* 111 జీవోను ఉపసంహరించి 80 గ్రామాలకు ఊరటనిస్తాం: సీఎం
* హిమాయత్‌సాగర్ ఎగువ గ్రామాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం
* కోర్టు వివాదాల్లోని లక్షల కోట్ల విలువైన భూములను విడిపిస్తాం.. ఆ డబ్బుతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం
* సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్య
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయని, కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని నిలబెట్టుకునేందుకు యావత్ తెలంగాణ జాతి కృషి చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆదివారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. లక్షల కోట్ల విలువైన భూములు కోర్టు వివాదాల్లో ఉన్నాయని, వాటిని విడిపించి ఆ డబ్బును రాష్ట్రాభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 80కి పైగా గ్రామాలకు ఇబ్బందిగా మారిన జీవో నంబర్ 111 ఉపసంహరణకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. హిమాయత్‌సాగర్ కలుషితం కాకుండా.. దాని ఎగువభాగంలో భారీ నిర్మాణాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను నిషేధిస్తూ ఈ జీవోను తెచ్చారని, కానీ జీవో వల్ల అనేక గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయిందని సీఎం వివరించారు.
అన్ని గ్రామాలకూ ఈ జీవోను వర్తింపజే యాల్సిన అవసరం లేదని, కొన్నింటిని మినహాయించేందుకు ముందుగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖల అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి తదనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు. అధికారులు, శాసనసభ్యులతోనూ కమిటీ వేసి దాని నివేదిక ఆధారంగా స్పందిస్తామన్నారు. కొత్త రాష్ట్రంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. మూడేళ్ల తర్వాత నిమిషం కూడా కరెంటు కోత లేకుండా చేస్తానని ఇప్పటికే చెప్పానని, దాన్ని చేసి తీరుతానని నొక్కిచెప్పారు.
అలాగే నాలుగేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఉండేలా చూస్తానని, అందరితోనూ కృష్ణా, గోదావరి నీరు తాగిస్తానని చెప్పారు. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఓట్లు అడగదని పునరుద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రైతులు లక్షాధికారులవుతారని అన్నారు. జిల్లాలోని వెయ్యి ఎకరాల్లో పాలీహౌజ్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
బిందు సేద్యం పరికరాలను దళితులకు వంద శాతం రాయితీపై, బీసీలకు 90 శాతం రాయితీపై అందజేస్తామన్నారు. రంగారెడ్డి నుంచి వచ్చే కూరగాయలు రాజధానికి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ క్రమక్రమంగా నెరవేరుస్తున్నామని తెలిపారు. చేవెళ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చేవెళ్ల, శంకరపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేయిస్తానన్నారు. రోడ్లను అభివృద్ధి చేయిస్తానని చెప్పారు. కాగా, ఎమ్మెల్యే యాదయ్యతో పాటు పోలీస్ రామిరెడ్డి, వారి అనుచరులు కూడా అధికార పార్టీలో చేరారు.
చెరువుల జీవో రద్దు!
Published Mon, Nov 17 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement
Advertisement