
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: మోటారు వాహనాల పన్ను చెల్లింపు గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ ఎత్తేసిన నాటి నుంచి నెల రోజుల్లో పన్ను మొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబం ధించి అడ్వాన్సు త్రైమాసిక పన్ను మార్చి 30 నాటికి చెల్లించాల్సి ఉంటుంది. ఏటా ఈ గడువు దాటాక నెలపాటు గ్రేస్ పీరియడ్ వర్తింపచేస్తారు. వెరసి ఆ సమయం ఏప్రిల్ 30తో ముగిసింది. ఈలోపు పన్ను చెల్లించని వారు అపరాధ రుసుముతో చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు పన్ను చెల్లించాలంటూ కొందరు వాహనదారులను మౌఖికంగా ఆదేశించారు. అయితే లాక్‌డౌన్ సమయంలో పన్ను చెల్లింపు కోసం ఒత్తిడి చేయటం తగదని, వెంటనే గడువు పెంచాలని 20 రోజుల క్రితమే అధికారులకు తెలంగాణ లారీ యజమానుల సంఘం విజ్ఞప్తి చేసింది. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో అత్యవసర సరుకులు తరలిస్తున్న లారీలను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రవాణాశాఖ కమిషనర్ సిఫారసు మేరకు ప్రభుత్వం గడువు పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment