సాక్షి, హైదరాబాద్: ‘ధరణి’పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న 2.45లక్షల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధరణిపై ఏర్పాటైన కమిటీ చేసిన సూచనలకు అనుగుణంగా విధివిధానాలను రూపొందించాలని, రైతులు ఇబ్బందిపడకుండా దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. తహసీల్దార్ కార్యాలయాల స్థాయిలో మార్చి తొలివారంలోనే దరఖాస్తుల పరిష్కారానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ ఉన్నతాధికారులను ఆదేశించారు.
శనివారం సీఎం రేవంత్ రాష్ట్ర సచివాలయంలో ధరణి పోర్టల్‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, నవీన్ మిట్టల్, మధుసూదన్, రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, సీఎం ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ వి.లచ్చిరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధరణి కమిటీ ప్రాథమిక నివేదికను అందజేయగా.. కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ ఆ వివరాలతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఆర్‌వోఆర్ చట్టంలోనే లోపాలు..
రాష్ట్రంలో 2020లో అమల్లోకి వచ్చిన కొత్త ఆర్‌వోఆర్ చట్టంలోనే లోపాలున్నాయని, ఆ చట్టమే అన్ని అనర్థాలకు మూలమని ధరణి కమిటీ సభ్యులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనతో చిక్కులు వచ్చాయని, ఆ రికార్డులనే ప్రామాణికంగా తీసుకోవడంతో భూసమస్యలు, భూరికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని వివరించారు. లక్షలాదిగా సమస్యలు పేరుకుపోయాయని, రికార్డుల్లో చిన్న అక్షర దోషమున్నా సవరించుకునేందుకు జిల్లా కలెక్టర్ వరకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.
ధరణి పోర్టల్‌లో 35 మాడ్యూల్స్ ఉన్నా.. ఎలాంటి సమస్యకు ఏ మాడ్యూల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేక రైతులు ఇబ్బందిపడుతున్నారని సీఎంకు వివరించారు. ఇప్పటికే లక్షలాది మంది రైతులు పెట్టుకున్న దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని.. దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి రావడం రైతులకు భారంగా మారిందని తెలిపారు.
ప్రస్తుత ధరణి పోర్టల్‌ను రైతులకు ఇబ్బంది లేకుండా మార్చాలంటే.. కొత్త ఆర్‌వోఆర్ చట్టాన్ని సవరించాలని, లేదా మరో కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా.. రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపంతో.. నిషేధిత జాబితాలోని భూముల క్రయవిక్రయ లావాదేవీలు జరగడం, ఈ రికార్డుల ఆధారంగా రైతుబంధు జమచేయడంతో జరిగిన కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అంశాలపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది.
తుది నివేదిక ఆధారంగా శాశ్వత చర్యలు
వీలును బట్టి కొత్త ఆర్‌వోఆర్ చట్టానికి సవరణలు చేద్దామని.. లేదంటే మరో కొత్త చట్టం తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిద్దామని సమీక్షలో సీఎం రేవంత్ చెప్పారు. ధరణి కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే భూముల సమస్యలపై శాశ్వత పరిష్కార చర్య లు తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడున్న సమస్యల పరిష్కారం కోసం తీసుకునే నిర్ణయాలతో.. భవిష్యత్తులో కొత్త సమస్యలు రాకూడదన్నారు. ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా దోషరహితంగా భూరికార్డులు తయారుచేసేలా చర్యలు తీసుకుందామన్నారు. ఇందుకోసం లోతు గా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఇదే సమయంలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
ఎన్‌ఐసీకా... సీజీజీకా?
సమీక్షలో భాగంగా ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్య తలను ఎవరికి అప్పగించాలన్న అంశంపైనా చర్చ జరిగింది. ప్రస్తుతం పోర్టల్‌ను నిర్వహిస్తున్న ప్రైవే టు ఏజెన్సీ కాలపరిమితి కూడా ముగుస్తున్న నేపథ్యంలో.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) లేదా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు అప్పగించే విషయాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు సమాచారం. ధరణి పార్ట్–బీ లో చేర్చిన 13.5లక్షల ఎకరాల భూముల విషయంపైనా సమీక్షలో చర్చించారు. ఈ భూముల సమస్య ను పరిష్కరించేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఎట్లా పరిష్కరిస్తారు?
ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో అగ్రికల్చర్ ఆఫీసర్, పారాలీగల్ వలంటీర్, ఒక సర్వేయర్‌తో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తారు. ఆ హెల్ప్‌డెస్క్ సదరు మండలం పరిధిలోని ధరణి దరఖాస్తులన్నింటినీ పరిశీలించి నివేదిక ఇస్తుంది. తహసీల్దార్లు ఆ నివేదిక మేరకు తమ స్థాయిలో సమస్యలను వెంటనే పరిష్కరిస్తారు. లేకుంటే ఉన్నతాధికారులకు (ఆర్డీవోలు/కలెక్టర్లకు) సిఫార్సు చేస్తారు. ఇందుకు సంబంధించిన సర్క్యులర్ ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
గోప్యంగా ఉండాల్సిన వివరాలు.. ప్రైవేటుకు ఎలా?
సమీక్షలో భాగంగా ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న ప్రైవేటు ఏజెన్సీ వ్యవహారశైలిపై చాలాసేపు చర్చ జరిగింది. బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన పోర్టల్‌ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు అప్పగించాల్సి వచ్చిందని రెవెన్యూ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన లక్షలాది మంది రైతుల భూరికార్డుల డేటా, వారి ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు ప్రైవేటు ఏజెన్సీ చేతుల్లోకి.. తద్వారా విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు భూరికార్డులు సురక్షితంగా ఉన్నట్టా లేనట్టా? డేటాకు భద్రత ఉందా అని నిలదీశారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ అధికారులు మాట్లాడుతూ.. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్డింగ్‌ల ఆధారంగా అప్పటి ప్రభుత్వం ఐఎల్‌ఎఫ్‌ఎస్ కంపెనీకి ధరణి పోర్టల్ డిజైన్, డెవలప్‌మెంట్ బాధ్యతలను అప్పగించిందని వివరించారు.
తర్వాత ఆ కంపెనీ దివాలా తీయడం, టెరాసిస్‌గా పేరు మార్చుకోవడం, డైరెక్టర్లు మారిపోవడం, ఆ తర్వాత మళ్లీ వాటాలు అమ్ముకుని ఫాల్కన్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగా రూపాంతరం చెందడం వంటి పరిణామాలు జరిగాయని తెలిపారు. అయితే ఇలా బిడ్ దక్కించుకున్న కంపెనీ ఇష్టానుసారం పేర్లు మార్చుకుని కొత్త కంపెనీలను తెస్తే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని రేవంత్ ప్రశ్నించారు. భూరికార్డుల డేటాను ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా నిబంధనలు ఎక్కడున్నాయని రెవెన్యూ అధికారులను నిలదీశారు.
రూ.116 కోట్లకు ధరణి పోర్టల్ నిర్వహణ టెండర్లు దక్కించుకున్న కంపెనీ.. తమ వాటాలను ఏకంగా రూ.1,200 కోట్లకు అమ్ముకోవడం విస్మయం కలిగించిందన్నారు. రికార్డులు వారి వద్దే ఉన్నందున విలువైన భూముల యజమానుల పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గతంలో ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేశారు. అసలు ధరణి పోర్టల్ నిర్వహణపై ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకు నియంత్రణ ఉందా? అని ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటి
నేపథ్యంలో సదరు ప్రైవేట్ ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment