మార్చి 7 నుంచి వార్షిక పరీక్షలు
1 నుంచి 9వ తరగతి వరకు..
- ఎమ్మెల్సీ ఎన్నిక కారణంగా 9వ తేదీ నాటి పరీక్షలో మార్పు జరిగే అవకాశం
- ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం
- 14 నుంచి పదో తరగతి పరీక్షలు
- మార్చి 21 నుంచే పైతరగతుల బోధన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలను వచ్చే నెల 7వ తేదీ నుంచి నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని స్పష్టం చేసింది. అయితే వచ్చే నెల 9న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఉన్నందున.. ఆరోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని విద్యాశాఖ భావిస్తోంది. వాటిని ఏయే తేదీల్లో నిర్వహించాలన్న దానిపై త్వరలో నిర్ణయించనున్నట్లు తెలిపింది.
14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నందున... 9వ తేదీ నాటి పరీక్ష నిర్వహణకు మరొక రోజును ఖరారు చేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీలైతే 15వ తేదీన నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తోంది. 9వ తేదీన ఉదయమే పరీక్షలు పూర్తయితే మధ్యాహ్నం నుంచి టీచర్లు ఓటింగ్‌కు వెళ్లే వీలు ఉంటుందని, అలా నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్నీ పరిశీలిస్తున్నారు. మరోవైపు 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి... 17న ప్రోగ్రెస్ రిపోర్టులను విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు పంపిస్తారు. విద్యార్థుల మార్కుల వివరాలను 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు క్యుములేటివ్ రికార్డుల్లో నమోదు చేస్తారు. 20న తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ప్రోగ్రెస్ రిపోర్టులపై చర్చిస్తారు. విద్యార్థులు 21న తల్లిదండ్రుల సంతకాలు తీసుకుని క్యుములేటివ్ రికార్డులను స్కూల్లో అప్పగించాలి. అదే రోజు నుంచి 2017–18 విద్యా సంవత్సరం (పైతరగతుల బోధన) ప్రారంభం అవుతుంది.
పరీక్ష వేళలివే..
- ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వారికి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
- 6, 7 తరగతుల వారికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు
- 8వ తరగతి వారికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. వీరికి మార్చి 8వ తేదీన మాత్రం ఉదయం ఫిజిక్స్, మధ్యాహ్నం బయాలజీ పరీక్ష ఉంటాయి. మిగతవన్నీ సాధారణంగానే ఉంటాయి.
- 9వ తరగతి వారికి రోజూ ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి రెండు పేపర్లు.. ఉదయం 10 నుంచి 12:45 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు నిర్వహిస్తారు.
తరగతుల వారీగా పరీక్షల షెడ్యూల్..