సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘ముందస్తు’ ఎన్నికల సమరం కోసం కమలనాథులు సన్నద్ధం అవుతున్నారు. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల నిర్ణయం తర్వాత ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు బీజేపీ దూకుడు పెంచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ఆ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా కనీసం 50 సభల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు.
ఈనెల 12 లేదా 15న మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టనున్నట్లు కూడా ప్రకటించారు. భారీ బహిరంగ సభల ద్వారా పార్టీలో జోష్ పెంచేందుకు బీజేపీ అధిష్టానం ఇప్పటికే కార్యాచరణ ఖరారు చేయగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ దూకుడు పెంచారు. రెండు దఫాలుగా రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు, పదాధికారులు, ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. ముందస్తు ఎన్నికల్లో ఏ పార్టీతోనూ కలవకుండా ఒంటరిపోరుకు నిర్ణయం తీసుకోవడంతో ఆశావహులు టిక్కెట్ల కోసం ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
13 స్థానాల నుంచి పోటీ.. ఆశావహుల జాబితా సేకరణ..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపనుంది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ జిల్లా కమిటీలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. పార్టీ సీనియర్లు, గతంలో పోటీ చేసి గెలిచిన, ఓడిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల సామాజిక వర్గాలు, నేతల పేర్లను పరిశీలనలోకి తీసుకోనున్నారని తెలిసింది. కాగా.. నాలుగైదు మినహా ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశావహులు ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తన్నారు. పెద్దపల్లి, కరీంనగర్, హుస్నాబాద్ టికెట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డికి ఖాయమనే చెప్తున్నారు.
హుజూరాబాద్‌లో కిసాన్‌మోర్చా జాతీయ కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు, రామగుండంలో బల్మూరి వనిత, వేములవాడలో ప్రతాప రామకృష్ణ, ధర్మపురిలో కన్నం అంజయ్యకు అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాగా చొప్పదండి నుంచి కొరివి వేణుగోపాల్, లింగంపల్లి శంకర్, మానకొండూరు నుంచి మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, కనుమల్ల గణపతి, గడ్డం నాగరాజు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. సిరిసిల్లలో ఆకుల విజయ, ఆడెపు రవి, జగిత్యాల నుంచి ముదుగంటి రవీందర్‌రెడ్డి, మోరపల్లి సత్యనారాయణ, కోరుట్ల నుంచి పూదరి అరుణ, బాజోజు భాస్కర్ పేర్లు వినిపిస్తున్నాయి. మంథనిలో ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నా.. టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఓ నేతకు చాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
వేచిచూసే ధోరణిలో పార్టీ అధిష్టానం.. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అసంతృప్తులకూ గాలం..
ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో బీజేపీకి మొదటి నుంచి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల సందర్భంగా వచ్చిన ఓట్లు, అంతర్గతంగా పార్టీ చేయించిన సర్వేల ఆధారంగా కొన్ని నియోజకవర్గాలపై బలమైన ఫోకస్ పెట్టింది. పార్టీకి సానుభూతి ఉన్న నియోజకవర్గాల్లో అసంతృప్తితో ఉన్న ఇతర పార్టీల్లోని నాయకులను సైతం చేర్చుకోవా లని ప్రణాళిక రూపొందించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే కొంత మంది నేతల జాబితా ను సిద్ధం చేసుకున్న పార్టీ అధినాయకత్వం సదరు నేతలతో సంప్రదింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. మంథని, వేములవాడ, చొప్పదండి, జగిత్యాలల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులపై రగడ సాగుతోంది. అలాగే హుజూరాబాద్, చొప్పదండి, కోరుట్ల, వేములవాడ తదితర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ కోసం పోటీపడే అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
ఈ రెండు పార్టీలకు చెందిన కొందరు నాయకులు ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో టచ్‌లో ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇదే జరిగితే వారిని సైతం పార్టీలో కలుపుకుని టిక్కెట్ ఇవ్వాలనే యో చన కూడా బీజేపీ చేస్తోంది. ఇదిలా వుంటే రాను న్న ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం రకరకాల వ్యూహాలను సిద్ధం చే స్తోంది. సంస్థాగతంగా బలంగా ఉన్న బీజేపీ అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించేందుకు ప్రణాళిక రచించింది. ఇటీవలి కాలంలో కర్నాటక, త్రిపుర, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ కార్యాచరణ చేపట్టింది. అక్కడ అనుసరించిన ఫార్ములాకు శ్రీకారం చుట్టింది. పార్టీకి అనుబంధమైన సంఘాలను ఇది వరకే అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు విద్యార్థి విభాగం ఏబీవీపీ, ఇతర కార్మిక సంఘాలను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment