జూలై 23న టెట్‌ | Telangana TET to be held on july 23 | Sakshi
Sakshi News home page

జూలై 23న టెట్‌

Published Thu, Jun 8 2017 1:33 AM | Last Updated on Wed, Aug 15 2018 7:59 PM

జూలై 23న టెట్‌ - Sakshi

జూలై 23న టెట్‌

ఈ నెల 10న నోటిఫికేషన్‌ జారీ చేస్తాం: కడియం
- డీఎస్సీ స్థానంలో ‘టీచర్‌ సెలక్షన్‌ టెస్ట్‌’
- ఆగస్టు 6న 8,792 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఈ ఏడాది మొత్తంగా 17 వేల పోస్టుల భర్తీ
- వచ్చే ఏడాది మరో 10 వేల పోస్టులు భర్తీ చేస్తామన్న డిప్యూటీ సీఎం
- త్వరలో వైద్యారోగ్య శాఖలో 2 వేల పోస్టులు: ఘంటా


సాక్షి, హైదరాబాద్‌: ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)’కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఈ నెల 10న టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని.. వచ్చే నెల 23న పరీక్ష నిర్వహిస్తామని ప్రకటిం చింది. ఫలితాలను ఆగస్టు 5న విడుదల చేస్తామని, ఆ మరునాడే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని తెలిపింది. ఈ అంశంపై బుధవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, పాఠశాల విద్యా డైరెక్టర్‌ కిషన్, ఇతర అధికారులు సచివాలయంలో సమావేశమై చర్చించారు. అనంతరం కడియం వివరాలను వెల్లడించారు. ఈనెల 10వ తేదీన టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, 12వ తేదీ నుంచి ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ చేపడతామని తెలిపారు. వచ్చే నెల 23న టెట్‌ నిర్వహించి, ఆగస్టు 5న ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఈ పరీక్ష విద్యా శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతుందని తెలిపారు.

న్యాయ వివాదాలు తలెత్తకుండా..
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాల ప్రకారం టెట్‌ తప్పనిసరని... 2016 మే తరువాత రాష్ట్రంలో 26,100 మంది బీఎడ్‌ (18 వేలు), డీఎడ్‌ (8,100) పూర్తి చేసుకున్నారని కడియం తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయ వివాదాలు రాకుండా ఉండాలంటే వారి కోసమైనా టెట్‌ పెట్టాల్సి ఉందని.. అందుకే టెట్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. కొత్తవారితోపాటు, ఇప్పటివరకు అర్హత సాధించనివారు, అర్హత సాధించినా మార్కులు పెంచుకోవాలనుకునే వారు కూడా ఈ టెట్‌కు హాజరుకావచ్చని తెలిపారు.

వచ్చే ఏడాదీ టీచర్‌ పోస్టుల భర్తీ..
ఈ ఏడాది పాఠశాలలు, గురుకులాల్లో కలిపి 17 వేల పోస్టులను భర్తీ చేస్తున్నామని కడియం వెల్లడించారు. వివిధ గురుకులాల్లో 17,592 పోస్టులు (14,074 టీచింగ్, 3,518 నాన్‌ టీచింగ్‌) ఖాళీగా ఉండగా 8,436 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని.. మిగతా 6 వేల పోస్టులను వచ్చే ఏడాది భర్తీ చేస్తామని తెలిపారు. ఇక టెట్‌ తరువాత ప్రభుత్వ స్కూళ్లలో 8,792 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. ఇవి 2016 సెప్టెంబర్‌ వరకున్న ఖాళీలేనని, తర్వాత మరో 5 వేల వరకు ఖాళీలు ఏర్పడ్డాయని చెప్పారు. ఈ ఖాళీ పోస్టులకు, గురుకులాల్లోని 6 వేల పోస్టులకు వచ్చే ఏడాది నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు.

కొత్త జిల్లాల ప్రకారమే..
వివాదాలతో నియామకాల ప్రక్రియ ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో.. అర్హతలపై న్యాయశాఖ, జీఏడీ, ఆర్థిక శాఖలతో సంప్రదించామని కడియం వెల్లడించారు. 31 జిల్లాల వారీగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించామని... ఆయా జిల్లాల వారీగా రోస్టర్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ నిర్ణయించామని తెలిపారు. ఈ పోస్టుల భర్తీలో జోనల్‌ సమస్య ఉండదన్నారు. 84 కొత్త కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 1,260 పోస్టులను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నామని చెప్పారు.

ఇక టీఎస్‌టీ నిర్వహణ: ఘంటా చక్రపాణి
ఇక టెట్‌ ఫలితాలు వెల్లడైన మరునాడే 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ‘టీచర్‌ సెలెక్షన్‌ టెస్టు (టీఎస్‌టీ)’నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. ఇప్పటివరకు డిస్ట్రిక్ట్‌ సెలెక్షన్‌ కమిటీ (డీఎస్‌సీ)ల ఆధ్వర్యంలో పోస్టులను భర్తీ చేసినందున డీఎస్సీగా పిలిచారని.. ఇకపై టీఎస్‌పీఎస్సీ నిర్వహించనున్నందున ‘టీఎస్‌టీ’గా చేపట్టనున్నామని వివరించారు. అన్ని కలసివస్తే రెండేళ్లలో 25 వేల పోస్టుల భర్తీ లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ‘‘ఇప్పటికే 24 నోటిఫికేçషన్ల ద్వారా 5,999 పోస్టులను భర్తీ చేశాం. 7,306 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మరో 2,347 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చాం. త్వరలో వైద్యారోగ్య శాఖలో 2వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తాం.

టీఎస్‌టీ పోస్టులు 8,792 కలుపుకొంటే రెండేళ్లలో దాదాపు 25 వేల పోస్టుల భర్తీ లక్ష్యానికి చేరుకుంటాం..’’అని చెప్పారు. ఇక గ్రూప్‌–2 పరీక్ష విషయంలో కటాఫ్‌ మార్కులను ఏ సర్వీసు కమిషన్‌ ప్రకటించదని.. నియామకాల ప్రక్రియ పూర్తయ్యాక ప్రకటిస్తాయని చక్రపాణి చెప్పారు. ఏ పరీక్షా కేంద్రంలోనూ ఒకే వరుసలో ఉన్న వారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపిక కాలేదని.. హైదరాబాద్‌ 1.79 లక్షల మంది పరీక్ష రాస్తే 1,500 వరకు ఎంపికయ్యారని, నిజామాబాద్‌లో 30 వేల మంది రాస్తే 133 మంది ఎంపికయ్యారని చెప్పారు. గ్రూప్‌–2 విషయంలో అనుమానాలు అవసరం లేదని.. వెబ్‌సైట్‌లో జాబితాలు పెట్టామని, పరిశీలించుకోవచ్చని పేర్కొన్నారు.

టెట్‌ షెడ్యూల్‌ ఇదీ..
ఈ నెల 10న: టెట్‌ నోటిఫికేషన్‌ జారీ
12న: అందుబాటులోకి పూర్తిస్థాయి నోటిఫికేషన్, సమాచార బులెటిన్‌
12 నుంచి 22 వరకు: ఆన్‌లైన్‌లో ఫీజుల చెల్లింపు
13 నుంచి 23 వరకు: ఆన్‌లైన్‌లో (http://tstet.cgg.gov.in) దరఖాస్తులు
జూలై 17 నుంచి: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌
జూలై 23న: టెట్‌ పరీక్ష (పేపర్‌–1 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు. పేపర్‌–2 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5.00 వరకు)
ఆగస్టు 5న: టెట్‌ ఫలితాలు విడుదల
ఆగస్టు 6న: టీఎస్‌టీ నోటిఫికేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement