
కేసీఆర్ రాజీనామా చేయాలి: భట్టి విక్రమార్క
హైదరాబాద్ : జీవో నెంబర్.123ని హైకోర్టు రద్దు చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ...పాలనపై కేసీఆర్కు అవగాహన లేదనడానికి జీవో 123ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. భూసేకరణ కింద సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని భట్టి విక్రమార్క అన్నారు. జీవో నెం.123 రద్దుపై కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. 2013 భూసేకరణ చట్టం అమలయ్యే వరకూ కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.