సాక్షి, భూపాలపల్లి: ముందస్తు ఎన్నికల బరిలో ఎవరెవరు ఉండబోతున్నారో లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గురువారం ముగిసింది. జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గంలో ఇద్దరు, ములుగులో ముగ్గురు మొత్తం ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో భూపాలపల్లి ఎన్నికల బరిలో 14 మంది, ములుగులో 12 మంది పోటీలో మిగిలారు. ములుగు నియోజకవర్గంతో పోలిస్తే ఈసారి భూపాలపల్లిలో హోరాహోరీ తప్పకపోచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య పెరగడంతో ఓట్లు చీలే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు డిసెంబర్ 7వ తేదీన తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
భూపాలపల్లిలో హోరాహోరీ..
భూపాలపల్లిలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఉండనుంది. ఈ నియోజకవర్గం నుంచి నలుగురు అభ్యర్థులు బలంగా ఉన్నారు. 2009, 2014లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. టీఆర్‌ఎస్ నుంచి సిరికొండ మధుసూదనాచారి, కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, బీజేపీ నుంచి కీర్తిరెడ్డితోపాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గండ్ర సత్యనారాయణరావు ప్రధానంగా పోటీలో ఉన్నారు. అసెంబ్లీ రద్దు అనంతరం నుంచే ఈ నలుగురు నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు.
ఈ సారి 14 మంది అభ్యర్థులు
భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఈసారి 14 మంది పోటీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో 12 మంది ఉండగా.. 2009 ఎన్నికల్లో 18 మంది పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు జరిగింది. ప్రస్తుతం చతుర్ముఖ పోరు నెలకొంది. అలాగే అభ్యర్థుల సంఖ్య పెరిగింది. పోటీదారులు ఎక్కువైతే మెజారిటీతోపాటు గెలుపు అవకాశాలు సైతం దెబ్బతింటాయి. అందుకే భూపాలపల్లి నియోజకవర్గంలో హోరాహోరీ తప్పకపోవచ్చు. ఎవరు గెలిచిన పెద్దగా మెజారిటీ రాదని ప్రజలు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు కాకుండా నోటాతో కలిపి మిగిలిన వారు 9,070 ఓట్లు సాధించారు. ఈసారి ఇంత మొత్తంలో ఓట్లు స్వతంత్ర సభ్యులకు బదిలీ అయితే గెలుపొందే వారి మెజారిటీపై తప్పకుండా ప్రభావం పడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ములుగులో పరిస్థితి..
ములుగులో ఈ సారి 12 మంది ఎన్నికల బరిలో నిలిచారు. భూపాలపల్లితో పోలిస్తే ఈ నియోజకవర్గంలో పోటీ తక్కువగానే ఉంది. ప్రధాన పార్టీల నుంచి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే కీలక పోటీ ఉండనుంది. 2009 ఎన్నికల్లో ములుగు నుంచి 9 మంది, 2014లో 11 మంది పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు కాకుండా ఇండిపెండెంట్లకు 13,140 ఓట్లు పోలయ్యాయి. 2009, 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీగా టీడీపీ ఉండేది. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి సీతక్క కాంగ్రెస్‌లో చేరడంతో టీడీపీకీ ప్రాతిని«థ్యం లేకుండా పోయింది. నియోజకవర్గంలో ప్రస్తుతం చందూలాల్, సీతక్కల మధ్యే పోటీ ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థులకు పడే ఓట్లు మెజారీటిపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
భూపాలపల్లిలో ఇద్దరి విత్‌డ్రా
భూపాలపల్లి: భూపాలపల్లి అసెంబ్లీ బరిలో 14 మంది అభ్యర్థులు మిగిలారు. ఈ స్థానానికి మొత్తం 17 నామినేషన్లు రాగా స్క్రూటిని సమయంలో అర్షం అశోక్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించగా 16 మంది మిగిలారు. స్వతంత్ర అభ్యర్థులు కేతిరి క్రాంతికుమార్, సిరికొండ ప్రశాంత్ తమ నామినేషన్లను ఉపసహరించుకోవడంతో 14 మంది బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించి వారికి గుర్తులను కేటాయించారు.
ములుగులో ముగ్గురు ఉపసంహరణ..
ములుగు: ములుగు శాసనసభ ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల ప్రత్యేక అబ్జర్‌వర్ అనిమేష్‌దాస్ తెలిపారు. ఈ స్థానానికి 15 మంది నామినేషన్లు వేయగా ముగ్గురు ఉపసంహరించుకున్నారు. మిగిలిన వారికి అధికారులు ఎన్నికల గుర్తులను కేటాయించారు. కార్యక్రమంలో ములుగు ఆర్డీఓ రమాదేవి, తహసీల్ధార్ గనియా ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment