సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం 92 లక్షల ఎకరాల భూములకు యాజమాన్య హక్కులు తేలాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో ఇప్పటివరకు మొత్తం 2,38,56, 322. 25 ఎకరాల భూరికార్డులను పరిశీలించగా, 1.46 లక్షల ఎకరాలకు యాజమాన్య హక్కులు కల్పించినట్టు రెవెన్యూ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. మిగిలిన 92 లక్షల ఎకరాల భూములకు గాను 4.3 లక్షలకు పైగా ఖాతాల్లోని 12 లక్షల ఎకరాల వివాదాస్పద భూములను పార్ట్–బీలో చేర్చారు. ఇందులో వివాదాలు, కోర్టు కేసులు, సర్వే చేయాల్సిన భూములున్నాయి. మరో 8.4 లక్షల ఖాతాలకు సంబంధించిన దాదాపు 24 లక్షల ఎకరాల భూముల రికార్డులను క్లియర్ చేసినా వాటిని పాసుపుస్తకాల కోసం ఇంకా సిఫారసు చేయలేదు.
ఖాతాలతో పాటు పాసుపుస్తకాల క్లియరెన్స్ వచ్చినప్పటికీ డిజిటల్ సంతకాలు కాని భూములు 5.3 లక్షల ఖాతాల్లో 15 లక్షలకు పైగా ఉంటాయని రెవెన్యూ గణాంకాలు చెబుతున్నాయి. తొలిసారి డిజిటల్ సంతకం కాని ఖాతాలు 18 లక్షలకు పైగా ఉండగా, అందులో 50 లక్షలకు పైగా ఎకరాల భూములున్నాయి. భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభమయిన తర్వాత 16 నెలలు గా రెవెన్యూ యంత్రాంగం భూరికార్డులను వడపోస్తున్నప్పటికీ ఇంకా ప్రక్షాళన పూర్తికాకపోవడంతో 25 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఖరీఫ్‌లో సాయాన్ని నష్టపోగా, మరింత సమయం తీసుకుంటే రబీలోనూ, కేంద్రం ఇచ్చే సాయం కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. రెవెన్యూ వర్గాలు మాత్రం ఎప్పుడు సమయం చిక్కినా ఈ పనిలోనే తమ సిబ్బంది నిమగ్నమవుతున్నారని అంటున్నాయి.
సిద్ధమవుతున్న గ్రామాల వారీ రికార్డులు
భూరికార్డుల ప్రక్షాళనలో లెక్క తేలిన భూముల వివరాలను సమగ్రంగా రూపొందించాలని, గ్రామాల వారీ రికార్డులను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 4 న భూపరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు పంపా రు. ఈ సర్క్యులర్ ప్రకారం గ్రామాల వారీగా కొత్త పహాణీలు తయారు చేయాల్సి ఉంది. ఈ పహాణీలోని ప్రతి సర్వే నంబర్ మీద డిజిటల్ సంతకం కనిపించేలా రూపొందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో పాటు తాజా 1బీ ఫారాలు, పహాణీ ఫార్మాట్‌లో సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను పేర్కొనాలని, ప్రభుత్వ ఆస్తుల పట్టిక కూడా తయారు చేయాలని సూచించారు. పార్ట్–బీలో చేర్చిన వివాదాస్పద భూములను కూడా సర్వే నంబర్ల వారీగా ప్రత్యేకంగా రూపొందించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment