సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ)కి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆ పోర్టల్‌ను నిర్వహిస్తోన్న ప్రైవేటు ఏజెన్సీ కాలపరిమితి కూడా ముగియడంతో ఈ బాధ్యతలను ఎన్‌ఐసీకి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతలతో పాటు ధరణి ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారంలోనూ వేగంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందుకోసం శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధరణి కమిటీ సభ్యులు, రెవెన్యూ అధికారులు, వక్ఫ్, దేవాదాయ, అటవీశాఖల అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్‌పీటర్, నవీన్‌మిత్తల్, మధుసూదన్ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే 22 అంశాలతో నివేదికను ప్రభుత్వానికి ఇచి్చనట్టు తెలుస్తోంది. ఈ అంశాలపై శనివారం జరగనున్న సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం.
చేవ్రాలే... ప్రాతిపదిక
ఈ సమావేశంలో భాగంగా ధరణి పోర్టల్ ద్వారా వచ్చి పెండింగ్‌లో ఉన్న 2.46లక్షల దరఖాస్తులను ఎలా పరిష్కరించాలి? భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పార్ట్–బిలో చేర్చిన 13.5లక్షల ఎకరాల కు సంబంధించిన భూముల సమస్యలను ఎలా నివృత్తి చేయాలి? అన్న దానిపై నిర్ణయాలు తీసుకో నున్నారు. దీంతో పాటు ధరణి సమస్యల పరిష్కారానికి ఆన్‌లైన్‌లో ఉన్న అస్తవ్యస్త రికార్డులను కాకుండా మాన్యువల్ పహాణీలను ప్రాతిపదికగా తీసుకునే అంశంపై కూడా చర్చించనున్నారు. రెవెన్యూ–అటవీ, రెవెన్యూ–దేవాదాయ, రెవెన్యూ–వక్ఫ్ శాఖల మధ్య అంతరాలు ఉన్న భూములపై కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలిసింది.
వీటితో పాటు ధరణి దరఖాస్తులు జిల్లా కలెక్టర్ స్థాయిలో కాకుండా ఆర్డీవో, తహశీల్దార్ స్థాయిలోనే పరిష్కారమయ్యేలా అధికార వికేంద్రీకరణపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్‌వోఆర్ చట్టంలో ఎలాగూ ఈ అధికారాలు కలెక్టర్లకు బదలాయించకపోవడంతో చట్ట సవరణ కూడా అవసరం లేదని, అధికారిక ఉత్తర్వులతో ఈ వికేంద్రీకరణ సాధ్యమవుతుందని భావిస్తున్నారు. మొత్తంగా నేడు జరగనున్న కీలక సమీక్షలో ధరణి పోర్టల్‌కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment