
సాక్షి, హైదరాబాద్: మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఆదివారం సికింద్రాబాద్ పద్మారావు నగర్‌లో ‘గృహ సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. దిగజారుడు రాజకీయాలు తగవని సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. సీఏఏ,ఎన్‌ఆర్‌సీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న మజ్లీస్ పార్టీకి కొన్ని పార్టీలు వంత పాడుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్ కూడా దీన్ని వ్యతిరేకించిందన్నారు. ‘చట్టంలో కొన్ని తప్పులు ఉన్నాయని అంటున్నారు. ఎలాంటి తప్పులున్నాయో చెప్పితే కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం’ అని తెలిపారు. బంగ్లాదేశీయులు హైదరాబాద్ లో సభ పెట్టుకొని మహిళలను కొట్టినప్పుడు మజ్లీస్ పార్టీ ఎక్కడ పోయిందో ఒవైసీ సమాధానం చెప్పాలన్నారు. జాతీయ వాదులంతా ఏకమవుతున్నారని.. ఈ చట్టంపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. జిన్నాకు వారసుడిగా కొనసాగుతున్న ఒవైసీకి బుద్ధి చెబుతామని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment