విస్తృత సంప్రదింపులు, ప్రజల సూచనలు, అఖిలపక్షం తర్వాతే కొత్త చట్టం
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం లోతుగా అధ్యయనం చేయాలి
సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్ట ముసాయిదాను ప్రజల్లో ఉంచి వారి అభిప్రాయాలు, సలహాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. చట్టం చేసే ముందు పార్లమెంటరీ పద్ధతిని అనుసరించాలని, మరీ ముఖ్యంగా భూ సమస్యల విషయంలో ప్రజలు, రైతుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ముందుకెళ్లడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకురావాల నుకుంటున్న ఆర్వోఆర్ కొత్త చట్టం విషయంలో విస్తృత సంప్రదింపులు జరపాలని, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాతే కొత్త చట్టాన్ని అమల్లోకి తేవాలని చెప్పారు.
సచివాలయంలో సీఎం అధ్యక్షతన శుక్రవారం ధరణి సమస్యలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు మరింత లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. ఒకప్పుడు గ్రామస్థాయిలోనే అందుబాటులో ఉండే రికార్డులు చట్టాల మార్పుతో క్రమంగా మండల కేంద్రానికి, తర్వాత జిల్లా కేంద్రానికి, రాష్ట్ర స్థాయికి వెళ్లిపోయి ప్రజలకు దూరమయ్యాయని అన్నారు.
గతంలో భూ సమస్యల పరిష్కారానికి అప్పీలు చేసుకునే అవకాశం ఉండేదని, ధరణితో గ్రామ, మండల స్థాయిలో ఏ సమస్యకు పరిష్కారం లేకుండాపోయిందని, సమస్త అధికారాలు జిల్లా కలెక్టర్‌కు అప్పగించారని వెల్లడించారు. కలెక్టర్లు తీసుకునే ఏ నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం లేకుండా ధరణిని రూపొందించారని, ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించినప్పుడే రైతులకు స్వాంతన కలుగుతుందని రేవంత్ చెప్పారు.
భూదాన్, పోరంబోకు, బంచరాయి, ఇనాం, కాందిశీకుల భూముల సమస్యలున్న ఓ మండలాన్ని ఎంపిక చేసుకొని, అక్కడ ఎదురవుతున్న సమస్యలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందిస్తే ఆ సమస్యలపైనా పూర్తి స్పష్టత వస్తుందన్నారు. అవసరాన్ని బట్టి అసెంబ్లీలో చర్చించి ఈ భూములపై తుది నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సమీక్షలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మాజీ మంత్రి కె. జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్‌పీటర్, మధుసూదన్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
నేత కార్మికులకు ఉపాధి: సీఎం రేవంత్
చేనేత, పవర్‌లూమ్ కార్మికుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టీజీసీవో) కార్యకలాపాలపై సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 తర్వాత అన్ని ప్రభుత్వ విభాగాల్లో యూనిఫాం వస్త్రాలు కొనుగోలు చేసే వారితో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ, పోలీసు, ఆరోగ్య విభాగాల్లోనూ ప్రభుత్వ సంస్థల నుంచే వస్త్రం సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సాదాబైనామా... చేద్దామా.. వద్దా?
సాదాబైనామాల పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చ జరిగి నట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 9.24 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో కొత్త ఆర్వోఆర్ చట్టంలో ఈ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి తగిన మార్గం కనుగొనాలనే చర్చ వచ్చింది. అయితే, ఒకరిద్దరు అధికా రులు ఇందుకు అభ్యంతరం చెప్పినట్టు తెలిసింది.
సాదాబై నామాలను ఇప్పటికే పలుమార్లు పరిష్కరించామని, ఇంకా అవసరం లేదని, ఒకవేళ చేసినా దుర్వినియోగం జరుగుతుందని, లేదంటే ప్రస్తుత రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేసి వారికి హక్కులు కల్పించాలని చెప్పినట్టు తెలిసింది. ఈ అభిప్రాయాలతో విభేదించిన రెవెన్యూమంత్రి పొంగులేటి ఎట్టి పరిస్థితుల్లోనూ సాదాబైనామా దరఖాస్తులను పరిష్క రించాల్సిందేనని, తాను నియోజకవర్గానికి వెళ్లినప్పుడు వచ్చే భూసమస్యల్లో ఇవి కూడా ప్రధానంగా ఉంటున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment