సాక్షి, సూర్యాపేట: తండ్రి కలను నెరవేరుస్తూ సైన్యంలో చేరాడు... 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులతో కల్నల్ స్థాయికి ఎదిగాడు... ఇటీవలే హైదరాబాద్‌కు బదిలీ అయినా కరోనా లాక్‌డౌన్ వల్ల రాలేక సరిహద్దులో విధులు కొనసాగించాడు... ఆదివారం రాత్రే తల్లికి ఫోన్ చేసి ‘అమ్మా.. బాగున్నావా’అంటూ పలకరించాడు. కానీ అనూహ్యంగా 24 గంటలు అయినా గడవకముందే చైనా సైన్యం దాష్టీకంలో వీరమరణం పొందాడు. ఇదీ విధి నిర్వహణలో అసువులుబాసిన తెలుగుతేజం, సూర్యాపేట జిల్లా కేంద్రానికి కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ (37) ప్రస్థానం. భారత్–చైనా సరిహద్దులో సోమవారం రాత్రి చైనా సైన్యంతో ఘర్షణలో వీరోచితంగా పోరాడి కన్నుమూసిన 20 మంది భారత జవాన్లలో సంతోష్ కూడా ఒకరు. ఆయనకు భార్య సంతు, కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు. వారంతా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సంతోష్ నేపథ్యమిదీ...
భార్యాపిల్లలతో కల్నల్ సంతోష్ (ఫైల్)
తండ్రి కల కోసం...
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల దంపతులకు కుమారుడు సంతోష్, కుమార్తె శృతి ఉన్నారు. ఎస్‌బీఐ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేస్తూ చీఫ్ మేనేజర్‌గా రిటైరైన ఉపేందర్‌కు బాల్యంలోనే సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న కోరిక ఉండేది. కానీ అది నెరవేరకపోవడంతో ఆ కోరికను ఎలాగైనా తన కుమారుడి రూపంలో చూడాలనుకున్నారు. సంతోష్ సైతం తండ్రి కలను నెరవేర్చేందుకు చిన్ననాటి నుంచే కష్టపడ్డారు. 1983 ఫిబ్రవరిలో జన్మించిన సంతోష్.. 1 నుంచి 5వ తరగతి వరకు స్థానిక సంధ్య హైస్కూల్‌లో, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏపీలోని విజయనగరంలో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యనభ్యసించారు. అనంతరం పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత డెహ్రాడూన్‌లో సైనిక శిక్షణ చేపట్టి 2004 డిసెంబర్‌లో లెఫ్ట్‌నెంట్‌గా బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్‌లో విధుల్లో చేరాడు.
కుమారుడి ఫొటోను చూస్తూ కన్నీరుమున్నీరవుతున్న సంతోష్ తల్లిదండ్రులు
చొరబాటుదారులను హతమార్చి దేశాన్ని కాపాడి...
సంతోష్ తన 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొందారు. ఎన్నో గోల్డ్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని లడక్‌లో (కల్నల్) కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సరిహద్దులో 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించి దేశాన్ని కాపాడారు. తన సర్వీసులో ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయా, లడక్, పాకిస్తాన్‌తోగల సరిహద్దులో పనిచేశారు. కొంతకాలం ఆఫ్రికా దేశం కాంగోలోనూ విధులు నిర్వహించారు.
బదిలీ అయినా రాలేక...
కల్నల్ సంతోష్‌ను ఇప్పటికే హైదరాబాద్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. మూడేళ్లపాటు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో లడక్‌లోనే విధులు నిర్వహించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సంతోష్ మరణవార్త తల్లిదండ్రులకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సైనికాధికారులు ఫోన్ ద్వారా తెలిపారు.
ప్రత్యేక విమానంలో హైదాబాద్‌కు పార్థివదేహం...
అమరుడైన కల్నల్ సంతోష్ పార్థివదేహాన్ని మంగళవారం రాత్రి ప్రత్యేక విమానంలో సైన్యం హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు తరలించింది. అయితే కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులను సైనికాధికారులు కోరారని, కానీ సంతోష్ తల్లిదండ్రులు మాత్రం సూర్యాపేటలోనే అంత్యక్రియలు జరపాలనుకుంటున్నట్లు చెప్పారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. దీనిపై బుధవారం ఉదయానికి స్పష్టత వస్తుందన్నారు.
తల్లిగా బాధ ఉంది.. దేశ పౌరురాలిగా గర్విస్తున్నా
కుమారుడి వీరమరణంపట్ల తల్లిగా నాకు చాలా బాధగా ఉంది. కానీ దేశ పౌరురాలిగా మాత్రం గర్వంగా ఉంది. సంతోష్ చిన్నతనం నుంచి చదువులో ముందుండేవాడు. ముఖ్యంగా లెక్కలు క్యాలిక్యులేటర్ కంటే స్పీడ్‌గా చేసేవాడు. దూరప్రాంతాల్లో ఉన్నా నాతో ఫోన్‌లో మాట్లాడి కుటుంబ సభ్యులు, బంధువుల యోగక్షేమాలు తెలుసుకొనేవాడు. సరిహద్దు వివాదాలపై టీవీల్లో వచ్చే అంశాల గురించి అడిగితే ‘అమ్మా.. టీవీల్లో వేరు, అక్కడ (సరిహద్దులో) పరిస్థితి వేరు. మీరెవరూ భయపడొద్దు’అంటూ ధైర్యం చెప్పేవాడు. చివరిసారిగా ఆదివారం ఫోన్‌లో మాట్లాడాడు. ఎలా ఉన్నావని అడిగాడు. – మంజుల (సంతోషతల్లి)
దేశం కోసమే పంపా..
దేశానికి సేవ చేయాలనన నా కోరిక కుమారుడి రూపంలో నెరవేరింది. సంతోష్‌కు చిన్నతనం నుంచే దేశంపై బాగా మమకారం ఉండేది. నేను కలలుకన్న విధంగా సంతోష్ సైన్యంలో చేరడంతో ఆనందించా. సరిహద్దులో చైనా సైన్యంతో ఘర్షణలో సంతోష్ వీరమరణం పొందడం ఓవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు తండ్రిగా చాలా బాధ కలిగిస్తోంది. ఆదివారం రాత్రి ఒక్క నిమిషమే నాతో మాట్లాడాడు. అమ్మతో మాట్లాడతాను.. ఫోన్ ఇవ్వు అంటే ఇచ్చాను. అదే సంతోష్ చివరి మాట. – ఉపేందర్ (సంతోష్ తండ్రి)
కల్నల్ సంతోష్ కుటుంబానికి అండగా ఉంటాం
- సీఎం కేసీఆర్ హామీ.. కుటుంబ సభ్యులకు సానుభూతి
సరిహద్దులో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్‌బాబు వీరమరణం పొందడంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణత్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు. సంతోష్ పార్థివదేహాన్ని అందుకోవడంపాటు అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కల్నల్ తండ్రికి హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ ఫోన్
చైనా సైనికులతో హింసాత్మక ఘర్షణలో కల్నల్ సంతోష్ వీరమరణంపట్ల హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సంతోష్ తండ్రి ఉపేందర్‌తో ఫోన్లో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపేందర్‌ను దత్తాత్రేయ ఓదార్చారు. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి సైతం కల్నల్ సంతోష్ తల్లిదండ్రులను ఫోన్లో పరామర్శించారు. సంతోష్ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
కల్నల్ సంతోష్ మరణం విచారకరం
- జవాన్ల ప్రాణత్యాగం ఎప్పటికీ గుర్తుంటుంది
- ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం
సాక్షి, అమరావతి: తూర్పు లఢాక్ (ఎల్‌ఓసీ) వద్ద చైనా దాడిలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్‌బాబు, మరో 19 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోరుకొండ సైనిక పాఠశాల పూర్వ విద్యార్థి అయిన సంతోష్‌బాబు ప్రాణ త్యాగం ఎప్పటికీ గుర్తుంటుందని, సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాడుతున్న మన సైనికుల దీక్ష మరింత దృఢతరం అవుతుందని సీఎం పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment