
‘తెలంగాణ వీరస్వామి’ మృతి
జవహర్‌నగర్: తెలంగాణ ఉద్యమంలో అరగుండుతో తనదైన శైలిలో పోరాటం చేసిన శనిగరం వీరస్వామి (తెలంగాణ వీరస్వామి) (48) సోమవారం సాయంత్రం జవహర్‌నగర్‌లోని అంబేద్కర్‌నగర్‌లో మృతి చెందారు. స్థానికులు, బందువులు తెలిపిన వివరాల ప్రకారం.. శనిగరం ఆనంద్, సుగుణమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, నలుగురు కూతుళ్లు.
వీరిలో చిన్న కుమారుడైన వీరస్వామిని ఆనంద్ తన అన్న శనిగరం మల్లయ్య, మల్లమ్మలకు దత్తత ఇచ్చారు. కాగా.. ఇటీవల వీరస్వామి సొంత తల్లి సుగుణమ్మ అంబేద్కర్‌నగర్‌లో అనారోగ్యంతో మరణించింది. సోమవారం తల్లి దశదిన కర్మ నిర్వహించారు. వీరస్వామి కొంతకాలంగా కాలేయ వ్యాధితో పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం సాయంత్రం వీరస్వామి అకస్మాత్తుగా కిందపడి మృతిచెందారు.
ప్రత్యేక తెలంగాణ కోసం టీ ఆకారంలో అరగుండుతో నిరసనలు
ప్రత్యేక తెలంగాణ కోసం ఎక్కడ ఉద్యమాలు చేసినా వీరస్వామి టీ ఆకారంలో అరగుండుతో నిరసనలు తెలిపేవారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పటి నుంచి ప్రత్యేక వేషధారణతో ఉద్యమ సభల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ సాధించాలనే తపనతో వివాహం కూడా చేసుకోకుండా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
వీరస్వామి అంత్యక్రియలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి: రాంనగర్ జేఏసీ చైర్మన్ నర్సింహ
వీరస్వామి మృతి చెందిన సమాచారం తెలుసుకున్న రాంనగర్ జేఏసీ చైర్మన్ ఎం.నర్సింహ, తెలంగాణ ఫిలిం జేఏసీ చైర్మన్ రమేష్‌బాబులు అంబేద్కర్‌నగర్‌లోని వీరస్వామి మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన మృతి తెలంగాణ ప్రజలకు తీరనిలోటని అన్నారు. వీరస్వామి అంత్యక్రియలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున వీరస్వామి అంత్యక్రియలు రాంనగర్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.