
ప్రభుత్వ ప్రతిష్టను కాపాడండి
* కేబినెట్ భేటీలో సహచరులకు సీఎం కేసీఆర్ ఉద్బోధ
* ఆరు నెలల్లో వచ్చిన మంచిపేరును ఐదేళ్లూ కాపాడుకోవాలి
* జిల్లాల్లో అన్ని శాఖలను స్థానిక మంత్రులే పర్యవేక్షించాలి
* పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పార్టీ కార్యకర్తలకు దగ్గరవ్వాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వానికి ఇప్పటివరకు వచ్చిన ప్రతిష్ట, మంచి పేరును కాపాడాలని మంత్రివర్గ సభ్యులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్బోధించారు. మంగళవారం కేబినెట్ విస్తరణ అనంతరం కొత్త మంత్రులతో కూడిన కేబినెట్ భేటీ అయింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సహచరులకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ర్ట పునర్నిర్మాణ బాధ్యతను సమర్థంగా చేయగలమనే విశ్వాసంతో టీఆర్‌ఎస్‌కు అధికారం అప్పగించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన గురుతరమైన, పవిత్రమైన బాధ్యత మనపై ఉంది’ అని సీఎం అన్నారు. గత ఆరు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన పథకాలకు ప్రజల్లో చాలా మంచి పేరు వచ్చిందన్నారు.
‘వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ వంటి దీర్ఘకాలిక పథకాలను అన్ని వర్గాల వారు ఆదరిస్తున్నారు. ప్రతి మండలాన్ని రాజధానితో అనుసంధానిస్తాం. వీటిని ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఈ పథకాలను దేశమంతటా చర్చించుకునే విధంగా పూర్తిచేయాలి’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘మంత్రులు కాగానే కొమ్ములు వచ్చినట్టుగా భావించొద్దు. ఇప్పటిదాకా ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే నిరాడంబరంగా ఉండాలి. మంత్రి అయ్యాక ఇంకా దగ్గరయ్యారన్న సంకేతాన్ని ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి పంపించండి. అవినీతి రహితంగా, పారదర్శకంగా శాఖలను నిర్వహించాలి.
ఐదేళ్లదాకా ప్రభుత్వంపై ఎలాంటి మచ్చ రావొద్దు. దేశవ్యాప్తంగా మన ప్రభుత్వానికి చాలా మంచిపేరు వచ్చింది. మంత్రిగా మీ ఒక్క శాఖకే పరిమితం కావొద్దు. జిల్లా స్థాయిలో అన్ని శాఖల పనితీరును ఆ జిల్లా మంత్రి పర్యవేక్షించాలి, సమీక్షించాలి. జిల్లాలో అన్ని శాఖల పనితీరును మెరుగుపర్చాలి. ఒక్క శాఖకే పరిమితమై మిగిలిన శాఖలను ఉపేక్షిస్తే పథకాల అమలు సంపూర్ణంగా ఉండదు. క్షేత్రస్థాయిలో పథకాల అమలు కోసం జిల్లా స్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలను మంత్రులు తీసుకోవాలి’ అని సీఎం సూచించారు.
పార్టీ ప్లీనరీ, నిర్మాణంపై తర్వాతే నిర్ణయం
టీఆర్‌ఎస్ ప్లీనరీ, పార్టీ నిర్మాణంపై మరోసారి మాట్లాడుకుందామని కేసీఆర్ సూచించారు. మంత్రివర్గ సమావేశం నుంచి అధికారులంతా వెళ్లిపోయిన తర్వాత మంత్రులతో కొంతసేపు రాజకీయ అంశాలపై కేసీఆర్ చర్చించారు. పార్టీ ప్లీనరీ గతంలో వాయిదాపడిన సంగతి తెలిసిందే. వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించాలన్న ప్రతిపాదన తాజాగా వచ్చింది. అయితే ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్నే భారీగా, ఘనంగా నిర్వహించుకుంటే బాగుంటుందనే సూచన కూడా వచ్చింది. దీనిపై మరోసారి చర్చించుకుందామని సీఎం పేర్కొన్నారు.