సాక్షి, హైదరాబాద్: తెలంగాణరాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న కీలక నిర్ణయాల అమలు కోసం కమిటీలు వేయాలని సర్కార్ నిర్ణయించింది. 40 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడంతో అమలులో ఉన్న ఇబ్బందులను గుర్తించి, వాటికి పరిష్కారమార్గాలను సూచించడానికి గాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డిలతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు అధికారవర్గాలు వివరించాయి.
కేంద్ర వేతనాలపై...కేంద్రప్రభుత్వ వేతనాల అమలుకు సంబంధించి కూడా కమిటీని నియమించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఎంత.? వాటిని ఏ విధంగా రాష్ట్ర ఉద్యోగులకు వర్తింప చేయాలి.? అన్న అంశాలపై అధ్యయనం చేయడానికి ఈ కమిటీని నియమించనున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కంటే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు అధికంగా ఉన్నాయన్న భావన ఉంది. వేతన సవరణ సంఘం తన నివేదికను ఇదివరకే ప్రభుత్వానికి సమర్పించిన విషయం విదితమే. ప్రభుత్వం ఈ వేతన సవరణ సంఘం నివేదికను అమలు చేయడమా.? లేక కేంద్ర వేతనాలు అమలులోకి తీసుకుని రావాలా..? అనే అంశాలను పరిశీలించనుంది, కాగా కేంద్ర ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న వేతనాలు 2006లో నిర్ణయించిన వేతన సంఘం ఆధారంగా అమలు అవుతున్నాయి. వారికి 2016లో వేతన సవరణ జరగాల్సి ఉంది. అప్పటి వరకు పీ ఆర్‌సీని అమలు చేయకుండా ఆపడమా.? 2016 కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ చేస్తే.. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సవరణ అమలు చేయాలా.? అన్న అంశాలపై కమిటీ నివేదిక ఇస్తుందని ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
నాగిరెడ్డి అధ్యక్షతన మరో కమిటీ..
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి అధ్యక్షతన మరో కమిటీ ఏర్పాటు కానుంది. దీనిని ఉద్యోగుల గ్రీవెన్స్ కమిటీ అని పేర్కొననున్నారు. ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను ఈ కమిటీ సరిదిద్దనుంది.
ఉద్యోగుల వ్యవహారాలపై సర్కార్ కమిటీలు
Published Fri, Aug 1 2014 1:41 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement
Advertisement