తుంగతుర్తిలో ఫ్లెక్సీలను చించుతున్న కార్యకర్తలు
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : టికెట్ రాకపోవడంతో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. టికెట్ రాక భంగపడినవారి అనుచరగణం ఆగ్రహంతో ఊగిపోతోంది. తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ వడ్డేపల్లి రవికి కేటాయించలేదని ఆయన అనుచరులు తుంగతుర్తిలో హల్‌చల్ చేశారు. పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలను చిం చారు. అద్దంకిదయాకర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. కోదాడ టీఆర్‌ఎస్ టికెట్ బొల్లం మల్లయ్యకు కేటాయించడంతో ఈ టికెట్ ఆశించిన శశిధర్‌రెడ్డి, ఆయన అనుచరులు ఆందోళన చేశారు.
అద్దంకి గో బ్యాక్ అంటూ నినాదాలు..
వడ్డేపల్లి రవి వర్గీయులు నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఫ్లెక్సీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అద్దంకి దయాకర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు
కాంగ్రెస్‌పార్టీ నాయకులు మాట్లాడుతూ వడ్డేపల్లి రవి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటున్నారని, కార్యకర్తలు, ప్రజలు ఏకమై అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీని బతికించింది వడ్డేపల్లి రవి అని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా కాంగ్రెస్‌పార్టీకి, కార్యకర్తలకు అండగా ఉంటూ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించారన్నారు. వడ్డేపల్లి రవికి కాకుండా నియోజకవర్గాన్ని ఏనాడూ పట్టించుకోని అద్దంకి దయాకర్‌కు టిక్కెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.
మంత్రి ఇంటి ఎదుట ఆందోళన..
కోదాడ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బొల్లం మల్లయ్యయాదవ్‌ను ప్రకటిస్తున్నారని ముందే తెలుసుకున్న పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శశిధర్‌రెడ్డి, ఆయన అనుచరులు ఆదివారం ఉదయం సూర్యాపేటలోని మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. మంత్రి అక్కడ లేకపోవడంతో శశిధర్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ అనుచరులు ఆందోళన చేశారు. ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం కోదాడ కు వచ్చి పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ తనకే టికెట్ ఇస్తుందని, సోమవారం నామినేషన్ వేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో బొల్లం మల్లయ్యయాదవ్ శశిధర్‌రెడ్డి ఇంటికి వచ్చారు.తొలుత ఆయనతో మాట్లాడడానికి నిరాకరించిన శశిధర్‌రెడ్డి కార్యాలయం నుంచి బయటకు వెళ్లి పోయారు. కొందరు వారించడంతో మళ్లీ తిరిగి వచ్చి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో పలువురు కార్యకర్తలు టికెట్ వద్దని చెప్పాలని పట్టుబట్టారు. చివరకు సాయంత్రం మల్లయ్యకు టికెట్ ప్రకటించినట్లు న్యూస్ చానళ్లలో రావడంతో శిశిధర్‌రెడ్డి అనుచర గణం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment