటించారు. అదృష్టం కొద్దీ వీరిలో ఒక్కరూ చనిపోలేదు. ఇప్పటివరకు 35 మంది డిశ్చార్జి చేశాం. మరో 15 మందిని ఎల్లుండిలోగా పంపించి వేస్తాం. మొదటిదశలో క్వారంటైన్‌కు తీసుకున్న 25,937 మందిలో ప్రస్తుతం 258 మంది మాత్రమే పర్యవేక్షణలో ఉన్నారు. వీరిని రేపు సాయంత్రానికి పంపించి వేస్తాం. మొత్తంగా ఈ నెల 9 వరకు అందరూ సంతోషంగా ఇంటికి వెళ్తారు.

‘నిజాముద్దీన్‌’తో అతలాకుతలం
రాష్ట్రంలో ఇప్పటి వరకు 364 మందికి కరోనా సోకగా, ఇండోనేషియన్లు పది మందిని కలుపుకుని మొత్తం 45 మందిని డిశ్చార్జి చేశాం. 11 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మరణించారు. నిజాముద్దీన్‌ ఘటనతో దేశమంతా అతలాకుతలమైంది. నిజాముద్దీన్‌ పర్యటనకు సంబంధించి 1,089 మంది రాష్ట్రానికి తిరిగి రాగా, మరో 30 నుంచి 35 మంది ఢిల్లీలోనే ఉన్నారు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన వారిలో 172 మందికి వైరస్‌ సోకగా వీరిలో 11 మంది మరణించారు. ఈ 172 మంది నుంచి మరో 93 మందికి వైరస్‌ సోకింది. నిజాముద్దీన్‌కు సంబంధించి సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన 3,015 మంది దాకా వివరాలు తీసుకున్నాం. వీరందరికీ పరీక్షలు చేస్తుండగా, ఇప్పటి వరకు సుమారు వేయి మందికి నెగటివ్‌ వచ్చింది. ఈ రోజు 600 మందికి పరీక్షలు నిర్వహించాం. ఎల్లుండి లోగా పరీక్షలు పూర్తి చేస్తాం. ఇప్పటి వరకు జరిపిన పరీక్షల ప్రకారం చూస్తే వారిలో 10 నుంచి 12 శాతం మందికి వైరస్‌ సోకే అవకాశం ఉంది. అంటే మరో వంద మందికి వైరస్‌ సోకే అవకాశం ఉంది. వీరి ద్వారా ఎవరికైనా వైరస్‌ సోకితే పరిస్థితి చెప్పలేని విధంగా ఉంటుంది. నిజాముద్దీన్‌ వెళ్లినవారిలో ఎవరైనా మిగిలి ఉంటే రిపోర్టు చేయాలని కోరుతున్నా.

కరోనా వస్తే కోటీశ్వరులైనా గాంధీలో ఉండాల్సిందే 
కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చినవారు కోటీశ్వరులైనా, లక్షాధికారులైనా గాంధీలో ఉండాల్సిందే. అక్కడ ఐసీయూ, వెంటిలేటర్లు, ఆక్సిజన్, ఐసోలేషన్‌ వార్డులు అందుబాటులో ఉంటాయి. కోవిడ్‌ చికిత్స కోసం ప్రత్యేకంగా ఎనిమిది ఆసుపత్రులను నోటిఫై చేస్తున్నాం. వాటి వివరాలను అధికారికంగా వెల్లడిస్తారు.

బతికుంటే బలుసాకు తినొచ్చు
ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందనే వితండవాదం కూడా ఉంది. తెలంగాణకు సగటున రోజుకు రూ.400 కోట్ల నుంచి రూ.440 కోట్ల వరకు ఆదాయం రావాలి. కానీ మార్చి మొదటి వారంలో 15 రోజులు ఆదాయం వచ్చింది. మిగతా 15 రోజులు హళ్లికి హళ్లి సున్నకు సున్న. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. దేశం గతి కూడా ఇలానే ఉంది. కానీ మరణాల పరంగా చూస్తే మన వద్ద తక్కువ ఉండటం సంతోషం. బతికుంటే బలుసాకు తిన్నట్లు కలోగంజో తాగి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టుకుందాం.

ప్రధాని మీద జోకులు, సెటైర్లా?
సోషల్‌ మీడియా యాంటీ సోషల్‌ మీడియాగా మారింది. విపత్తులు ఉన్న సమయంలో ప్రధాని జ్యోతి వెలిగిస్తే ఇదేం వెకిలి సంస్కారం. పీఎం పిలుపు మీద జోకులు, సెటైర్లా. జ్యోతి వెలిగించడం వంటి వాటిని సంఘీభావ సంకేతం అంటాం. కష్ట సమయంలో ఒకటిగా ఉన్నామని జాతి ఐక్యతను చాటేందుకు ఇలాంటి చర్యలు ఉపయోగపడతాయి. తెలంగాణ ఉద్యమంలోనూ ఊరూరా జేగంటలు మోగించాలని పిలుపునిచ్చాం. అప్పుడు కూడా కొందరు వెధవలు విమర్శ చేసినా, తెలంగాణ కోసం ఇలా వంద ప్రక్రియలు చేశాం. సమస్య మీద ఉద్యమిస్తున్నపుడు సంఘీభావం, మనిషికి మనిషి ధైర్యం చెప్పే సందర్భాలు అవసరం. ప్రధాని ఒక వ్యక్తి కాదు వ్యవస్థ. ఆయన పిలుపులో సమాజ, దేశ శ్రేయస్సు ఉంటుంది. ప్రస్తుత సమయంలో తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వైద్య సిబ్బంది, అధికారులకు నా తరపున పాదాభివందనం. కుటుంబాలను త్యాగం చేసి వారు చేస్తున్న సేవలను ప్రోత్సహించాలి.

అవన్నీ బోగస్‌ రాతలు..
అత్యవసర ఔషధాల కొరత లేదు. దీనిపై సీరియస్‌గా రివ్యూ చేయాలని సీఎస్‌కు కోరుతున్న. ఎక్కడన్న కొరత ఉంటే సీఎస్‌ను, ఆరోగ్య మంత్రికి ఫోన్‌ చేసి చెప్పండి. చైనా లేకుంటే మనం లేం.. బతకలేం అని కొన్ని పత్రికల్లో (సాక్షి కాదు) మకిలిరాతలు రాసిన్రు. 100 శాతం తప్పు. అంతా బక్వాస్‌ బోగస్‌. 

అప్పులు చేయక తప్పదు..
గత ఆరు రోజుల్లో రాష్ట్రానికి రూ.2,400 కోట్ల ఆదాయం వచ్చేకాడ రూ.6 కోట్లు వస్తుంటే ప్రజలను ఎట్ల సాదుకోవాలి. ఉద్యోగులకు జీతాలు అప్పులు తెచ్చి ఇవ్వాలి. ఎంపీ ల్యాడ్స్‌ నిధులు ఇవ్వద్దనుకుంటున్నం. ఎంపీల జీతాలను 30శాతం కోత బెట్టాలనుకుంటున్నం అని ప్రధాని నన్ను అడిగిన్రు. మేము ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 75 శాతం కోతబెట్టినం. ఎంపీలకు కూడా 50శాతం కోత పెట్టమని చెప్పిన. దీనికి మద్దతు ఇవ్వాలని మా పార్లమెంటరీ పార్టీ నేతలకు చెప్పిన. ప్రధానితో అనేక విషయాల మీద అవసరమైతే రోజుకు రెండు మూడు పర్యాయాలు కూడా మాట్లాడుతున్నాం. ఆర్థిక పరిస్థితి, రిజర్వు బ్యాంకు, ఆహార నిల్వలు తదితరాలపై ఎలా ముందుకు వెళ్లాలి. ఈ ప్రతిష్టంభన ఎంత వరకు కొనసాగించాలనే దానిపై చర్చిస్తున్నాం. ప్రధాని అడిగితే లాక్‌డౌన్‌ కొనసాగించడం మినహా మరోమార్గం లేదని చెప్పా. ఎకానమీ ఎలాగైనా రివైవ్‌ చేయొచ్చు. సతీ సావిత్రి కథ మినహా పురాణాల్లోనూ చనిపోయిన వాళ్లను వాపస్‌ తేలేదు. చనిపోయిన మనుషులను ఏం చేసినా తిరిగి తేలేం.

కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ లేదు..
ఏదైన ఓచోట జరిగే కార్యక్రమంలో ప్రజలు గూమికూడడం వల్ల అక్కడి నుంచి 10 మందికో 15 మందికో వైరస్‌ అంటుకుంటే కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ లేదా వ్యాధి మూడో దశ అంటరు. మన దగ్గర కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ అస్సలు జరగలేదు. దేశంలో కూడా లేదు. మన దగ్గర తొలుత విదేశాల నుంచి వచ్చిన వారికి, తర్వాత మర్కజ్‌ నుంచి వచ్చిన వారికి మాత్రమే వైరస్‌ సోకింది. వీరు తప్ప వైరస్‌ ఎవరి నుంచి సోకిందో (సోర్సు) తెలియని కేసు ఒక్కటీ ఇప్పటి వరకు రాలేదు. రేపు చెప్పలేం. భగవంతుడి దయ.

అప్పులు కట్టలేం..
ప్రైవేటు కంపెనీలు ఉద్యోగులకు జీతాలు ఇస్తలేరని చర్చ జరుగుతోంది. దీనిపై సమీక్ష చేయమని పరిశ్రమల శాఖ మంత్రిని కోరుతున్న. లాక్‌డౌన్‌తో నష్టపోయిన పరిశ్రమలకు కేంద్రం కొన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. మన రాష్ట్రాన్నే తీసుకుంటే రూ.30వేల కోట్ల రుణాలు చెల్లిస్తుంది ప్రతి ఏటా. మాకు డబ్బే వస్తలేదు, యాడ నుంచి కట్టాలి బాకీ. దాన్ని వాయిదా వేయాలని కోరుతం. అప్పులను టోటల్‌ రికాస్ట్‌ చేస్తరు. మారటోరియం సరిపోదు. ఆర్థిక శాఖ మంత్రులు, ముఖ్యమంత్రులందరూ కూర్చొని అప్పులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి కొన్ని ప్రత్యేక విధానాలు, ఫార్ములాలను కేంద్రం అమలు చేయాల్సి ఉంటుంది. భారతదేశంలో వైరస్‌ ప్రభావం మరో రెండు మూడు నెలల్లో తగ్గుతుందని, కానీ లాక్‌డౌన్‌ ప్రభావం ఆర్థికంగా చాలా తీవ్రంగా ఉంటుందని, దీన్ని ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే ఆలోచన చేయాలని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ఓ పత్రికలో చక్కగా రాశారు. ప్రధాని ఆ మేరకు ముందస్తు చర్యల విషయంలో నిపుణులతో సమాలోచనలు చేయాలి.  

రేషన్‌ కార్డులు లేని పేదలకూ బియ్యం, ఆర్థిక సహాయం తప్పనిసరిగా ఇస్తం. ఒక్క మనిషి కూడా ఉపవాసం ఉండొద్దు. ఎవరైనా ఆకలికి గురైతే ఆ గ్రామ సర్పంచ్‌లు, కౌన్సిలర్లు అధికారులకు రిపోర్టు చేయాలి. పేదలకు కేంద్రం ఇచ్చే సాయాన్ని రాష్ట్రం సహాయానికి కలుపుకుని ఇస్తున్నం. కేంద్రం, రాష్ట్రం వేర్వేరు కాదు. ప్రభుత్వానికి 6 రోజుల్లో రూ.2,400 కోట్లు వచ్చే చోట రూ.6 కోట్లు వస్తే ఏం చేయాలి? ఉన్నంతలో ఆహార కొరత రాకుండా, నిత్యావసర వస్తువులు, పాల కొరత రాకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కరి పొట్టనింపాలి. ఇది ఒకటే దారి.

విద్యా సంస్థలు ఎప్పుడు తెరుస్తరో ఎవరికీ తెలియదు. ముందు బతికి ఉంటే కదా అకడమిక్‌ ఇయర్‌. హైదరాబాద్‌ సంస్థానం ఇండియాలో విలీనమైనప్పుడు ఆనాడు హెచ్‌ఎల్‌సీ(ఇంటర్‌)లో ఉన్న వారందరినీ పాస్‌ చేశారు. దీంతో అప్పటికే ఎనిమిది తొమ్మిదిసార్లు డుమ్కీలు కొట్టిన వారు పాసయ్యారు. అలా పాస్‌  అయినవారు కొందరు జడ్జీలు, ఐఏఎస్‌ అధికారులు అయ్యారు. తర్వాత కష్టపడి చదువుకుని పైకొచ్చారు. మా ఊరికి చెందిన ఒకాయన పెద్ద న్యాయకోవిదుడు అయిండు. పేరు చెప్పను.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement