ప్రాజెక్టులపై 'మహా' ఒప్పందం
ముంబయి: తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య 'మహా' ఒప్పందం జరిగింది. గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం చారిత్రక ఒప్పందం చేసుకున్నారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్హౌస్లో జరిగిన కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ, చనాక-కొరాట బ్యారేజీలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ మూడు ఒప్పందాలపై కేసీఆర్, ఫడ్నవీస్ సంతకాలు చేశారు. తాజా ఒప్పందాలతో గోదావరిలో హక్కుగా ఉన్న 950 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం లభించింది. మంత్రులు హరీశ్ రావు, జోగు రామన్న, పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డితో పాటు మహారాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు.
మొదటి ఒప్పందం: 16 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో గోదావరిపై 100 మీటర్ల ఎత్తుతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం.
ఆయకట్టు : కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కరీంనగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్,వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కొత్తగా 18.19 లక్షల ఎకరాలు, 18 లక్షల ఎకరాల స్థిరీకరణ.
రెండో ఒప్పందం: 1.85 టీఎంసీ నీటినిల్వ సామర్థ్యంతో ప్రాణమితపై తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం
ఆయకట్టు: ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్-కాగజ్ నగర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలు.
మూడో ఒప్పందం: 0.85 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో పెన్గంగపై 213 మీటర్ల ఎత్తులో చనాఖ-కొరాట బ్యారేజీ నిర్మాణం.
ఆయకట్టు: ఆదిలాబాద్ జిల్లా తాంసి, జైనథ్, బేలా మండలాల్లో 50 వేల ఎకరాలు.