* వచ్చే బడ్జెట్‌లోగా ప్రవేశపెడతాం... అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన
* ‘మెట్రో’ భూములపై చర్చకు సిద్ధం
* బీసీలకూ ‘కల్యాణలక్ష్మి’ పరిశీలిస్తాం
* ఎస్టీ రిజర్వేషన్లపై కమిషన్ వేస్తాం
* తమిళనాడు తరహా చట్టానికి యోచన
* ఖాళీల లెక్క తేలాక ఉద్యోగాల భర్తీ
* మూడేళ్లలో 20 వేల మెగావాట్ల విద్యుత్
* దళితుల భూమిలో సర్కారు పెట్టుబడి
* ప్రభుత్వ స్థలాల్లో ఉన్న పేదలకు
* పట్టాలిస్తామని ముఖ్యమంత్రి హామీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. డిసెంబర్ నాటికి వాస్తవ పరిస్థితిపై స్పష్టమైన అవగాహన వస్తుందని, వచ్చే బడ్జెట్‌లోగా శ్వేతపత్రం అందిస్తామని ఆయన అసెంబ్లీలో తెలిపారు. శుక్రవారం బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమాధానం తర్వాత విపక్ష నేతలు లేవనెత్తిన పలు అంశాలకు ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు.
‘ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రవేశపెట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొన్ని సందర్భాల్లో ఉన్నోళ్లమని చెప్పుకుంటే మంచిదా.. లేనోళ్లమని చెబితే బాగుంటుందా.. అని ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు జనాభా నియంత్రణలో మన రాష్ట్రం ప్రగతి కనబరిచింది. జనాభా వృద్ధి తగ్గింది. ప్రోత్సాహకంగా కేంద్రం మనకే ఎక్కువ నిధులివ్వాలి. కానీ, జనాభా ప్రాతిపదికన రావాల్సిన నిధులు తగ్గిపోయాయి. కొత్త రాష్ట్రం కావడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు కొన్ని ఇప్పటికీ ఏపీ ఖాతాలో జమవుతున్నాయి. వచ్చే బడ్జెట్ నాటికి ఆర్థిక స్థితిగతులపై పూర్తి స్పష్టత వస్తుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
కడుపు, నోరు కట్టుకున్నాం..
హైదరాబాద్‌లో మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయని సీఎం తెలిపారు. ‘మెట్రో భూములపై అన్ని పత్రాలు సభ ముందుంచుతాం. అన్నింటిపై చర్చిస్తాం. మెట్రో భూముల బండారం బయటపడాల్సిందే. మెట్రోకు సంబంధించిన అంగుళం భూమిని కూడా ప్రభుత్వం ఎవ్వరికీ ఇవ్వలేదు. మేం తప్పులు చేయాలని కొందరు కోరుకుంటున్నారు. కానీ అలాంటి పరిస్థితి రానివ్వం. కడుపు, నోరు కట్టుకొని పని చేస్తున్నాం. ప్రపంచంలోనే వేగంగా జరుగుతున్న మెట్రో పనుల్లో హైదరాబాద్ ముందుం ది. అవసరమైతే డబ్బులు ఎక్కువ చెల్లించైనా భూసేకరణ చేస్తాం. అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి’ అని వివరించారు.
‘కల్యాణ లక్ష్మి’ పథకం అమలు తీరును పరిశీలించిన తర్వాత.. దాన్ని బీసీ వర్గాలకూ విస్తరించే ఆలోచన ఉందని చెప్పారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లపై కమిటీని నియమిస్తామని సభలో ప్రకటించారు. ‘వాల్మీకి బోయ, కాయిత లంబాడీ, మరికొన్ని ఉప కులాలను కలిపితే గిరిజనుల జనాభా 11 శాతానికి చేరుతుందని అంచనా వేశాం. తమిళనాడు తరహాలో చట్టం తీసుకురావాలనే ఆలోచన ఉంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని డబ్బా కొట్టుకునే ఆలోచన తమకు లేదని సీఎం అన్నారు. ప్రభుత్వ పోస్టులు, ప్రభుత్వరంగ సంస్థల్లోని ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామన్నారు. ‘ఉద్యోగుల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. తర్వాతే ఖాళీల సంఖ్య లెక్క తేలుతుంది. అవన్నీ భర్తీ చేస్తాం. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విప్రోలో 5 వేల ఉద్యోగాలు, టీసీఎస్‌లో మరో 28 వేల మందికి ఉపాధి కల్పించేందుకు ఆ కంపెనీలు ఇప్పటికే ముందుకొచ్చాయి’ అని చెప్పారు.
విద్యుత్ విషయంలో అద్భుతాలు
విద్యుత్ విషయంలో తామేం అద్భుతాలు సృష్టించడం లేదని, కానీ అద్భుతాలు జరుగుతాయని సీఎం వ్యాఖ్యానించారు. ‘ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుపై అనుమానాలేమీ అక్కర్లేదు. ప్రైవేట్ ప్లాంట్లతో సంబంధం లేకుండా.. నేరుగా ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నాం. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ లైన్లు నిర్మాణంలో ఉన్నాయి. అంగుల్-పలాస లైన్ నాలుగైదు నెలల్లో పూర్తవుతుంది. వార్దా-డిచ్‌పల్లి లైనుకు మరో ఏడాదిన్నర పడుతుంది. ఏది అందుబాటులోకి వస్తే అది వినియోగించుకుంటాం.
వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ ఇచ్చేం దుకు ఇంకా 1,500 మెగావాట్ల కరెంట్ కావాలి. జైపూర్, భూపాలపల్లి, కేంద్రం వాటాతో వచ్చే ఏడాది ఆగస్ట్‌నాటికి 1,500 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. ఎన్టీపీసీ నుంచి 4 వేల మెగావాట్లు, బీహెచ్‌ఈఎల్ నుంచి 3 వేల మెగావాట్లు, జెన్‌కో ద్వారా మొత్తం 6 వేల మెగావాట్లు.. అన్నీ కలిపితే మూడో ఏడాది నిండేసరికి 20 వేల మెగావాట్లు అందుబాటులో ఉంటుంది. కృష్ణపట్నం, హిందుజా ప్లాంట్ల ద్వారా 2,600 మెగావాట్లలో 54 శాతం వాటా మనకు రావాల్సిందే. మన దగ్గర ఉన్న 1,800 మెగావాట్ల నుంచి 46 శాతం ఆంధ్రాకు ఇవ్వాలి’ అని వివరించారు.
దళితుల భూమిలో సర్కారు పెట్టుబడి
‘గతంలో అసైన్డ్‌భూముల పంపకం అశాస్త్రీయంగా ఉందన్నారు. దళితులకు ఇచ్చిన భూమి ఇప్పుడు వాళ్ల దగ్గర లేదు. మా ఊళ్లో 90 ఎకరాలుంటే 130 మందికి పంపిణీ చేశారు. అందుకే బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు పెట్టుకున్నాం. ముందుగా ఎకరం, రెండెకరాలున్న వారందరికీ.. మూడెకరాలుండేలా భూమి పంపిణీ చేస్తాం. ఏడాదిపాటు దళిత రైతులకు పెట్టుబడి కూడా ఇస్తాం. 3 నెలలకోసారి భూముల స్థితిగతులపై సమీక్ష జరుపుతాం’ అని సీఎం స్పష్టం చేశారు.
పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించి తీరుతామన్నారు. ‘ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగింది. సీఐడీ విచారణ జరుగుతోంది. ఎంతమంది జైళ్లో ఉంటారో తెలియని పరిస్థితి. అందరం కలిసి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుందాం’ అని అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న పేదలకు పట్టాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఫాస్ట్ పథకంతో ప్రతి పేద విద్యార్థికీ ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమన్నారు.
గత ప్రభుత్వం నాలుగేళ్లుగా పెండింగ్‌లో పెట్టిన రూ.1,587 కోట్ల బకాయిల్లో ఇప్పటికే రూ. 500 కోట్లు చెల్లించామన్నారు. పేద విద్యార్థులకు అన్యాయం జరగకూడదనే, గతంలో రూ. 1760 కోట్లు కేటాయిస్తే ఈసారి బడ్జెట్‌లో రూ. 2735 కోట్లు కేటాయించినట్లు కేసీఆర్ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ హాస్టళ్లన్నింటికీ ఫైన్ క్వాలిటీ సన్న బియ్యం సరఫరా చేస్తామన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో ఫ్లోరైడ్ తీవ్రత ఉన్న నల్లగొండ జిల్లాకు మొదటి ప్రాధాన్యమిస్తామని సీఎం ప్రకటించారు. 104, 108 సేవలను విస్తరిస్తామని, మండలానికో 104 సర్వీసు.. 75 వేల జనాభాకో 108 అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అర్హులెవరికైనా రేషన్ కార్డులు, పింఛన్లు రాకపోతే ఉన్నతాధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను పంపి న్యాయం చేస్తామని సీఎం తెలిపారు.
ఆర్థికస్థితిపై శ్వేతపత్రం
Published Sat, Nov 15 2014 1:34 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement
Advertisement