‘రెవెన్యూ’కు కొత్తరూపు కోసం సర్కారు కసరత్తు | Telangana Government Will Implement New Policy In Revenue | Sakshi
Sakshi News home page

‘రెవెన్యూ’కు కొత్తరూపు కోసం సర్కారు కసరత్తు

Published Sun, Feb 23 2020 2:59 AM | Last Updated on Sun, Feb 23 2020 5:01 AM

Telangana Government Will Implement New Policy In Revenue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలకు నడుం బిగించిన ప్రభుత్వం.. భూములపై తహసీల్దార్లు, రెవెన్యూ డివిజనల్‌ అధికారుల (ఆర్డీఓ) పెత్తనానికి చెక్‌ పెట్టబోతోంది. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం భూ పరిపాలన పగ్గాలను పూర్తిగా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు అప్పగించాలని, క్షేత్రస్థాయి సమస్యలు రాకుండా తహసీల్దార్లు, ఆర్డీవోలను ఈ అధికారాల నుంచి తప్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ముఖ్యంగా రికార్డుల మార్పుచేర్పులు, మ్యుటేషన్ల జారీ అధికారాలను అదనపు కలెక్టర్లకు బదలాయించనుంది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు తేల్చొద్దని అధికారికంగా ఆర్డీవోలు, తహసీల్దార్లకు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రతివారం మండల, డివిజన్‌ స్థాయిలో జరిగే రెవెన్యూ కోర్టులకు బ్రేక్‌పడింది. భూ వివాదాలపై మండల, డివిజన్, జిల్లా (అదనపు కలెక్టర్‌) స్థాయిలో రెవెన్యూ కోర్టులు జరుగుతాయి. రంగారెడ్డి జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములపై నెలకొన్న వివాదాలపై ఒకరిద్దరు తహసీల్దార్లు అడ్డగోలుగా తీర్పులిచ్చారని, తద్వారా భూములపై న్యాయపరమైన చిక్కులు ఏర్పడటమే కాక విలువైన భూములు పరాధీనమయ్యే పరిస్థితి నెలకొందని, దీంతో పెండింగ్‌లో ఉన్న కేసులను మరోసారి క్షుణ్ణంగా సమీక్షించాలనే ఉద్దేశంతో రెవెన్యూ కోర్టులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు అధికారులు చెబుతున్నారు.

భూ రికార్డులు ఫ్రీజ్‌!
రెవెన్యూ రికార్డులు తారుమారు కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా తయారుచేసిన వివాదరహిత రికార్డులను ఫ్రీజ్‌ చేయాలని యోచిస్తోంది. ఇదే అంశాన్ని ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ ఎజెండాలోనూ చేర్చడం గమనార్హం. భూములకు సంబంధించిన ఎలాంటి రికార్డులు ఇకపై ట్యాంపర్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇప్పటికే సీసీఎల్‌ఏ అధికారులు భూరికార్డుల నిక్షిప్తంపై మార్గదర్శకాలు తయారు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇనాం, వక్ఫ్, దేవాదాయ, భూదాన్‌ కేటగిరీల్లో ఉన్న కోర్టు కేసుల వివరాలనూ సేకరిస్తున్నారు. వీటితోపాటు కౌలు వివాదాల్లో ఉన్న భూముల వివరాలను కూడా తెలపాలని ఇటీవలే క్షేత్రస్థాయికి సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీ చేసింది.
 
24 గంటల్లో భూముల మ్యుటేషన్‌
భూముల మ్యుటేషన్లు 24 గంటల్లో పూర్తి చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు మ్యుటేషన్‌ ప్రొసీడింగ్స్‌ (ఆటోమేటిక్‌ డిజిటల్‌ సంతకం జరిగేలా) ఇవ్వడమేగాకుండా.. ఆన్‌లైన్‌ పహాణీలో నమోదుచేసేలా చట్టంలో పొందుపరిచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. 

అధికారాలే కాదు.. అధికారులకూ కోత
రెవెన్యూ చట్టంలో మరో కీలక నిర్ణయానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖను సంస్కరించడం చట్టంతో సరిపోదని భావిస్తున్న సీఎం కేసీఆర్‌.. పాలన వ్యవహారాలను గాడిలో పెట్టేందుకు అధికారాలకు కోత పెట్టడమేకాక ఆరో వేలులాంటి కొన్ని అధికార వ్యవస్థలనూ రద్దుచేయాలని నిర్ణయించారు. 

  • జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో), గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేయాలనే నిర్ణయానికొచ్చారు. అదనపు కలెక్టర్‌ (సాధారణ) పోస్టుల్లో అత్యధికం స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు/ డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. వీరిలో చాలామంది డీఆర్వోలుగా పనిచేస్తున్నారు. డీఆర్వో పోస్టు వల్ల పెద్దగా ప్రయోజనంలేదని భావిస్తోన్న సర్కారు.. దీనికి మంగళం పాడి ప్రస్తుతం డీఆర్వోలు నిర్వహిస్తోన్న విధులను కలెక్టరేట్‌లోని ఆ తర్వాతి స్థాయి అధికారికి అప్పగించనుంది. 
  • గ్రామస్థాయిలో రెవెన్యూకు ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించేది వీఆర్వోలే. రెవెన్యూ అవినీతిలో వీరిదే అందెవేసిన చేయి అని పలుమార్లు సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు కూడా. తాజాగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. దీంతో ఈ వ్యవస్థను రద్దుచేసే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీఆర్వోలుగా పనిచేస్తున్న వారిని వారి అర్హత, పనితీరు ప్రామాణికంగా తీసుకొని క్వాలిఫైడ్‌ వీఆర్వోలను జూనియర్‌ అసిస్టెంట్లుగా రెవెన్యూలోనే అంతర్గత సర్దుబాటు చేయడమా? లేదా పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలో విలీనం చేయడమా? అనేది రెవెన్యూ యంత్రాంగం పరిశీలిస్తోంది.
  • రెవెన్యూలో అవినీతికి సర్వేయర్లు కూడా ప్రధాన కారణమని అంచనాకొచ్చిన సర్కారు.. ఆ వ్యవస్థను ప్రైవేటీకరించే యోచన చేస్తోంది. ఈ మేరకు ప్రైవేటు సర్వేయర్లకు లైసెన్సులు జారీ చేయనుంది. 
  • గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ)ను కూడా పంచాయతీరాజ్‌ పరిధిలో విలీనంచేసే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement