ఫ్రిజ్ తీసి..పరుగో పరుగు..
కేసముద్రం: సూర్యుడి ప్రతాపానికి మనుష్యులే విలవిలలాడుతుంటే.. ఇక సర్పాలు ఏంచేస్తాయి.. ఏంచక్కా ఫ్రిజ్ లో దూరుతాయి. అవును వేడికి తాళలేక రక్తపింజర ఫ్రిజ్‌లో దూరిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ధన్నసరిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మిర్యాల యాకయ్య ఇంట్లోని ఫ్రిజ్‌లో మంగళవారం రాత్రి రక్తపింజర పాము దూరింది.
బుధవారం తెల్లవారుజామున యాకయ్య కూతురు మంచినీళ్ల కోసం ఫ్రిజ్ డోర్ తీయగా పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆ బాలిక కేకలు పెడుతూ బయటకు పరుగెత్తింది.కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలున్న వారంతా కలిసి వచ్చి ఆ పామును బయటకు తీసుకువచ్చి చంపేశారు.