మేం కళాకారులం కాదా!
తెలంగాణఉద్యమంలో పాల్గొన్నాం: ఒగ్గు కళాకారులు
మాకూ ఉద్యోగాలివ్వాలి
సచివాలయం ముట్టడికి యత్నం
అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్
హైదరాబాద్: టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఉద్యోగాలు కల్పించాలని ఒగ్గు కళాకారులు డిమాం డ్ చేశారు. తమకు అన్యాయం జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి విన్నవించుకునేందుకు సోమవారం 10 జిల్లాలకు చెందిన దాదాపు 400 మంది కళాకారులు రవీంద్రభార తి నుంచి సచివాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. వారిని లోపలికి అనుమతించకపోవడంతో రోడ్డుపై బైఠాయించి డప్పులు వాయిస్తూ, నృ త్యాలు చేస్తూ నిరసన తెలిపారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి, సాయంత్రం విడుదల చేశారు. ప్రభుత్వం కేవలం 550 మంది కళాకారులకు మాత్రమే ఉద్యోగాలిస్తామనడం అన్యాయమన్నారు.
ఎండను సైతం లెక్క చేయకుండా..
మధ్యాహ్నం ఎండను కూడా లెక్క చేయకుండా పెద్దలతోపాటు చిన్నపిల్ల లు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. చెప్పులు కూడా లేకుండా రోడ్డుపై నృ త్యాలు చేశారు. పిల్లలు కూడా ఎండలో డప్పులు వాయిస్తుండడంతో అక్కడి వారిని కలచివేసింది. ఒగ్గు కళాకారుడు రవి కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఒగ్గు కళాకారులమంతా కీలకంగా వ్యవహరించామని చెప్పారు. ఇతర కళాకారులతో తమను సమానంగా చూడాలని కోరారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలో దాదాపు వంద మంది ఒగ్గు కళాకారులు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. రాత్రులు కూడా ఒగ్గు కథ చెప్పడం వల్ల చాలామంది కళాకారులు అనారోగ్యం బారిన పడుతున్నారని, తమకు కూడా హెల్త్‌కార్డులు జారీ అయ్యేలా చూడాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.