
ఫిబ్రవరిలో సీపీఎం తెలంగాణ మహాసభలు
పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 26, 27, 28వ తేదీల్లో హైదరాబాద్‌లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలు జరపనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బాబూ జగ్జీవన్‌రాం భవన్‌లో జరిగే ఈ సభల్లో తెలంగాణ సంస్కృతి, పార్టీ పాత్రపై చర్చించనున్నట్లు వెల్లడించారు. మహాసభల్లో భాగంగా మార్చి 1న లక్ష మందితో నిజాం కళాశాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని సుమారు పది లక్షల ఇళ్లల్లో ప్రతి ఇంటి తలుపు తట్టి సభలకు ఆహ్వానించనున్నట్లు వివరించారు. సభల కోసం 50 వేల మంది వలంటీర్లను సిద్ధం చేయనున్నామని, 20 వేల మందితో హైదరాబాద్ వీధుల్లో కవాతు చేయిస్తామని వెల్లడించారు. దేశంలో సీపీఎం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు.
ఆహ్వాన సంఘం ఏర్పాటు...
ఈ సమావేశంలో రాష్ట్ర మహాసభలకు ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షునిగా ఎమ్మెల్యే డాక్టర్ కె.నాగేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా డీజీ నర్సింహారావు, కోశాధికారిగా ఎం.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.సోమయ్య, కో ఆర్డినేటర్లుగా కె.రవి, పీఎస్‌ఎన్ మూర్తి, జె.వెంకటేశ్‌లతో పాటు 28 మంది ఉపాధ్యక్షులు, 18 మంది సహాయ కార్యదర్శులు, 120 మంది కమిటీ సభ్యులను ఎంపిక చేశారు.