కరువు కోరల్లో తెలంగాణ!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, విదర్భ, మరాట్వాడా, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు కలవరపెడుతున్నాయి. తెలంగాణలో జూన్ 1వతేదీ నుంచి ఆగస్టు 20వతేదీ మధ్య కాలంలో సాధారణ వర్షపాతం కంటే 55 శాతం తక్కువగా నమోదైంది. ఇక ఏపీకి సంబంధించి కోస్తాంధ్రలో మైనస్ 35 శాతం, రాయలసీమలో మైనస్ 28 శాతం వర్షపాతం నమోదైంది.
2 వారాల్లో వానలు పడకుంటే కష్టమే..
తెలంగాణలో మొక్కజొన్న, వేరుశనగ పంటలపై రైతుల ఆశలు ఆవిరయ్యాయి. వరి పొలాలు నీళ్లు లేక బీళ్లలా మారాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు కరెంటు కోతలు కరువును తలపిస్తున్నాయి. ఆగస్టు 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు తెలంగాణలో సాధారణ వర్షపాతం కంటే 86 శాతం తక్కువగా నమోదవడం గమనార్హం. 50.33 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 7.3 మి.మీ. వర్షం మాత్రమే కురిసింది. ఇదే పరిస్థితి మరో రెండు వారాలు కొనసాగితే తెలంగాణ ప్రాంతం కరువుతో విలవిల్లాడే ప్రమాదం పొంచి ఉంది. ఆగస్టు 27వ తేదీ తరువాత తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడవచ్చని మాత్రం తెలిపింది.
580 మండలాల్లో కరువు ఛాయలు
హైదరాబాద్: ఏపీలో ఉన్న 664 మండలాలకు గాను 580 మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నాయని మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప వెల్లడించారు. శనివారం శాసనమండలి జీరో అవర్‌లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఆగస్టు 31వ తేదీ నాటికి తగినంత వర్షం రాకపోతే అనంతపురం, వైఎస్‌ఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని 2.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు.