dk arunua
-
‘ఈ పోరాటం ఇక్కడితో ఆగదు’
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత డీకే అరుణ ఇందిరాపార్క్‌లో చేపట్టిన దీక్ష నేటితో ముగిసింది. ఈ కార్యక్రమానికి పరిపూర్ణానంద స్వామి, ఎమ్మెల్సీ రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. మద్యపాన నిషేధం కోసం ఆమె రెండురోజుల మహిళా సంకల్ప దీక్ష చేపట్టారు. శుక్రవారం దీక్ష ముగింపు సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పోరాటం ఇక్కడితో ఆగదన్నారు. ఈ పోరాటాన్ని ప్రతీ జిల్లాకు తీసుకెళ్తామని, బెల్ట్‌షాపులను మూసివేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో గుడి, బడి తేడా లేకుండా మద్యం అమ్మకాలు సాగుతున్నాయని ఆరోపించారు. తాగిన మైకంలోనే నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దిశ సంఘటన ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగించలేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో 30 వేల మంది తాగి రోడ్లపై పడిపోతున్నారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఏపీలో మద్యం నిషేధం వైపు అడుగులు పడుతున్నాయని ప్రస్తావించారు. చిత్తశుద్ధి ఉంటే మద్య నిషేధం కష్టసాధ్యమైన పనేంకాదని ఆమె అన్నారు. -
రోడ్లపై వరి నాట్లేసిన డీకే అరుణ
-
వరి నాట్లేసిన డీకే అరుణ
సాక్షి, జోగుళాంబ గద్వాల : గుంతలతో పాడైన రోడ్లు, ఏళ్లుగా సాగుతున్న ఆర్వోబీ నిర్మాణానికి నిరసనగా మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ రోడ్డుపై వరినాట్లు వేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక రెండవ రైల్వేగేటు సమీపంలోని రోడ్డు గత వర్షాలకు పాడైపోయింది. మరమ్మత్తు చేయకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె ఈ నిరసన తెలిపారు. మరోవైపు గత ఐదేళ్లుగా ఆర్వోబి నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
16 మంది సీఎంలు చేయనిది.. కేసీఆర్ చేశారు: డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్ : 16 మంది సీఎంలు చెయ్యని అప్పు, అంతకు రెండింతలు ఒక్క సీఎం కేసీఆర్ చేశారని మాజీ మంత్రి డీకే అరుణ నిప్పులు చెరిగారు. రూ. 69వేల కోట్ల అప్పును 2 లక్షల 21 వేల కోట్ల అప్పుగా చేశారన్నారు. ఇదేనా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రగతి అంటూ డీకే అరుణ మండిపడ్డారు. పదే పదే టీఆర్ఎస్ వంద సీట్లు గెలుస్తుందని కేసీఆర్ చెబుతున్నారని, మరోసారి కూడా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తెలిసినప్పుడు అధికారదుర్వినియోగానికి పాల్పడుతూ 25 లక్షల మందితో సభ ఎందుకు పెడుతున్నారో చెప్పాలన్నారు. మీ ప్రభుత్వం మీద మీకు ఆత్మవిశ్వాసం లేదు, అందుకే జనం అంతా మీ వెంట ఉన్నారని చూపెట్టడానికే సభలు పెట్టి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ మీద ప్రజలకు విశ్వాసం లేదు కాబట్టే, కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని అరుణ తెలిపారు. ప్రగతి నివేదన సభకు దాదాపు రూ.300 కోట్లను సభకు ఖర్చుపెడుతున్నారు. టీఆర్ఎస్ పాలనలో అవినీతి లేదు అన్నారు కదా, మరీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించారు. లేజిస్లేచర్ పార్టీ మీటింగ్‌లో మీరిచ్చిన డబ్బాలో డబ్బులు పెట్టి పంపారని చర్చ జరుగుతోందన్నారు. సభలకు వచ్చే జనాలకు కూలి ఇచ్చే సంప్రదాయం టీఆర్ఎస్ ప్రారంభించిందని మండిపడ్డారు. ట్రాక్టర్లకే 50 కోట్ల ఖర్చు అవుతుందని, అన్నింటినీ కలిపితే దాదాపు 280 నుండి 300 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పడానికి ప్రగతి నివేదన సభనే నిదర్శనమని డీకే ఆరుణ అన్నారు. మీ అధికార బలంతో మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు గంటే అది కలగానే మిగిలిపోతుందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ రైతు బంధు పేరుతో ప్రజా ధనం పెట్టి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సభను పెట్టడం తప్పు కాదు, అధికార దుర్వినియోగం చేయడాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. ఎంత తరలించినా వచ్చేది కేవలం ఆ పార్టీ కార్యకర్తలే అని తెలిపారు. అధికారంలో ఉంటే అంతా పచ్చగానే కనిపిస్తుందన్నారు. ప్రగతి నివేదిక ప్రగతి భవన్‌కే పరిమితమయ్యిందని, ప్రజలకు ప్రగతి అందలేదు అంటూ మండిపడ్డారు. -
'మీలాగా ఆంధ్రా నేతల బూట్లు నాకలేదు'
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో బుధవారం గందరగోళం నెలకొంది. మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణల మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ ప్రాజెక్ట్ అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈనేపథ్యంలో డీకె అరుణ మాట్లాడుతూ తొలిసారి గెలిచి ఎమ్మెల్యేగా సభకు వచ్చిన జగదీశ్ రెడ్డి చాలా నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి ...ఆంధ్రా నేతల బూట్లు నాకారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అన్నారు. దాంతో జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్ మధుసుదనాచారి మాట్లాడుతూ అభ్యంతరకర పదాలను రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. మరోవైపు జగదీశ్ రెడ్డి కూడా తాను కేసీఆర్ చలవ వల్ల, సూర్యాపేట ప్రజల ఆశీస్సులతో మంత్రినయ్యానన్నారు తన వ్యాఖ్యల్లో తప్పుంటే రికార్డుల నుంచి తొలగించాలని అన్నారు. దాంతో సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.