అంబరాన్నంటేలా సంబరాలు | Telangana formation celebrations | Sakshi
Sakshi News home page

అంబరాన్నంటేలా సంబరాలు

Published Sun, May 31 2015 2:19 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM

అంబరాన్నంటేలా సంబరాలు - Sakshi

అంబరాన్నంటేలా సంబరాలు

 సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్రం.. నాలుగున్నర కోట్ల ప్రజల కల సాకారమై ఏడాది గడుస్తోంది. అరవై ఏళ్ల స్వప్నం ఫలించిన రోజును గొప్పగా గుర్తు చేసుకునేలా ఉత్సవాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంచింది. ఏడాది క్రితం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోనే ఘనంగా జరిగాయి. ఇప్పుడూ అంత కంటే ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. రాష్ట్ర అవతరణ వేడుకలు భావి తరాలకు గుర్తుండేలా ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో కలెక్టర్ కరుణ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

 బయటి కళాకారులకు ఆహ్వానం
 ఉత్సవాల నిర్వహణలో సాంస్క­ృతిక కార్యక్రమాలు కీలకం. జిల్లాలోని కళాకారులకు తోడు ఇతర జిల్లాల్లో ఉంటున్న మన జిల్లా కళాకారులు ఉత్సవాల కోసం ఆహ్వానిస్తున్నాం. అందరికీ ఇప్పటికే సమాచారం ఇచ్చాం. ఎంపిక చేసిన అన్ని ప్రాంతాల్లో కనులవిందుగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. జానపద, సంప్రదాయ నృత్యాలు, ముషాయిరాలు, షహరీలు ఉండేలా కార్యక్రమం రూపొందిస్తున్నారు.  రోజు కనీసం ఒక సాంస్క­ృతిక కార్యమం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. చారిత్రాత్మకమైన జూన్ 2న సాంస్క­ృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తాం.

హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియం, వేయిస్తంభాల గుడి ప్రాంతాల్లో సాంస్క­ృతిక కార్యక్రమాలు ఉంటాయి. జూన్2న నిర్వహించే లేజర్ షో ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అదేరోజు సాయంత్రం బాణాసంచా సంబరాలు ఉంటాయి. జిల్లా కేంద్రంలోని అన్ని చౌరస్తాలు, కార్యాలయాలు, ప్రైవేటు భవనాలు పూర్తిస్థాయిలో విద్యుత్ దీపాల అలంకరణతో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. సాంస్క­ృతిక సారథి తరుఫున జూన్ 5న జిల్లాలో కార్యక్రమాలు ఉంటాయి.  

 శాఖలవారీగా క్రీడా పోటీలు
 ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా శాఖలవారీగా క్రీడోత్సవాలు జరుగుతాయి. జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్  టీమ్‌లు క్రీడల్లో పాల్గొంటాయి. మొత్తం 18 విభాగాల్లో ఉత్తములను ఎంపిక చేసి అవార్డులు, నగదు పురస్కారం అందజేస్తాం. ఉత్తముల ఎంపిక కోసం కమిటీలు ఏర్పాటు చే శాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లే అన్ని వర్గాలు రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో కీలక పాత్రం పోశించాలి. ఇప్పటికే ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పక్షాలతో సమావేశాలు నిర్వహించాం. వేడుకల్లో పోలీస్ పేరేడ్‌తోపాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొత్తంగా వారంపాటు చూడచక్కటి కార్యక్రమాలు చేపట్టేలా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది.

 6న స్వచ్ఛ వరంగల్..
 చరిత్రాత్మక వరంగల్ నగరాన్ని అన్ని రకాలుగా ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కార్యక్రమాలు చేపడుతున్నాం. దీంట్లో భాగంగానే జూన్ 5న స్వచ్ఛ వరంగల్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం. కార్యక్రమంలో ఉద్యోగులు, ఎన్జీవోలు, రాజకీయ పక్షాలు పాల్గొనాలని కోరుతున్నాం. స్వచ్ఛ వరంగల్‌లో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా మార్చుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రజలూ ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా. నగరంలో చాలాచోట్ల సుందరీకరణ పనులు నడుస్తున్నాయి. ఒక్క వర్షంపడితే పనులు ఊపందుకుంటాయి. త్వరలో నిధులు వస్తాయి. రోడ్ల పరిస్థితికూడా పూర్తిగా మెరుగవుతుంది.

 హామీలు నెరవేరుతున్నాయి..
 ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో సీఎం హామీ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఇళ్ల నిర్మాణం కోసం టెండర్లు పిలుస్తాం. అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్‌లో జీ+3, ఎస్సార్‌నగర్‌లో జీ+1 నమూనాలో గృహాలు నిర్మించాలని నిర్ణయించాం. హరితాహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 900 గ్రామాల్లో మొక్కలు నాటేందుకు పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 2.50 కోట్ల మొక్కలు కార్యక్రమంలో భాగంగా పొలంగట్లపై పెట్టాలని నిర్ణయించాం. అన్నం పెట్టే రైతుకు సాగు అవసరాల కోసం బ్యాంకర్లు ఇంటివద్దకు వెళ్లి రుణం ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అర్హులందరికీ ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement