హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ శాసనసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడుతూ హేతుబద్దీకరణ అంటే స్కూళ్లను మూసివేయటం కాదని అన్నారు. విద్యార్థులు లేని పాఠశాలలను కిలోమీటర్ పరిధిలోని వేరొక పాఠశాలలో విలీనం చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.
అలాగే అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులను అదే మండలంలోని పాఠశాలలకు బదిలీ చేస్తామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం కూడా హేతుబద్దీకరణను చేపట్టిందని, మంచి కార్యక్రమం కాబట్టే తాము కూడా కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మూడేళ్ల పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించే అంశం పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు.