
సాక్షి, హైదరాబాద్: రానున్న వానాకాలం, యాసంగి సీజన్లకు రైతుబంధు సొమ్ము విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రెండు సీజన్లలో సీజన్‌కు ఎకరానికి రూ.5వేల చొప్పున ఇవ్వనున్న పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతు ఖాతాల్లోకి ఈ–కుబేర్ ద్వారా జమ చేస్తామని, నిధుల లభ్యతను బట్టి తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు తొలి ప్రాధాన్యమిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జనవరి 23, 2020న భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) ఇచ్చిన పట్టాదారుల రికార్డుల ఆధారంగా రైతుబంధు పంపిణీ చేస్తారు. కాగా, రైతుల ఖాతాల్లో నగదు జమయిన తర్వాత రికార్డులను ఆడిట్ టీంలు పరిశీలిస్తాయి. వ్యవసాయ శాఖ నియమించిన ఆడిటర్లు లేదా కాగ్ ప్రతినిధులు ఆడిటింగ్‌లో పాల్గొంటారు. నాబార్డు, కాగ్, ఆర్‌బీఐ నిబంధనలకనుగుణంగా తనిఖీలుంటాయి.
‘రైతుబంధు’ అమలుకు మార్గదర్శకాలివే..
► ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన సమయంలో సీసీఎల్‌ఏ ఇచ్చిన రికార్డుల ఆధారంగా భూమి యజమానులకు మాత్రమే రైతుబంధు వర్తిస్తుంది. ఆ తర్వాత రికార్డుల్లో పేర్లు మారినా కొత్త రైతులకు మాత్రం మళ్లీ వానాకాలం నుంచే రైతుబంధు వర్తింపజేస్తారు. రబీలోనూ వీరిని పరిగణనలోకి తీసుకోరు.
► సీసీఎల్‌ఏ నుంచి ఏడాదికి ఒక్కసారే అర్హులైన రైతుల వివరాలు తీసుకుంటారు. అంటే జనవరి 23, 2020న తీసుకున్న రికార్డుల్లో మార్పులు చేయాలనుకుంటే ఏడాది వరకు ఆగాల్సిందే.
► గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఇచ్చిన జాబితా ఆధారంగా అటవీ భూములపై హక్కు పత్రాలు (ఆర్‌వోఎఫ్‌ఆర్)న్న రైతులకూ రైతుబంధు వర్తిస్తుంది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పాలితం గ్రామ హామ్లెట్ కాసులపల్లిలో రంగనాయకస్వామి దేవాలయ భూములను దీర్ఘకాలికంగా సాగు చేసుకుంటున్న 621 మంది రైతులకు కూడా ఆర్‌వోఎఫ్‌ఆర్ తరహాలో ప్రత్యేక కేసు కింద పరిగణించి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఇచ్చే విస్తీర్ణపు అంచనా మొత్తానికి రైతుబంధు వర్తింపజేస్తారు.
► ఒక రైతుకు సంబంధించిన భూమి రాష్ట్రంలో ఎక్కడున్నా సదరు రైతు ఆధార్ వివరాల ఆధారంగా అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు.
► గత మూడు సీజన్ల తరహాలోనే ఈ–కుబేర్ వ్యవస్థ ద్వారా నేరుగా రైతు ఖాతాల్లోకే నిధులు జమ చేస్తారు.
► ఆర్థిక శాఖ నుంచి రైతుబంధు నిధులు దశలవారీగా వస్తే.. తక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల నుంచి ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల వరకు బిల్లులు ప్రాధాన్యతా క్రమంలో పాస్ అవుతాయి.
► ఎవరైనా రైతు పెట్టుబడి సాయం వద్దనుకుంటే మండల వ్యవసాయ విస్తరణాధికారి లేదా వ్యవసాయ అధికారికి ‘గివిట్ అప్’ దరఖాస్తు పూర్తిచేసి ఇవ్వాలి. తద్వారా రైతుబంధు పోర్టల్‌లో ఆ పట్టాదారు కాలమ్‌లో ‘గివిట్‌అప్’ అని నమోదుచేస్తారు.
► ఈ పథకం అమలు పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో కమిటీ ఏర్పాటుచేశారు. కమిటీ చైర్మన్‌గా వ్యవసాయ శాఖ కార్యదర్శి, కన్వీనర్‌గా కమిషనర్, సభ్యులుగా ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, రాష్ట్ర సమాచార అధికారి (ఎన్‌ఐసీ) ఉంటారు.
► కలెక్టర్ల మార్గదర్శనం మేరకు జిల్లాస్థాయిలో వ్యవసాయ అధికారులు పథకం అమలు బాధ్యతలు తీసుకుంటారు.
► మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏర్పా టు చేసుకునే వ్యవస్థల ఆధారంగా, రెవెన్యూ శాఖతో సంప్రదింపులు జరుపుతూ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో పథకం అమ లుకు సంబంధించిన ప్రతి వినతిని 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment