అంకెల్లో తెలంగాణ ఆవిష్కరణ | telangana details in numbers | Sakshi
Sakshi News home page

అంకెల్లో తెలంగాణ ఆవిష్కరణ

Published Thu, Nov 6 2014 2:35 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

అంకెల్లో తెలంగాణ ఆవిష్కరణ - Sakshi

అంకెల్లో తెలంగాణ ఆవిష్కరణ

 రాష్ట్ర సామాజిక, ఆర్థిక వివరాలను వెల్లడించిన ప్రభుత్వం
 
 
 సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆయా రంగాల్లో ఏవిధంగా దగాకు గురయిందో రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ తన అధ్యయనంలో నిగ్గు తేల్చిందని ‘సామాజిక, ఆర్థిక సర్వే’ (రీ ఇన్వెంటింగ్ తెలంగాణ - సోషియో, ఎకనమిక్ ఔట్‌లుక్ )-2014 పేర వెలువరించిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఈ వివరాలతో నిమిత్తం లేకుండా ప్రణాళికాసంఘం ఈ నివేదికను తయారు చేసింది.
 
 రాష్ట్ర తలసరి ఆదాయం (రూ.93,151) ఎంతో తేల్చినా, తలసరి అప్పుల లెక్కలు మాత్రం పేర్కొనలేదు. ఉమ్మడి రాష్ట్రంలోని ఆస్తులు, అప్పుల విభజన ఇంకా పూర్తి స్థాయిలో జరగనందున  అప్పులు తేలలేదు. దేశంలో 29వ రాష్ట్రంగా జూన్2వ తేదీన ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి అవసరమైన బాటలు వేసేందుకు రాష్ట్రం ఏయే రంగాల్లో ఏ స్థానంలో ఉంది, జాతీయ స్థాయిలో రాష్ట్ర పరిస్థితి, ఇతర రాష్ట్రాలతో పోలిక తదితర వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు. ప్రధానంగా రాష్ట్ర స్థూల ఆదాయం, స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, ఏయే రంగాల నుంచి ఎంతెంత ఆదాయం సమకూరుతోంది అన్న సమాచారాన్ని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. రాష్ట ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి, వ్యవసాయరంగం, దాని అనుబంధ రంగాల కార్యకలాపాలు, పారిశ్రామిక అభివృద్ధి, సేవా.. తదితర రంగాల పరిస్థితిని వివరిస్తూ గణాంకాలతో రూపు దిద్దుకున్న ఈ సర్వే నివేదిక రాష్ట్ర పరిస్థితిని ఆవిష్కరించింది.
 
 తగ్గిపోతున్న వ్యవసాయ రంగం వాటా
 
 రాష్ట్ర ఆదాయంలో క్రమేపీ వ్యవసాయ రంగం వాటా తగ్గిపోతోంది. 2000-01 ఆర్థిక సంవత్సరంలో 26 శాతంగా ఉన్న వాటా 2013-14 నాటికి 14 శాతానికి పడిపోయింది. 55.7శాతం మంది ఆధారపడిన వ్యవసాయం రంగం వాటా తగ్గిపోగా, ఇదే కాలానికి సేవారంగం వాటా 48 శాతం నుంచి 56 శాతానికి పెరిగింది.
 
 తలసరి ఆదాయం
 
 జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం ఏటేటా పెరుగుతూ వస్తోంది. 2004-05లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.24,409 కాగా, 2013-14 నాటికి అది రూ.93,151కి పెరిగింది.
 
 
 మానవాభివృద్ధి
 
 మానవాభివృద్ధి సూచిలో (హెచ్‌డీఐ) కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం స్థానం మెరుగ్గా ఉంది. 2004-05,  2011-12లో ఇచ్చిన ర్యాంకుల్లో తొలి నాలుగు స్థానాల్లో కేరళ, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లు ఉన్నాయి. కాగా, చివరి నాలుగు స్థానాల్లో బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మాత్రం 13వ స్థానం (2004-05) నుంచి 10వ స్థానానికి(2001-12) మెరుగు పడింది.
 
 సాగునీటి సౌకర్యం
 
 తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం (గ్రాస్ ఇరిగేటెడ్) అందుతున్న భూముల విస్తీర్ణం పెరిగింది. 2012-13లో 25.57లక్షల హెక్టార్లకు సాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండగా, అది 2013-14లో 31.64లక్షల హెక్టార్లకు పెరిగింది. మొత్తంగా 23.74శాతం పెరుగుద ల నమోదయ్యింది.
 
 పశుపోషణ
 
     పశుపోషణలో రాష్ట్రం దేశంలో 10వ స్థానంలోఉంది. (5.52 శాతం)
     గొర్రెల పెంపకంలో దేశంలో మొదటి స్థానం.
     కోళ్ల పెంపకంలో దేశంలో 5వ స్థానం
     మేకల పెంపకంలో దేశంలో 12వ స్థానం
     రాష్ట్రంలో 29 లక్షల కుటుంబాలు పశుపోషణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి.
     ఏటా 1,006.05కోట్ల గుడ్ల ఉత్పత్తితో దేశంలో 3వ స్థానం.
     ఏటా 4.46లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పిత్తితో దేశలో 6వ స్థానం.
     ఏటా 39.24లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి. దేశంలో 13వ స్థానం.
 
 పారిశ్రామిక రంగం
 
     రాష్ట్రంలో పారిశ్రామికరంగం పురోగమిస్తోంది. దశాబ్దకాలంలో సరాసరి 9.4 శాతం వృద్ధిరేటును సాధించింది. (జాతీయ సరాసరి 6.9శాతం)
     రాష్ట్రంలో ఫ్యాక్టరీల సంఖ్య 9,005కు (2011-12) పెరిగింది. ఈ సంఖ్య 2010-11లో 8,980గా ఉండింది.
     పెరిగిన ఫ్యాక్టరీల వల్ల 7లక్షల మందికి ఉపాధి లభించింది.
     భారీ పరిశ్రమలు ఉన్న రాష్ట్రాల్లో దేశంలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది.
 
 సేవా రంగం
 
 రాష్ట్రంలో సేవారంగం ద్వారా  32.6 శాతం మంది ఉపాధి పొందుతున్నారు. వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్ల ద్వారా 9 శాతం, సామాజిక, వ్యక్తిగత సర్వీసుల ద్వారా 8.6శాతం, నిర్మాణ రంగం ద్వారా 8శాతం, రవాణా, స్టోరేజీ, సమాచార రంగాల ద్వారా 5.7శాతం మంది ఉపాధి పొందుతున్నారు.
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement