5 నెలల్లో రూ.11 వేల కోట్లే!
* తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ రాబడి లక్ష్యం రూ. 30 వేల కోట్లు
* జూన్ నుంచి అక్టోబర్ వరకు వచ్చింది రూ. 11,654 కోట్లు
* మార్చి కల్లా రూ.18,500 కోట్లు రాబట్టాలి
* ఆదాయం పెంచుకునేందుకు అధికారుల కసరత్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ రాబడి మందగించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన జూన్ నెల నుంచి వచ్చే మార్చి 31 వరకు (పది నెలలు) రూ.30 వేల కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే జూన్ నుంచి అక్టోబర్ (తొలి ఐదు నెలలు) వరకు రూ.11,654 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. అంటే రానున్న ఐదు నెలల్లో రూ.18,500 కోట్లు పన్నుల రూపంలో వసూలు చేయాల్సి ఉంది. ఈ టార్గెట్‌ను చేరుకునేందుకు అధికార యంత్రాంగం సతమతమవుతోంది. కాగా, ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రూ.50,542 కోట్ల రాబడి వచ్చింది. అలాగే 2014-15 ఆర్థిక సంవత్సంలో కేవలం రెండు నెలల్లో (ఏప్రిల్, మే) రూ.9,186 కోట్లు వసూలైంది. దీనితో పోల్చుకుంటే రాష్ట్రం విడిపోయాక తొలి ఐదు నెలల్లో రూ.11,654 కోట్లు మాత్రమే రావడం గమనార్హం.
అక్రమ రవాణాపై దృష్టి..
రాష్ట్ర విభజన తర్వాత రాబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కఠినంగా వ్యవహరించాలని వాణిజ్య పన్నుల శాఖ భావిస్తోంది. ఈ మేరకు ఇటీవలే కమిషనర్‌గా నియమితులైన అనిల్ కుమార్ తెలంగాణలోని 12 డివిజన్ల అధికారులతో సమావేశమై రాబడి పెంచుకునే మార్గాలను నిర్దేశించారు. ఆయనే స్వయంగా హైదరాబాద్ పరిధిలోని ఏడు డివిజన్లకు వెళ్లి అధికారులతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌కు ఇతర రాష్ట్రాల నుంచి పన్నులు చెల్లించకుండా దిగుమతి అవుతున్న వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ గూడ్స్, స్టీల్, ప్లాస్టిక్, వివిధ వస్తువుల తయారీకి ఉపయోగించే ముడి సరుకుతో పాటు ఆహార ధాన్యాలు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ నుంచి జీరో టాక్స్‌తో అక్రమంగా దిగుమతి అవుతున్నాయి. తద్వారా వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం లేకుండా పోతోంది. అలాగే గతంలో ఐదు చెక్ పోస్టులకు తోడు రాష్ట్ర విభజన తర్వాత ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటైనా.. అవి పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో చెక్‌పోస్టుల వద్ద అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.