కొట్టొచ్చినట్టుగా నిర్లక్ష్యం​ | Telangana High Court Order To Revolution Inter Papers | Sakshi
Sakshi News home page

కొట్టొచ్చినట్టుగా నిర్లక్ష్యం​

Published Wed, Apr 24 2019 12:56 AM | Last Updated on Wed, Apr 24 2019 12:44 PM

Telangana High Court Order To Revolution Inter Papers - Sakshi

తగినంత యంత్రాంగం లేదని చెప్పొద్దు. మరింత మంది సిబ్బందిని నియమించండి. సమస్య ఉందని, తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. చేయాలన్న చిత్తశుద్ధి లేదు. చేయలేమన్న భావనలో ఉన్నారు. సునామీ వస్తే బాధ్యత మాది కాదంటూ ఇలానే తప్పుకుంటారా? ఇది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం. వారు మన పిల్లలు. వారి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై లేదా?    – హైకోర్టు ధర్మాసనం   

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షా పత్రాల మూల్యాంకనం విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ విషయంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. తమకు గణాంకాలతో పని లేదని, విద్యార్థుల సమస్యకు పరిష్కారం ఎలా చూపుతారో సోమవారం కల్లా స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉత్తీర్ణులు కాలేకపోయిన 3 లక్షల మంది విద్యార్థుల పత్రాలను పునర్‌ మూల్యాంకనం చేయడానికి ఉన్న అవకాశాలు ఏమిటో తెలియచేయాలని సూచించింది. సోమవారం ఉదయం 10.15 గంటలకల్లా పరిష్కార మార్గాలతో తమ ముందు హాజరు కావాలని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌లను ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది విద్యార్థుల జీవితానికి సంబంధించిన వ్యవహారమని, ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని ప్రభుత్వానికి స్పష్టంచేసింది.

ఇంటర్‌ పరీక్షా పత్రాల మూల్యాంకనం సక్రమంగా చేయకపోవడం వల్ల విద్యార్థులకు తీరని నష్టం జరిగిందని, 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ నేపథ్యంలో రీవాల్యుయేషన్‌కు ఆదేశించడంతోపాటు మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై లంచ్‌మోషన్‌ రూపంలో ఏసీజే నేతృత్వంలో అత్యవసరంగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇది చాలా తీవ్రమైన అంశమని, 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని కోర్టుకు నివేదించారు. అధికారులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఈ సమస్యపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారని ధర్మాసనం ప్రశ్నించగా.. మూల్యాంకన బాధ్యతలు తీసుకున్న ఏజెన్సీ తన పని సక్రమంగా చేసిందా? లేదా? ఒప్పందం మేరకు వ్యవహరించిందా? లేదా? అన్నది కమిటీ చూస్తుందని ఆయన బదులిచ్చారు.

సక్రమంగా మార్కులిచ్చారా అన్నదే ముఖ్యం.. ఇక్కడ సమస్య అది కాదని.. ప్రశ్నలు, వాటి జవాబులు, వాటికి సక్రమంగా మార్కులు ఇచ్చారా? అన్నదే ముఖ్యమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లెక్కల్లో 100కి 100 వస్తాయనుకున్న విద్యార్థికి కేవలం 60 మార్కులే వస్తే ఆ విద్యార్థి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించింది. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు దిద్దిన పేపర్లను ఒకటికి రెండు సార్లు పరిశీలించే యంత్రాంగం ఉండటం తప్పనిసరని అభిప్రాయపడింది. పిటిషనర్‌ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే, ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ఎత్తున తప్పులు జరిగినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. దీనికి ఏఏజీ స్పందిస్తూ.. 9.7 లక్షల మంది పరీక్షలు రాశారని, ఇందులో 3 లక్షల మంది ఫెయిల్‌ అయ్యారని తెలిపారు. ఈ 3 లక్షల మందిలో 22 వేల మంది రీ కౌంటింగ్‌కు, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఈ సమయంలో పిటిషనర్‌ న్యాయవాది దామోదర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. అధికారుల తప్పదానికి విద్యార్థులు బలైపోయారని, అందువల్ల విశ్రాంత న్యాయమూర్తి చేత జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించాలని కోరారు.

జ్యుడీషియల్‌ విచారణ పరిష్కారం కాదు...
ఈ సమస్యకు జ్యుడీషియల్‌ విచారణ ఎంత మాత్రం పరిష్కారం కాదని ధర్మాసనం స్పష్టంచేసింది. ఒకవేళ విచారణకు ఆదేశిస్తే, తప్పు ఎలా జరిగింది.. ఎవరు బాధ్యులు అన్న విషయాలే తేలతాయి తప్ప.. విద్యార్థులకు న్యాయం జరిగే మార్గం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించింది. బాధ్యులను జైల్లో పెట్టినంత మాత్రాన విద్యార్థుల భవిష్యత్తకు భరోసా ఇచ్చినట్లు కాదంది. పరీక్షా పత్రాలను సక్రమంగా మూల్యాంకనం చేశారా? లేదా? ఏం తప్పులు జరిగాయి.. ఆ తప్పులను ఎలా సరిదిద్దాలి.. విద్యార్థుల భవిష్యత్తును ఎలా నిలబెట్టాలి.. అన్న అంశాలకే ప్రాధాన్యతనిచ్చి, వాటికి పరిష్కార మార్గాలను వెతకాలని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, ఇందులో తమకు ఎటువంటి సందేహం లేదని పేర్కొంది. వారంలోగా పునర్‌ మూల్యాంకనం చేయలేరా? అంటూ ఏఏజీని ప్రశ్నించింది. పునర్‌ మూల్యాంకనానికి 2 నెలల సమయం పడుతుందని ఏఏజీ రామచంద్రరావు చెప్పగా.. 9 లక్షల మంది పేపర్లను మూల్యాంకనం చేయడానికి నెల రోజులు పడితే, 3 లక్షల మంది పేపర్లను పునర్‌ మూల్యాంకనం చేయడానికి రెండు నెలల గడువు కావాలా? అంటూ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. కనీసం పది రోజుల్లో చేయలేరా? అని ప్రశ్నించింది.
 
మన పిల్లల పట్ల ఇలాగేనా వ్యవహరించేది?
‘‘తగినంత యంత్రాంగం లేదని చెప్పొదు. మరింత మంది సిబ్బందిని నియమించండి. సమస్య ఉందని, తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. చేయాలన్న చిత్తశుద్ది లేదు. చేయలేమన్న భావనలో ఉన్నారు. సునామీ వస్తే బాధ్యత మాది కాదంటూ ఇలానే తప్పుకుంటారా? ఇది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం. వారు మన పిల్లలు. వారి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై లేదా? వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రదాడి జరిగి మంటలు చెలరేగినప్పుడు 58 ఏళ్ల అగ్నిమాపక అధికారి చూస్తూ ఉండిపోలేదు. అందరి కన్నా ముందు వెళ్లి ఆయన ప్రాణాలను పణంగా పెట్టి పౌరుల ప్రాణాలను కాపాడారు. ఇక్కడ అంత సాహసం అవసరం లేదు. మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలు నిర్వర్తించండి చాలు’’అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ సమయంలో కోర్టు హాలులో ఉన్న ఇంటర్‌ కార్యదర్శి అశోక్‌ స్పందిస్తూ.. పునర్‌ మూల్యాంకనానికి తగినంత గడువు కావాలని కోరారు. రోజుకు 40 పత్రాలు మాత్రమే పునర్‌ మూల్యాంకనం అవుతాయని, ముగ్గురు ఎగ్జామినర్లు వాటిని పరిశీలించాల్సి ఉంటుందని వివరించారు. సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, ఇందుకు 4వేల మంది సిబ్బంది అవసరమని చెప్పారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం చెబుతూ.. తమకు ఈ గణాంకాలతో పనిలేదని, సమస్యకు పరిష్కార మార్గాలు మాత్రమే కావాలని స్పష్టం చేసింది. కోర్టు పనివేళలు ముగిసిన తర్వాత కూడా తాము పని చేస్తున్నామని.. సుప్రీంకోర్టు అవసరమైతే అర్థరాత్రులు కూడా కేసులను విచారిస్తుందని, మీరు పిల్లల కోసం మరింత ఎక్కువ సమయం పనిచేయలేరా? అని ప్రశ్నించింది. ఏది ఏమైనా కూడా సోమవారం కల్లా పునర్‌ మూల్యాంకనం విషయంలో పరిష్కార మార్గాలేమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement