తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ సగటు కన్నా ఎక్కువ ఉందని, గుజరాత్ తర్వాత దేశంలో ధనిక రాష్ట్రం మనదేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని గుర్తుచేశారు. తెలంగాణ తలసరి ఆదాయం గుజరాత్ సగటు కన్నా ఎక్కువని కేసీఆర్ తెలిపారు. గత ప్రణాళికా సంఘానికి, ఇప్పటి నీతి ఆయోగ్కు చాలా తేడా ఉందని అన్నారు. ప్రస్తుత నీతి ఆయోగ్లో ముఖ్యమంత్రులందరూ సభ్యులుగా ఉన్నారని చెప్పారు.
ఎఫ్ఆర్బీఎంలో మనకు రూ. 3 వేల కోట్ల నిధులు పెరిగాయని, ఎఫ్ఆర్బీఎంలో ప్రస్తుతం మనకు రూ. 14 వేల కోట్లు ఉన్నాయని తెలిపారు. మన అంచనా లెక్కలన్నీ సరిగ్గానే ఉన్నాయని వివరించారు. కొత్త రాష్ట్రంలో పన్నులు, ఆదాయం ఎలా ఉంటాయో కచ్చితమైన అంచనాలు లేవని ఆయన అన్నారు. భూములు అమ్మే ఆలోచనను వదులుకున్నామని, ఇంతవరకు ఒక్క గుంట భూమిని కూడా విక్రయించలేదని సీఎం కేసీఆర్ సభకు చెప్పారు. భూములు ప్రజా సంపద కాబట్టి, రాబడి బాగుంటేనే అమ్ముతామని ఆయన అన్నారు.
కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే..
*ఏపీ ఉద్యోగులు మనకు పర్మినెంట్ ట్యాక్స్ పేయర్స్
* ఏపీ ఉద్యోగులను మంచిగా చూసుకోవాలని అధికారులకు చెప్పాను
*ఏపీలో జీతాలు తీసుకుని హైదరాబాద్లో ఖర్చు చేస్తున్నారు... దీంతో మనకు ఆదాయం వస్తుంది
* వచ్చే మార్చి నుంచి వ్యవసాయానికి ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిరంతర విద్యుత్ అందిస్తాం
* ఏపీ ఉద్యోగులు మరో నాలుగేళ్లు తెలంగాణలో ఉన్నా మాకు అభ్యంతరం లేదు
* మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, వ్యవసాయానికి ప్రాధాన్యం
* గత ప్రభుత్వాలు రూ.200 పింఛన్ ఇస్తే... మేం రూ.1000 పింఛన్ ఇస్తున్నాం
* పింఛన్ల కోసం రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
* దళితులకు 3 ఎకరాల భూమి కచ్చితంగా ఇస్తాం
* దళితులకు ఎకరం భూమి ఉంటే... మరో రెండు ఎకరాలు కొని ఇస్తాం
*కుటుంబానికి 3 ఎకరాలు ఉంటే జీవనోపాధి బాగుంటుంది