రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షంతో అమీతుమీకి విపక్ష తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షంతో అమీతుమీకి విపక్ష తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఈ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై అసెంబ్లీలో ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యేలు బుధవారం టీటీడీఎల్పీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై ఏం చేశారో సమాధానం ఇవ్వాలని అధికార పక్షాన్ని నిలదీయాలని నిర్ణయించారు. సచివాలయం తరలింపు, రాష్ట్రంలో ఏర్పడిన కరువు, రైతుల ఆత్మహత్యలు, ఎక్స్‌గ్రేషియా చెల్లింపుల్లో నిర్లక్ష్యంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న నిర్ణయం జరిగింది.
విద్యుత్ కోతలు, ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్ల విడుదల, భూముల క్రమబద్ధీకరణకు విడుదల చేసిన 58, 59 జీఓలు, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకూ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇసుక, గ్రానైట్‌క్వారీలు, అక్రమ మైనింగ్, సాగునీటి ప్రాజెక్టులు, పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అసెంబ్లీ నియోజకవర్గాలకు నిధుల కేటాయింపుపైనా నిలదీయాలని పలువురు ఎమ్మెల్యేలు సూచిం చారు. రైతుల రుణమాఫీ, రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభణ, ఆసుపత్రుల పనితీరుపై చర్చ జరిగింది. మొత్తంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో 29 అంశాలపై టీటీడీపీ ఎల్పీ తమ వ్యూహాన్ని ఖరారు చేసుకుంది.