హామీలు అమలు చేయకుంటే ఓట్లు అడగం
గంగాధర (కరీంనగర్) : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళతుందని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని గట్టుభూత్కూర్ గ్రామంలో మంత్రి పలు అభివృద్ధి పనులకు సోమవారం ఉదయం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శోభ, జడ్పీచైర్మన్ తుల ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజేందర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటింటికి నీరు సరఫరా చేస్తామని లేకుంటే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగమని అన్నారు.
అర్హులందరికీ ఆహార భద్రత కార్డులిస్తామని, పించన్ల పంపిణీ ప్రక్రియ ఆగదని చెప్పారు. వృద్ధులకు మాత్రమే పించన్లు ఇవ్వడంలేదని, తల్లితండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల నుండి కన్నవారికి పించన్ ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. భర్తలు వదిలేసిన మహిళలకు సైతం ఫించన్లు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పార్టీ అధ్యక్షులు, నాయకులు,ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.