
గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉన్న జిల్లాల్లోని ఉద్యోగులకు ఈ మేరకు ఆదేశాలు అందాయి.
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఈనెల 29 వరకు అమల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన పూర్తిస్థాయిలో సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇం దులో భాగంగా సోమవారం నుంచి సిబ్బందిని నూరుశాతం హాజరు కావాలని స్పష్టం చేసింది. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉన్న జిల్లాల్లోని ఉద్యోగులకు ఈ మేరకు ఆదేశాలు అందాయి.
దీంతో జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి కార్యాలయాలు పూర్తిస్థాయిలో సేవలందించనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తిస్తారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు కళకళలాడనున్నాయి. రెడ్‌జోన్లుగా ఉన్న జిల్లాల్లో మాత్రం ఉద్యోగులు ప్రస్తుతం కొనసాగుతున్న రొటేషన్ పద్ధతిలోనే హాజరు కావాల్సి ఉంటుంది. మరోపక్క హైదరాబాద్ నగరంలో పరిమిత సంఖ్యలో ఐటీ సంస్థల కార్యకలాపాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
(చదవండి: ఈ దశ అత్యంత కీలకం! )
తీవ్రత తగ్గడంతో...
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి మినహా మిగతా జిల్లాల్లో పాజిటివ్ కేసుల నమోదు పెద్దగా లేదు. ఈ క్రమంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. నిర్మాణ, వ్యవసాయ రంగాలకు సంబంధించిన వ్యాపారాలు, దుకాణాలను తెరిచేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. దీంతో చాలావరకు వ్యాపార సంస్థలు, పరిశ్రమలు తెరుచుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 7 నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధిస్తుండడంతో కాస్త ముందుగానే ఈ సంస్థలు మూసుకుంటున్నాయి. జన సమూహాలు ఏర్పడకుండా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తుండడంతో ప్రభుత్వ శాఖల కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు సర్కారు ఉపక్రమించింది.
కేసీఆర్ సమీక్ష తరువాత స్పష్టత
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెడ్‌జోన్ల జాబితాలో ఐదు జిల్లాలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. గత రెండు వారాలుగా వరంగల్ అర్బన్ జిల్లాల్లో కేసులే నమోదు కాలేదు. అలాగే వికారాబాద్ జిల్లాలోనూ పది రోజులుగా కేసులు నమోదు కాలేదు. దీంతో ఈ రెండు జిల్లాలు కొద్దిరోజుల్లోనే ఆరెంజ్ జోన్‌లోకి రానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ విస్తరించిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కేసుల నమోదు పెరుగుతుండడంతో ఇక్కడ కొంతకాలం లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలుచేసే అవకాశం ఉంది.
మరోవైపు రెడ్‌జోన్లలో కూడా వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లోని ఉద్యోగులు దాదాపు పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని శాఖల్లో వంతులవారీగా ఉద్యోగులు వస్తుండగా, కొందరు మాత్రం తక్కువ సమయం హాజరై ముఖ్యమైన పనులను పూర్తిచేస్తున్నారు. కాగా, ఈ నెల 15తర్వాత సమీక్ష నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. మరో నాలుగు రోజుల్లో లాక్‌డౌన్ సడలింపులపై మరింత స్పష్టత రానుంది.
పది శాతం ఐటీ కంపెనీల్లో నేటి నుంచి కార్యకలాపాలు
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో సోమవారం నుంచి ఐటీ సంస్థల కార్యకలాపాలు పరిమిత సంఖ్యలో సిబ్బందితో ప్రారంభం కానున్నాయి. మహానగరం పరిధిలో వెయ్యికిపైగా బహుళజాతి, మధ్యతరహా, చిన్న ఐటీ కంపెనీలున్నాయి. సోమవారం నుంచి వీటిలో పదిశాతం కంపెనీలు.. 15 శాతం సిబ్బందితో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా)తెలిపింది. సైబరాబాద్ పోలీసులు 33శాతం మంది ఉద్యోగుల హాజరుతో ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతించినా.. ఆ స్థాయిలో ఉద్యోగుల హాజరుకు మరో మూడు వారాలు సమయం పడుతుందని అంచనా.
ఇప్పటికే పలువురు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన ఉపకరణాలను తమ నివాసాలకు తరలించుకున్నారు. తిరిగి కార్యాలయాల్లో పనిచేసేందుకు తగిన ఏర్పాట్లు, శానిటైజేషన్, ఉద్యోగుల మధ్య భౌతికదూరం నిబంధనకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున ఇప్పటికిప్పుడు అన్ని సంస్థలు ఒకేసారి తెరుచుకునే పరిస్థితి లేదు. కాగా, ప్రభుత్వం ఐటీ కారిడార్‌లో కార్యకలాపాలకు అనుమతించడంతో ఈ రంగం మాంద్యం నుంచి గట్టెక్కే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.
(చదవండి: వలస కార్మికుల రాకతో రాష్ట్రంలో హైఅలర్ట్ )