పాత్రికేయులకు సర్కారు బిస్కట్!!
పాత్రికేయులను బెదిరిస్తున్నారని, రెండు తెలుగు వార్తా ఛానళ్లపై ఉన్న అనధికార నిషేధాన్ని ఎత్తేయడానికి సహకరించడంలేదని ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది. పాత్రికేయులను వ్యక్తిగతంగా సంతృప్తి పరిచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేటు గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాలకు జిల్లా విద్యా శాఖ నుంచి ఉత్తర్వులు వెళ్లాయి.
పాత్రికేయుల పిల్లలకు ఉచితంగా విద్య అందించాలన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. తాము దారిద్ర్య రేఖకు దిగువన ఉంటున్నామని, అందువల్ల ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు భరించగలిగే స్థాయిలో లేమని కొన్ని పాత్రికేయ సంఘాల ప్రతినిధులు విద్యాశాఖకు ఇటీవల ఓ లేఖ రాశారు. అందువల్ల విద్యాహక్కు చట్టం కింద తమ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించాలని కోరారు. ఆ మేరకే ఇప్పుడు ఉచిత విద్యను అందించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైందని సమాచారం.