'మీలాగా ఆంధ్రా నేతల బూట్లు నాకలేదు'
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో బుధవారం గందరగోళం నెలకొంది. మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణల మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ ప్రాజెక్ట్ అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈనేపథ్యంలో డీకె అరుణ మాట్లాడుతూ తొలిసారి గెలిచి ఎమ్మెల్యేగా సభకు వచ్చిన జగదీశ్ రెడ్డి చాలా నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి ...ఆంధ్రా నేతల బూట్లు నాకారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అన్నారు.
దాంతో జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్ మధుసుదనాచారి మాట్లాడుతూ అభ్యంతరకర పదాలను రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. మరోవైపు జగదీశ్ రెడ్డి కూడా తాను కేసీఆర్ చలవ వల్ల, సూర్యాపేట ప్రజల ఆశీస్సులతో మంత్రినయ్యానన్నారు తన వ్యాఖ్యల్లో తప్పుంటే రికార్డుల నుంచి తొలగించాలని అన్నారు. దాంతో సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.