ఆదివారం నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద ఆయనకు నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో ఈటల రాజేందర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేశవరావు, బొంతు రామ్మోహన్, పీవీ కుమార్తె వాణీ దయాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్ : ‘మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన 360 డిగ్రీల కోణంలోనూ అద్భుత వ్యక్తిత్వంగల వ్యక్తి. ఆయన వ్యక్తిత్వ పటిమ, ఆయనకు ఆయనే సృష్టించుకున్న గరిమను వర్ణించడానికి మాటలు చాలవు. గొప్ప సంస్కరణశీలి. విమర్శలు వస్తాయని ఏదైనా చేయడానికి కొందరు భయపడతారు. కానీ భయపడకుండా సంస్కరణలను అమలు చేసిన ధీశాలి పీవీ. ఏ రంగంలో కాలుపెడితే ఆ రంగంలో సంస్కరణలు తెచ్చారు’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొనియాడారు.
పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, పీవీ కుటుంబ సభ్యులను ప్రధాని వద్దకు తీసుకెళ్లి స్వయంగా విజ్ఞప్తి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే శాసనసభలో పీవీ చిత్రపటం ఏర్పాటు చేస్తామన్నారు. పార్లమెంటులోనూ ఆయన చిత్రపటం ఏర్పాటు చేయాలని పోరాడుతామన్నారు. పీవీ నరసింహారావు 99వ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన సమాధికి సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించి శతజయంతి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు...
అన్ని రకాల తెలంగాణ ప్రభలు, ప్రతిభలు మసకబారాయి. వాటన్నింటినీ బయటకు తీసి భావితరాలకు అందించాలి. వ్యక్తిత్వ పటిమను పెంపొందించడానికి పీవీ చరిత్ర ఆదర్శంగా నిలుస్తుంది. నవభారత నిర్మాతల్లో ఆద్యుడు నెహ్రూ అయితే ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ. నెహ్రూకు సమాంతర వ్యక్తి పీవీ అని వంద శాతం ఢంకా బజాయించి చెప్పాలి. ఈ రోజు 51 దేశాల్లో పీవీ జయంతిని తెలంగాణ బిడ్డలు నిర్వహిస్తున్నారు. ఇందుకు రూ. 10 కోట్లు విడుదల చేశాం. హర్పల్ మౌలా (ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలే ప్రజ్ఞగలగే వ్యక్తి) అని పీవీని పాకిస్తానీయులు సైతం పొగిడారు. పీవీ శత జయంతి ఉత్సవాల ముగింపు సభ లక్ష మందితో నిర్వహించే పరిస్థితి రావాలి.
జ్ఞాన భూమిలో భారీ మెమోరియల్
తెలుగు అకాడమీకి పీవీ పేరు పెడతాం. కాకతీయ యూనివర్శిటీలో ఆధునిక ఆర్థిక విధానాలపై పీవీ పేరుతో అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తాం. రామేశ్వరంలో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్‌ను మించి పీవీ మెమోరియల్‌ను జ్ఞాన భూమిలో వచ్చే ఏడాది జూన్ 28లోగా ఆవిష్కరిస్తాం. ఇంకొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం పీవీ పేరు పెడతాం. పోస్టల్ స్టాంపు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరతాం. ఎంపీ కేశవరావు సూచన మేరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేంద్రానికి లేఖ రాస్తా. అముద్రితమైన పీవీ రచనలను తెలుగు అకాడమీ ద్వారా ముద్రించి వర్సిటీలకు పంపిస్తాం.
ఏ బాధ్యతలు చేపట్టినా సంస్కరణలు
ఉమ్మడి ఏపీలో పీవీకి విద్యా మంత్రి పదవి ఇస్తే సర్వేల్‌లో నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి సహా ఎందరో ఐఏఎస్, ఐపీఎస్, దౌత్యవేత్తలు వాటిల్లో రూపుదిద్దుకున్నారు. కేంద్ర విద్యాశాఖ పదవి ఇస్తే శాఖ పేరును హెచ్‌ఆర్డీగా మార్చారు. మళ్లీ దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలను ప్రారంభించారు. ఆయనకు జైళ్ల శాఖను అప్పగిస్తే ఓపెన్ జైల్ కాంసెప్ట్ తీసుకొచ్చారు.
ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు భూ సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన 1,000/1,200 ఎకరాల ఆసామి. ఆయన 200 ఎకరాల భూమిని కుటుంబానికి ఇచ్చుకొని మిగిలిన 800 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. అందుకే పీవీ తెలంగాణ ఠీవీ. విమర్శలొచ్చినా వెనకాడని నిశ్చలమైన వ్యక్తి. భూస్వామ్య వ్యవస్థ పోయి నేడు రాష్ట్రంలో 93% చిన్న, మధ్య రైతులు ఉండటానికి కారణం ఆయనే.
ఆర్థిక స్వేచ్ఛకు కారణభూతుడు..
పీవీ ప్రధాని అయ్యే నాటికి దేశం ఉన్న బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టి పరువు నిలబెట్టుకుంటున్న పరిస్థితి ఉండేది. అలాంటి సంక్షోభ సమయంలో ప్రధాని పదవి ఆయన్ను వరించింది. అప్పటివరకు రాజకీయాల్లో లేని, ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసిన మన్మోహన్‌సింగ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిని చేసి ఆయన ద్వారా ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక పరిణతికి కారణభూతుడు పీవీ.
తగిన గౌరవం లభించలేదు
రాష్ట్రానికి, దేశానికి, భూగోళానికి విజ్ఞాన సముపార్జన చేసిన పీవీ లాంటి గొప్ప వ్యక్తికి లభించాల్సిన గౌరవం లభించకపోవడం బాధాకరం. చేయవలసిన వారు చేయకపోయినప్పటికీ మన బిడ్డ పీవీకి గొప్ప పేరు ప్రఖ్యాతి వచ్చేలా ముందు తరాలకు తెలిసేలా శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిద్దాం. కుల, ధన బలం లేకున్నా ప్రధాని అయ్యారు.
నిరంతర అధ్యయనశీలి...
పీవీ నోట సరస్వతి నాట్యం చేసినట్లు ఉంటది. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నందుకు నిజాం రాజు పీవీని ఓయూ నుంచి రస్టికేట్ చేసి తెలంగాణ రాజ్యంలో ఎక్కడా సీటు ఇవ్వొద్దంటే మహారాష్ట్రలో సీటు సంపాదించారు. మరాఠీ భాషను నేర్చుకోవడమే కాకుండా ఆ భాషలోని నవలను తెలుగులోకి తర్జుమా చేశారు. వయసుతో నిమిత్తం లేని గొప్ప విద్యార్థి పీవీ. అందుకే ఆయనకు 17 భాషలు వచ్చాయి. నిరంతర అధ్యయనశీలి పీవీ. పీవీ ఆశయం కోసమే 900 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నాం.
ప్రతి పదవికి వన్నె తెచ్చారు: కేకే
ప్రతి పదవికి వన్నె తెచ్చిన మహానీయుడు పీవీ అని పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు అన్నారు. . భారత ఆర్థిక, సామాజిక, రాజకీయ సుస్థిరతకు పీవీ అందించిన సేవలు సదా స్మరణీయమన్నారు.
నాడే చెప్పిన పీవీ: పోచారం
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వల్లే సాధ్యమని, ఆయనే తొలి సీఎం అవుతారని ముందే పీవీ చెప్పారని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
శ్రమను ఎక్కడా చెప్పుకోలేదు
పీవీలో ఎన్నో పార్శా్వలు ఉన్నాయి. బహుభాషా కోవిదుడు, రాజనీతిజు›్ఞడు, సాహితీవేత్తగా మాత్రమే పీవీ ప్రజలకు తెలుసు. కానీ ఆయన శాస్త్ర పరిజ్ఞానాన్ని, ఖగోళ శాస్త్రాన్ని, సంగీతాన్ని బాగా ఇష్టపడేవారు. మంచి దౌత్యవేత్త కూడా. చేసే పనిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇష్టపడేవారు. తన శ్రమను ఎప్పుడూ చెప్పుకోలేదు. పక్క వారిని కూడా చెప్పనిచ్చే వారు కాదు. పీవీ శత జయంతి ఉత్సవాలు ఆయన గురించి ప్రజలకు తెలియజేయడానికి మంచి వేదిక. వచ్చే ఏడాది నాటికి పూర్తిగా భిన్నమైన పీవీని ఈ ఉత్సవాలు ప్రపంచానికి పరిచయం చేస్తాయని ఆశిస్తున్నా.
– పీవీ ప్రభాకర్‌రావు, పీవీ కుమారుడు
హెచ్‌సీయూకు పీవీ పేరు పెట్టాలి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. 1975లో జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా, 6 పాయింట్స్ ఫార్మూలా అమలులో భాగంగా ఈ వర్సిటీ ఏర్పాటైందని ప్రధానికి కేసీఆర్ గుర్తుచేశారు. దేశ ఆర్థిక, విద్యా, సాహిత్య రంగాల వృద్ధికి ఎంతో కృషి చేసిన పీవీ పేరును ఈ వర్సిటీకి పెట్టాలని తెలంగాణ సమాజం కోరుకుంటోందని ప్రధానికి తెలియజేశారు.
కేసీఆర్‌కు కృతజ్ఞతలు
భాషకు అందని వ్యక్తిత్వం మా బాపుది. మాకు బాపు గురించి అన్నీ తెలుసనుకున్నాం. కానీ మాకు తెలియని విషయాలు రోజూ తెలుస్తూనే ఉన్నాయి. పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– వాణీ దయాకర్‌రావు, పీవీ కుమార్తె
శ్రమను ఎక్కడా చెప్పుకోలేదు
పీవీలో ఎన్నో పార్శా్వలు ఉన్నాయి. బహుభాషా కోవిదుడు, రాజనీతిజు›్ఞడు, సాహితీవేత్తగా మాత్రమే పీవీ ప్రజలకు తెలుసు. కానీ ఆయన శాస్త్ర పరిజ్ఞానాన్ని, ఖగోళ శాస్త్రాన్ని, సంగీతాన్ని బాగా ఇష్టపడేవారు. మంచి దౌత్యవేత్త కూడా. చేసే పనిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇష్టపడేవారు. తన శ్రమను ఎప్పుడూ చెప్పుకోలేదు. పక్క వారిని కూడా చెప్పనిచ్చే వారు కాదు. పీవీ శత జయంతి ఉత్సవాలు ఆయన గురించి ప్రజలకు తెలియజేయడానికి మంచి వేదిక. వచ్చే ఏడాది నాటికి పూర్తిగా భిన్నమైన పీవీని ఈ ఉత్సవాలు ప్రపంచానికి పరిచయం చేస్తాయని ఆశిస్తున్నా.
– పీవీ ప్రభాకర్‌రావు, పీవీ కుమారుడు
Comments
Please login to add a commentAdd a comment