హైదరాబాద్: తెలంగాణలో వాయిదా పడ్డ ఎంసెట్, టెట్ పరీక్షల తేదీలను ఖరారు చేశారు. ఈనెల 15న ఎంసెట్, 22న టెట్‌లను నిర్వహించనున్నారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులతో సోమవారం చర్చించిన అనంతరం.. మీడియా సమావేశంలో తేదీలను ప్రకటించారు.
ఎంసెట్ రాసే అభ్యర్థులు ఈ నెల 12 నుంచి, టెట్ అభ్యర్థులు 13 నుంచి హాల్ టికెట్లను నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని కడియం శ్రీహరి సూచించారు. ఈ నెల 27న ఎంసెట్ ఫలితాలను ప్రకటిస్తారు. జూన్ నెలలో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జూలై నుంచి ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభం అవుతాయి.
వాస్తవానికి ఏపీ ఎంసెట్ ఏప్రిల్ 29న నిర్వహించగా, ఆ తర్వాత సోమవారమే.. అంటే మే 2వ తేదీనే తెలంగాణ ఎంసెట్ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. మే 1వ తేదీ ఆదివారం నాడు టెట్ నిర్వహిస్తామన్నారు. అయితే, జూనియర్ కళాశాలలపై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్సు దాడులు చేయిస్తుండటంతో.. దానిపై తెలంగాణ ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాల జేఏసీ భగ్గుమంది. టెట్, ఎంసెట్ నిర్వహణకు సహకరించేది లేదని, కళాశాలలు తెరవబోమని అల్టిమేటం ఇచ్చింది. దాంతో తప్పనిసరిగా ఈ రెండు ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రభుత్వ కళాశాలల్లోనే ఈ పరీక్షలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దానికి తగినట్లుగా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తాజా షెడ్యూలు ప్రకటించారు. ఇంతకుముందు ప్రైవేటు కళాశాలల్లో కూడా పలువురు విద్యార్థులకు సెంటర్లు ఉండటంతో, అవన్నీ మారుతాయి కాబట్టి ఈ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా కొత్తగా మళ్లీ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఇచ్చిన సెంటర్‌లో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుంది.