ఆదిలాబాద్‌అర్బన్: అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో మరో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గురువారం ముగిసింది. పోరు బరిలో నిలిచేదెవరో తేలింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్,ఖానాపూర్ నియోజకవర్గాల్లో 33 మంది బరిలో ఉన్నారు. బోథ్‌లో కాంగ్రెస్ రెబల్ అనిల్‌జాదవ్ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. ఖానాపూర్‌లో మహాకూటమి అభ్యర్థితోపాటు టీజేఎస్ అభ్యర్థి కూడా బరిలో నిలిచారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ముగ్గురు మాత్రమే ఉపసంహరించుకున్నారు.
అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా తయారీకి జిల్లా యంత్రాంగం రాత్రి వరకు కసరత్తు చేసి పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో 33 మంది పోటీ పడుతున్నారు. ఇందులో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 26 మంది ఉండగా, స్వతంత్రులు ఏడుగురు ఉన్నారు. కాగా, ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానానికి 14 మంది, బోథ్ సానానికి ఏడుగురు బరిలో నిలిచారు. ఖానాపూర్ అసెంబ్లీ స్థానానికి 15 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇద్దరి నామినేషన్లు తిరస్కరించగా.. 13 మంది నామినేషన్లు ఆమోదించారు. గురువారం ఒక్కరు మాత్రమే ఉప సంహరించుకున్నారు. దీంతో 12 మంది బరిలో ఉన్నారు.
ముగిసిన ఉపసంహరణ
ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 12 నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరించారు. వచ్చిన నామినేషన్లను అధికారులు పరిశీలించారు. ఈ నెల 22 వరకు ఉపసంహరణకు గడువు ఉండడంతో గురువారం ఆయా రిటర్నింగ్ అధికారులు వారి వారి కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉన్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు వేసిన ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన గండ్రత్ ఆశన్న, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన మేకల మల్లన్న విత్‌డ్రా చేసుకున్న వారిలో ఉన్నారు. కాగా, బోథ్‌లో ఏ ఒక్క అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోగా, నామినేషన్ల పరిశీలన అనంతరం నిలిచిన అభ్యర్థులే ఇప్పుడు అసెంబ్లీ బరిలో నిలిచారు. ఖానాపూర్‌లో ఒకరు ఉపసంహరించుకున్నారు. కాగా, ఎన్నికల బరిలో నిలచే అభ్యర్థులను ప్రకటించడంతోపాటు పోటీలో ఉండే అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను వారి సమక్షంలోనే కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు.
ఫలించని బుజ్జగింపు..
కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేసిన జాదవ్ అనిల్ కుమార్‌ను అధిష్టానం బుజ్జగించినా ప్రయత్నాలు విఫలమయ్యాయి. గురువారం వరకు నామినేషన్ ఉపసంహరించుకోలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో రెండు సార్లు పోటీ చేసిన ఆయనకు నియోజకవర్గంలో పట్టు ఉండడంతో ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది.
ఇక ప్రచార సందడి
ఇక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినందున శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచార పర్వానికి తెరలేవనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరుగా కొనసాగుతుండగా, ఇక అసెంబ్లీ పోటీల్లో ఉన్న అభ్యర్థుల ప్రచారాలు కూడా జోరందుకోనున్నాయి. ఎన్నికల నియమావళికి లోబడి ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు అభ్యర్థులకు సూచిస్తున్నారు. మొన్నటి వరకు స్తుబ్దుగా ఉన్న గ్రామాల్లో ఇక ఎన్నికల ప్రచార సందడి కన్పించనుంది. ప్రధాన పార్టీలు రోజు వారీ కార్యక్రమాలు, సభల షెడ్యూల్ రూపొందిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment