దెబ్బకు దెబ్బ.. ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ కౌంటర్‌ | telangana government counter on ap in project issues | Sakshi
Sakshi News home page

దెబ్బకు దెబ్బ.. ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ కౌంటర్‌

Published Fri, Mar 17 2017 2:08 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

దెబ్బకు దెబ్బ.. ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ కౌంటర్‌ - Sakshi

దెబ్బకు దెబ్బ.. ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ కౌంటర్‌

ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై సీరియస్‌
ఎలాంటి అనుమతుల్లేకుండా ఎలా చేపడతారు?
అపెక్స్‌ కౌన్సిల్, బోర్డుకు చెప్పకుండానే 25 టీఎంసీల వినియోగానికి ప్రణాళికలా?
కేంద్రానికి, గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం


సాక్షి, హైదరాబాద్‌
తాము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మోకాలడ్డుతున్న ఆంధ్రప్రదేశ్‌కు అదే స్థాయిలో దీటుగా బదులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేసింది. ఏపీ గతంలో నిర్మించిన పట్టిసీమతోపాటు పోలవరం ఎడమ కాల్వపై తలపెట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి కేంద్ర సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు లేవని, దీనిపై గట్టిగా నిలదీయాలని భావిస్తోంది. అంతర్రాష్ట్ర వ్యవహారాల విభాగం ఈ అంశంపై ఇప్పటికే కీలక సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో కేంద్ర జలవనరుల శాఖకు, గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేయనుంది. తెలంగాణలో గోదావరి నీటిని వినియోగించుకునేందుకు ఇప్పటిదాకా ఒక్క భారీ ప్రాజెక్టు లేకపోవడంతో ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతలను చేపట్టింది. ప్రాణహిత– చేవెళ్లలో భాగమైన ఈ ప్రాజెక్టును కొత్తదిగా చూపుతూ ఏపీ వ్యతిరేకించే ప్రయత్నాలు చేయడాన్ని తెలంగాణ సీరియస్‌గా తీసుకుంది.

పట్టిసీమలో వాటా ఏది?
కేంద్ర జల సంఘం సూచనలతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును విభజించి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టామని తెలంగాణ పదేపదే చెబుతోంది. అయినా ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరానికి పర్యావరణ అనుమతులు రాకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. పర్యావరణ అనుమతులు లేనిదే ఈ ప్రాజెక్టు ముందుకు కదలదు. పొరుగు రాష్ట్రాలు వ్యతిరేకిస్తే సహజంగానే పర్యావరణ అనుమతులు సాధించడం ఆలస్యమవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నం అంశాన్ని తెలంగాణ తెరపైకి తెచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో పోలవరం కుడి కాల్వపై రూ.1,420 కోట్లతో పట్టిసీమ నిర్మించిన ఏపీ ప్రభుత్వం... ఎడమ కాల్వపై పురుషోత్తపట్నం ఎత్తిపోతల చేపడుతోంది. పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న నీటిలో ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు ఎంత వాటా దక్కుతుందన్న దానిపై వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. తమకు 43 టీఎంసీల వాటా దక్కుతుందని తెలంగాణ కోరుతుండగా.. దీనిపై కేంద్రం ఎటూ తేల్చలేదు.

ఒక్క అనుమతి కూడా లేకుండానే..
పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా తూర్పుగోదావరి జిల్లాతోపాటు విశాఖ జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తామంటూ గతేడాది అక్టోబర్‌ 14న ఏపీ ప్రభుత్వం జీవో వెలువరించింది. ఏలేరుకు గోదావరి జలాలను తరలిస్తామంటూ రూ.1,638 కోట్లతో అనుమతులిచ్చింది. పురుషోత్తపట్నం వద్ద గోదావరికి ఎడమ వైపున 40.8 కిలో మీటరు వద్ద పంప్‌హౌస్‌ నిర్మించి 3,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు ప్రతిపాదించారు. పంప్‌హౌస్‌ నుంచి 10 కిలోమీటర్ల వరకు పైపులైన్‌ నిర్మించి అక్కడి పోలవరం కాల్వలోకి నీటిని మళ్లిస్తారు. తిరగి కిర్లంపూడి మండలం కృష్ణవరంలో పోలవరం కాల్వ 57.88వ కిలోమీటరు వద్ద రెగ్యులేటర్‌ను నిర్మించి ఏలేరు కాల్వలోకి నీటిని మళ్లించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక వేసింది.

ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 25 టీఎంసీల నీటిని తీసుకొని 2.15 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళికలు వేసి పనులు చేపట్టింది. అయితే కేంద్ర జల సంఘం నుంచి కనీస సూత్రప్రాయ అనుమతులు లేకుండా, అపెక్స్‌ కౌన్సిల్‌లో కానీ, గోదావరి బోర్డు ముందు కానీ చర్చించకుండా ఈ ప్రాజెక్టు ఎలా చేపడతారన్నది తెలంగాణ వాదన. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్‌–9లోని 85వ నిబంధన కింద గోదావరిపై ఎలాంటి కొత్త ప్రాజెక్టు నిర్మించినా దానికి బోర్డు అనుమతి కచ్చితంగా అవసరం. కానీ ఆ అనుమతి లేకుండానే ప్రాజెక్టును చేపట్టడాన్ని తెలంగాణ ప్రశ్నిస్తోంది. కనీసం కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోకపోవడాన్ని తప్పుపడుతోంది.

ఒకట్రెండు రోజుల్లో కేంద్రానికి ఫిర్యాదు
పురుషోత్తపట్నంపై తెలంగాణ అధికారులు ఇప్పటికే ఓ నివేదిక రూపొందించారు. ఇందులో ప్రధానంగా ట్రిబ్యునల్‌ తీర్పును ఏపీ ఉల్లంఘిస్తున్న అంశాన్ని ఉటంకించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా 1,486 టీఎంసీలకు మించి అదనంగా నీటిని తీసుకునే హక్కు ఇరు రాష్ట్రాలకు ఉండదని, ఒకవేళ దాన్ని ఉల్లంఘించి పురుషోత్తపట్నం చేపడితే తెలంగాణ హక్కులకు తీవ్ర భంగం కలుగుతుందని అందులో స్పష్టం చేశారు. ఈ దృష్ట్యా పురుషోత్తపట్నం చేపట్టకుండా ఏపీని ఆదేశించేలా కేంద్ర జల వనరుల శాఖ, గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేయాలని నివేదికలో సూచించారు. ఈ నివేదిక ప్రస్తుతం ఉన్నతాధికారుల పరిశీలనకు వెళ్లింది. అక్కడ తుది నిర్ణయం తీసుకున్నాక ఒకట్రెండు రోజుల్లో పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై కేంద్రం, గోదావరి బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేయనుంది.

తెలంగాణ వాదన ఇది..
బచావత్‌ ట్రిబ్యునల్‌... గోదావరి జలాల్లో ఉమ్మడి ఏపీకి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది. హక్కుగా వచ్చిన 1,486 టీఎంసీల వినియోగానికి ఉమ్మడి ఏపీ ప్రణాళికలు వేసింది. ఈ 1,486 టీఎంసీల వినియోగానికి సంబంధించి చేపడుతున్న ప్రాజెక్టుల ప్రణాళికపై 2013లో గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌కు నివేదించింది. అందులో పురుషోత్తపట్నం ఎక్కడా లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement